ప్రేమ జగత్తు

అంతర్యామి

ప్రేమ జగత్తు

కాలం, ప్రదేశం, పరిస్థితులకు అనుగుణంగా భగవంతుడు అనేక అద్భుత మార్గాల్లో మనిషికి సాక్షాత్కరిస్తూనే ఉంటాడు. ఎందుకు ఇన్ని రకాల మతాలు, ధర్మాలు అని మనుషులు తర్జనభర్జనలు పడటంలో అర్థముంది. నిజం చెప్పాల్సివస్తే ఉన్నది ఒకే ఒక మతం. దైవశక్తికి తలవంచడం... విధేయతతో జీవించడం, కృతజ్ఞతతో మెలగడం అవసరం. అంతా తన ఘనతేనంటూ మిడిసిపాటు తగదు. ఏదీ తన చేతిలో లేదు. మనిషి కేవలం నిమిత్త మాత్రుడే. ఈ సత్యం తెలియజేసే సందర్భాలు అనేకం తటస్థిస్తుంటాయి.
దైవంపట్ల ప్రేమను పెంచుకోవడం ధర్మం. సనాతన ధర్మం అంటే మనుషులంతా దైవ స్వరూపానికి చెందిన అంశగా భావించడం. ఆయనను ప్రేమతో సేవించడం, సేవలు అందించడం. సనాతన ధర్మం, సర్వమతాలను అంతర్లీనంగా కలిపి ఉంచే దివ్యసూక్ష్మం.
సృష్టిలో ప్రతి ప్రాణికీ ప్రేమ, వాత్సల్యం అవసరం. అవి హృదయం ఆశించే ప్రాథమికమైన తపన. ప్రేమ ఆత్మసంబంధమైనది... శాశ్వతం. దాని నుంచి గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందగలిగే స్థితి లభిస్తుంది.
మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు ఆరోగ్యం మెరుగుపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో వైద్య విధానాలు అనుసరిస్తాడు. ప్రపంచంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం మానసికంగా కుంగిపోతున్నారు. ఒత్తిళ్లకు లోనవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం వెనకాడటం లేదు. శారీరక ఆరోగ్యం ఒక్కటే మనిషిని ఆరోగ్యంగా ఉంచలేదు. భౌతిక పరమైన సంపదలు, సౌకర్యాలూ ఆనందాన్ని తెచ్చిపెట్టలేవు. ప్రపంచంలో సర్వం సొంతం చేసుకుని ఒంటరి జీవితం సాగించాల్సి వస్తే పరిస్థితి ఏమిటో అప్పుడు అర్థమవుతుంది. ప్రేమ ఇచ్చినప్పుడే తిరిగి వస్తుంది. మనిషికి, ఆ మాటకొస్తే ప్రతి ప్రాణికీ తోడు అవసరం. మతాలన్నీ ప్రేమే దైవం అని చాటి చెబుతున్నాయి. ప్రేమ సహజమైన ఆత్మశక్తి. ఆ ప్రేమతో పరమాత్మ అనుగ్రహం సంపాదించాలి.
మహాభారతంలో భీష్ముడు ఎల్లవేళలా న్యాయబద్ధత, విశ్వసనీయత, భగవంతుడి పట్ల సేవాభావం కలిగిన మహోన్నత వ్యక్తి. వ్యర్థకార్యం కోసం పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా అపార్థాలపాలవుతాడు. దుర్యోధనుడి ఉప్పు తిన్న కారణంగా భీష్ముడు దుర్మార్గపు పనుల కోసం తలవంచాడని, అతడి పక్షం వహించాడని జనం భావిస్తారు. శ్రీకృష్ణుడి ఇష్టానుసారం భీష్ముడు కౌరవ పక్షం వహిస్తాడు. ప్రపంచానికి శ్రీకృష్ణుడు చూపిన గొప్ప దృష్టాంతం ఇది. ఆయన తన భక్తుడినే ప్రయోగించాడు. భక్తుడే అయినా తాత్కాలికంగా శత్రుపాత్ర పోషిస్తాడు.
మనిషి ఎంత గొప్పవాడైనా, ఎన్ని శక్తిసామర్థ్యాలు, సంపదలున్నా భగవంతుడి పక్షం వహించకపోతే అపజయం పాలవక తప్పదు. శ్రీకృష్ణుడు అచ్యుతుడు. అతణ్ని జయించడం అసాధ్యం. అటువంటి శ్రీకృష్ణుణ్ని భక్తులు ప్రేమతో తేలిగ్గా గెలవగల వీలుంది. ‘నా భక్తులు ఎప్పటికీ నాశనం కావడమన్నది ఉండదు. నేను ఎప్పుడూ వారికి రక్షణగా నిలుస్తాను’ అంటాడు కృష్ణపరమాత్ముడు గీతలో అర్జునుడితో.
ఆర్థిక స్థితిగతులు, కులమతాలు, వయోభేదాలు... దేనితోనూ సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకోగలిగే గొప్ప తత్వం ప్రేమ. ప్రేమ ఒక దివ్యౌషధం. పసివారి బోసి నవ్వులకైనా పండు ముసలివారి ఆయుర్దాయాన్ని పెంచడానికైనా... అవసరమైనది ప్రేమ!

- మంత్రవాది మహేశ్వర్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న