జనన మరణ చక్రం

అంతర్యామి

జనన మరణ చక్రం

లోకంలో ప్రాణికోటికి చావుపుట్టుకలు సర్వసామాన్యాలు. ప్రాణులు ఒకచోట పుడుతూ ఉంటే మరోచోట మరణిస్తూ ఉంటాయి. ప్రాణుల్లో మానవులూ అంతర్భాగాలే. ఈ జననమరణ చక్రంలో యుగాల కాలం గడచిపోతూనే ఉంటుంది. సుదీర్ఘకాల ప్రవాహంలో కోట్లకొలది ప్రాణులు పుడుతూ, మరణిస్తూ కాలగర్భంలో కలిసిపోతున్నారు.
శరీరాలు అశాశ్వతాలు. ఆత్మ శాశ్వతం. ఇది అనంతకాలంగా కొనసాగుతున్న వాస్తవం. శరీరం అనే పంజరంలో దాగిన చిలుకలా ప్రాణం ఆత్మ రూపంలో ఉంటుంది. ప్రాణం కంటికి కనిపించనట్లే, ఆత్మ కూడా కంటికి కనబడదు. ఆత్మ నిత్యం. ఆత్మ సత్యం. ఆత్మ సర్వాంతర్యామి.
శరీరాలు వస్త్రాలవంటివని భగవద్గీత చెబుతోంది. వస్త్రాలు కాలం గడుస్తున్న కొద్దీ పాతబడిపోతుంటాయి. అక్కడక్కడ చిరుగులు కనబడుతుంటాయి. అదే విధంగా మానవ శరీరాలనే వస్త్రాలూ కాలం గడుస్తున్న కొద్దీ జీర్ణమై, శిథిÅలమవుతుంటాయి. మనిషి పాతబట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరించినట్లే,  ఆత్మ కూడా పాతబడిన శిథిÅల శరీరాన్ని వదిలిపెడుతుంది. మళ్ళీ మరొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నశించిపోతున్నది శరీరమే కాని, ఆత్మ కాదు. ఇదే పరమార్థం.
జననం ఉన్నప్పుడు, మరణం తథ్యం కనుక మనిషి మరణానికి భయపడనక్కరలేదు. ఏ మనిషీ వేల ఏండ్లు జీవించలేడు. జీవించినా అతడికి తన బతుకు మీద విరక్తి కలుగుతుంది. తన కళ్లముందే అందరూ మరణిస్తుంటే, దాన్ని చూస్తూ మనిషి ఆనందంగా ఉండలేడు కదా? అందుకే మనిషికి ‘కాలధర్మం’గా మరణం సరైనదే. మనిషి  సహజ మరణానికి లోనైతేనే అతడి జన్మ పరిపూర్ణమవుతుంది.
మనిషికి భగవంతుడు ప్రసాదించినవి నాలుగు దశలు. అవే- బాల్య, కౌమార, యౌవన,  వార్ధక్యాలు. ఒక్కొక్క దశకు నిర్దిష్టకాలం ఉంటుంది. అది క్రమంగా పూర్తయినప్పుడు మనిషి ఒక్కొక్క దశను దాటుకుంటూ జీవిత చరమదశకు చేరుకుంటాడు. దోసపాదుకు పుటిన దోసకాయ కాలానుగుణంగా పండిపోయి రాలిపోవాలే కాని, మధ్యలోనే జారి పడిపోకూడదు. మానవ జీవితం సైతం నాలుగు దశలనూ అధిగమించి, అంత్యకాలంలో రాలిపోవాలే కాని- అర్ధాంతరంగా ముగిసిపోకూడదు. ఇదే విషయాన్ని వేదం ప్రబోధిస్తున్నది.
జననమరణాలు ఒక చక్రం వంటివి. చక్రం తిరుగుతున్నప్పుడు అందులోని అరలు పైకి,  కిందికి వచ్చిపోతుంటాయి. జననమరణాలు అంతే. ‘పునరపి జననం, పునరపి మరణం’ అన్నట్లుగా కొనసాగుతూ ఉంటాయి. ఈ చక్రభ్రమణం ఎంత కాలమైనా నడుస్తూనే ఉంటుంది.
కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అంటాడొక కవి. దీన్నే తాత్వికంగా చెప్పినప్పుడు భగవంతుడు కన్ను తెరిస్తే సృష్టి జరుగుతుందని, ఆయన నిద్రలోకి జారుకున్నప్పుడు ప్రళయం సంభవిస్తుందని వ్యాఖ్యానించడం కనబడుతుంది. భగవంతుడిది యోగనిద్ర. ఆ నిద్రలో ఆయన సమస్త లోకాలను దర్శిస్తూనే ఉంటాడు. లోకరక్షణలో జాగరూకుడై ఉంటాడు. కనుక మానవుడి నిద్రకు, భగవంతుడి నిద్రకు భేదం ఉంటుంది.
జననం ఎంత మంచిగా జరగాలో, మరణం అంత సునాయాసంగా సంభవించాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడు. మనిషి తాను బతికినంతకాలం ఆయురారోగ్య భాగ్యాలు సంపూర్ణంగా లభించాలనే కోరుకుంటాడు. అదే మనిషికి సంతృప్తికరమైన అంశం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న