ఏది ధ్యానం?

అంతర్యామి

ఏది ధ్యానం?

పూజలే పరమావధా, ధ్యానమే ధ్యేయమా? ఏది అవధులు లేని అనంతత్వానికి దారి తీస్తుందో, ఏది ఏదీ లేని, ఏదీ కాని మహా మౌనానికి, మహత్వపూర్ణ సర్వ శూన్యానికి బాట వేస్తుందో... అదే పూజ. అదే ధ్యానం. అదే మరోటేదీ కాని సర్వస్య సర్వం. ఆ స్థాయికి ఎదగడమన్నది ఆ స్థితికి చేరడమన్నది ఒక చట్రంలో ఇమిడిపోయే, ఒక సూత్రంలో అమరిపోయే పరిమిత కార్యాచరణకు సాధ్యం కాదు. ముందు దాని అపరిమిత విశాలత్వాన్ని అర్థం చేసుకోవాలి. పైకి, అనంతంలోకి చొచ్చుకుపోయిన కొన తెలియని, కొస లేని దాని ఔన్నత్యాన్ని అవగాహన చేసుకోవాలి. మన మహోన్నత సాధనలో ఏది పనికిరాదో ఏది చాలనిదో దాని అల్పత్వాన్ని అంచనా వేయాలి.
హిమాలయాలు అధిరోహించాలంటే మూరెడు తాడుతో జానెడు కర్రతో బయల్దేరితే కుదరదు. సముద్రాన్ని పట్టి తెచ్చేందుకు చిన్న మరచెంబును వెంటబెట్టుకుని వెళ్తే చాలదు. నిజమే... జీవితం చాలా చిన్నది. అయినా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకునేందుకు మనకున్న అవధి ఇదే. పరమావధీ ఈ చిన్న జీవితమే. పరీక్షల్లో విద్యార్థి తనకిచ్చిన ప్రశ్నలకు పరిమిత కాల వ్యవధిలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అది కొంచెం కష్టమే. సిద్ధంకాని వారికి కష్టమే అయినా దాన్ని సాధించాలంటే, సాధ్యం చేసుకోవాలంటే మొదటి రోజునుంచే ప్రయత్నం ప్రారంభించాలి. పఠనంలో మునిగిపోవాలి. నిర్ణయించిన తేదీ లోపల పని పూర్తి చేసుకోవాలి. ఫలితం కరతలామలకం అవుతుంది. పరమపదమూ అంతే. అందుకు పాఠశాల పరీక్షల మాదిరిగా సంవత్సరం కష్టపడితే చాలదు. అది నిరంతర సాధన. నిర్విరామ శోధన... జీవిత పర్యంతమూ సాగాలి.
విద్యార్థుల పరీక్షలకు ఒక తేదీ కేటాయిస్తారు. మనిషికి అలా కాదు. ఆ తేదీ ఏదో, ఎప్పుడు, ఎన్నాళ్లకు వస్తుందో తెలీదు. కానీ ఇచ్చే కాల వ్యవధి మాత్రం ఒక జీవితం. ఎప్పుడు ముగుస్తుందో ఏ మాత్రం తెలియని జీవితం. అధ్యయనం పూర్తి చేయడానికైనా, సన్నద్ధం కావడానికైనా, పూర్తిచేసి నిశ్చింత పొందడానికైనా అవకాశం లేని పేద్ద పరీక్షిది. అందుకే తత్వకథ తెలియాలి. ఈ జీవిత కాలాన్ని మనం అధ్యయన కాలంగానే సాధనా కాలంగానే పరిగణించి అనుక్షణం సాధన చేయాలి. సిద్ధం అయ్యే ప్రయత్నంలోనే ఉండాలి. ముఖ్యంగా సన్నద్ధత పూర్తి అయిందో లేదో తెలియని ఈ అయోమయ, అనూహ్య స్థితిని మోసే మనిషికి నిత్య అధ్యయనం, అనుక్షణ సాధన తప్ప మరోదారి లేదు. ఉండదు. అయితే చిల్లుల బిందెలో నిరంతరం నీళ్లు పోసినా, లంగరు వేసిన నావను నిర్విరామంగా నడిపినా అర్థంలేని చర్యే అవుతుంది. వృథా శ్రమే అవుతుంది. ఆ ధ్యేయాన్ని, ఆ గమ్యాన్ని మనం విశ్వసించాలి. ప్రేమించాలి. అయినా అది అంత పసలేని పనేమీ కాదు. నిర్వీర్యమైన నిరీక్షణా కాదు. భగవత్‌ సాధన అనేది సమయమే తీసుకోని తత్‌ క్షణ మాధుర్యం, అమ్మ చేతిలో దెబ్బలు తినడంలాంటి కమనీయ అనుభవం. దాన్ని ఆహ్వానిద్దాం. ఆస్వాదిద్దాం. అన్నింటికంటే ముఖ్యంగా జన్మజన్మల సుకృత ఫలంగా మాత్రమే ఈ మానవ జన్మ లభించిందనే తిరుగులేని సత్యాన్ని మనం గ్రహించగలిగితే అనుక్షణాన్నీ అమృతోపమానంగా ఆస్వాదిస్తాం. అనుభవం పొందుతాం!

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న