close

అంతర్యామి

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామజ వరగమనా!

‘సామజ వరగమనా’  అంటే శ్రేష్ఠమైన ఏనుగు నడక వంటి నడకగలవాడా! అని అర్థం. త్యాగరాజ స్వామివారు శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ గానం చేసిన కృతి ఇది.
ఎంతటివాడైనా తనను మించిన స్వామిభక్తుడు లోకంలో లేడన్న అహంభావం ఇసుమంతైనా ఉన్నా- వారిని భగవంతుడు క్షమించడు. భక్తుడి ఆర్తికి, నిష్కామమైన స్మరణకు ప్రసన్నుడయ్యేవాడు పరమాత్మ. భక్తిలతలు తప్ప మరేమీ ఆయనను బంధించలేవు. భక్తిలో ఆర్తి ఉండాలి. చిత్తశుద్ధి, ఏకాగ్రత ఉండాలి. శరణాగతి ఉండాలి. ‘నీవే తప్ప ఇతఃపరంబెరుగ’ అని గర్వం సర్వం ఖర్వమై  బలహీనుడై గత్యంతరం లేని నిస్సహాయ స్థితిలో పరమాత్మను నిండుమనసుతో ప్రార్థించినప్పుడు, దయ చూపని దైవముంటుందా? ‘సాంసారిక విషయ పరిజ్ఞానం అందించే స్వాభావిక ప్రవృత్తి నిష్కామరూపంలో దైవోన్ముఖమైతే అదే భక్తి’ అంటుంది భాగవతం. గీతలో ‘ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అని నాలుగు విధాలైన భక్తులున్నారు నాకు’ అంటాడు కృష్ణపరమాత్మ. భక్తిని నాదమార్గమని, రసమార్గమని రెండు విధాలుగా అభివర్ణించాడు నందదాసు. నిర్గుణోపాసనకు సగుణోపాసనే తొలి సోపానమని పేర్కొంటూ జీవుడికి బ్రహ్మకు భేదం లేదన్న అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు ఆది శంకరులు. బ్రహ్మను సగుణనిర్గుణ ఉభయలక్షణ సమన్వితుడిగా దర్శించారు రామానుజులు.
‘ఆనందో బ్రహ్మ’ అనే సూత్రాన్ని దృఢంగా విశ్వసిస్తున్నాయి ఉపనిషత్తులు. ఇది భక్తి అన్న సంగతే తెలియక ఒకానొక తన్మయావస్థలో పిచ్చి ప్రేమ, మూఢభక్తి, సమర్ప ణభావంతో ఆరాధించిన సాలెపురుగు, పాము, ఏనుగు, ఉడుత, పక్షి వంటి ప్రాణులకు సైతం కైవల్యం ప్రసాదించాడా కరుణామయుడు. శబరి, గుహుడు, అసురుడైన విభీషణుడు, వానరుడైన హనుమను అక్కున చేర్చుకుని ఆప్యాయత నందించాడు అంతర్యామి. బాల్య స్నేహానికి అమూల్య ప్రేమను కానుకగా ఇచ్చి, పిడికెడు అటుకులకే పొంగిపోయి అనంతమైన సిరి సంపదలు కుచేలుడికి ప్రసాదించాడా ఆపద్బాంధవుడు. అపారమైన ధనకనక వస్తు వాహనాలకు తూగక, భక్తితో మహాసాధ్వి సమర్పించిన ఒక్క చిన్న తులసిదళానికే వశమైనవాడు వేణుమాధవుడు. అచంచల భక్తి తత్వాన్ని ఆకళింపు చేసుకుని పారవశ్యంతో పరమాత్ముడి నామస్మరణం చేసేవారికి మోక్షప్రాప్తికి అర్హత ఉంటుందని మీరా, తుకారాం, రామదాసు, క్షేత్రయ్యలు నిరూపించారు.
సోక్రటీస్‌ శిష్యుడు ప్లేటో తన యథార్థ జ్ఞానాన్వేషణ ద్వారా భగవంతుడి అస్తిత్వాన్ని తెలుసుకున్నాడు. దైవానుగ్రహం పొందాలంటే మానవుడు జీవితాంతం సత్కర్మలు చేస్తూనే ఉండాలని సందేశమిచ్చాడు అరిస్టాటిల్‌.
ప్రేమ ద్వారా మాత్రమే దైవాన్ని తెలుసుకోగలమని ఖురాన్‌ కూడా చెబుతుంది. సర్వమతాలు ప్రేమ, సేవ, మానవీయతలనే మానవుడి పరమ లక్ష్యాలుగా ప్రబోధిస్తున్నాయి. విద్యార్జన, జ్ఞానార్జన, సంస్కృతీ సంప్రదాయాల పరిపోషణ ద్వారా, భగవత్‌ శరణాగతి లక్ష్యంగా మనోవికాసం పొంది మోక్షార్హత సంపాదించుకోవాలని సూచిస్తున్నాయి. మానవాతీత మహోన్నత శక్తి రూపంలో పరమాత్మ ఈ విశ్వాన్ని పాలిస్తున్నాడు. ఆ శక్తి ముందు మానవుడితో సహా సకల ప్రాణికోటీ అల్పమైనదే. పరమేశ్వరుడు శరణాగతత్రాణ బిరుదాంకితుడు. ఎంతటి పండితుడైనా, పరమజ్ఞాని అయినా సర్వాంతర్యామిని శరణు వేడవలసిందే! ‘నేను’ అన్న అహం వీడి నిర్మల హృదయంతో ‘సామజవరగమనా’ అని వినమ్రతతో, విధేయతతో, అతుల భక్తితో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ని, ఆర్తత్రాణ పరాయణుణ్ని అర్చించడం, ఆరాధించడం, విశ్వసించడం వినా- మానవుడికి మరో మార్గం లేదు. ఆ మార్గ ప్రయాణంలో మనకు సంతృప్తినిచ్చే విరామమే- మానవసేవ, భూతదయ, ధర్మవర్తన, కరుణ. ఈ విరామమే రామదర్శనం చేయించగలుగుతుంది!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు