మానావమానాలు

అంతర్యామి

మానావమానాలు

గతిలో (అభి)మాన ధనులే గాని అవమాన ధనులు ఉండరు. మాన(సన్మాన) అవమానాల పట్ల సమభావం కలిగినవాడిని గుణాతీతుడని శ్రీకృష్ణ భగవానుడు ప్రశంసించాడు. చిన్నదైనా, పెద్దదైనా కలిగే అవమానం మనిషిని బాధిస్తుంది. అందుకు భిన్నమైనది ప్రశంస! అవమానం విద్వేషాగ్ని రగిలిస్తే- ప్రశంస మనిషి హృదయంలో అమృతపు జల్లు కురిపిస్తుంది. ప్రశంసకు హద్దులు లేవు... అవమానానికి ఎల్లలు ఉంటాయి.
వాడిగా ఉన్న బాణపు ములుకులా చూపు, మాట, చేతలతో ప్రత్యర్థిపై దాడి చేసినప్పుడు అతడిలో అవమానాగ్ని రగులుతుంది. బాధితుడు బలవంతుడైతే అంతకు అంతా బదులు తీర్చుకుంటాడు. బలహీనుడైన సందర్భంలో ఏమీ చేయలేని అసమర్థత అతడి అహాన్ని దెబ్బ తీస్తుంది. రగిలిన ప్రతీకారేచ్ఛ అగ్నిస్పర్శలా అతడిని బాధిస్తుంది. కొందరికి తమ సంపద, విద్య, అంగసౌష్ఠవం, రంగు, సౌందర్యం, కులం, మతం, జాతి తదితరాల కారణంగా అహం బలపడుతుంది. ప్రత్యర్థిగా భావించే వ్యక్తి తాము చేయలేని ఓ ఘనకార్యం చేస్తే, దాన్ని అంగీకరించలేక తృణీకార భావం పెంచుకుంటారు. ఘనతను సమాజం గుర్తించినా తాము గుర్తించడానికి ఇష్టపడరు. అవమానించాలన్న తలపు కలగాలేగానీ, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మాటలతో, చేతలతో ప్రత్యర్థిని నిందించి అవమానానికి గురి చేస్తారు.
పాండవుల బల పరాక్రమాలను, ఆధిక్యాన్ని అంగీకరించలేని దుర్యోధనుడు వారిని మాయాద్యూతంలో ఓడించి అడవులకు పంపాడు. వారు ఆనందంగా జీవిస్తున్నారని తెలుసుకొని లక్క ఇంటి ప్రవేశం చేయించి ప్రాణాలతో తగలబెట్టే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు జూదంలో ఓడిపోగానే ద్రౌపదిని వివస్త్రను చేసి అవమానించేందుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు.
మామగా తనకు శివుడు తగిన గౌరవం ఇవ్వడం లేదని భావించాడు దక్ష ప్రజాపతి. పరమేశ్వరుడి పట్ల తృణీకారభావం పెంచుకొని నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి శివుణ్ని ఆహ్వానించక అవమానించాడు. శివసతి సతీదేవి, భర్త వారించినా వినక యాగానికి వెళ్ళి భంగపడింది. తండ్రి పరమేశ్వరుడిని నిందించినప్పుడు తట్టుకోలేక పోయింది. యోగాగ్ని రగిలించుకొని భస్మమైంది. పరమేశ్వరుడి పట్ల దక్షుడు ప్రదర్శించిన తిరస్కారం అతడి మరణానికే కారణమైంది.
సీతమ్మను వెదుకుతూ రావణుడి రాజధాని లంకకు చేరుకున్నాడు హనుమంతుడు. రావణ సభలో తీవ్ర అవమానం పొందాడు. రాక్షసులు అతడి తోకకు నిప్పంటించారు. మారుతి ఆ అవమానాన్ని లెక్క చేయలేదు. లంకను భీకర అగ్నికీలలకు ఆహుతి చేస్తాడు. కోపంతో లంకను తగలబెట్టినా సీతమ్మ ఎలా ఉందోనని ఆందోళన చెందాడు. ఆమె క్షేమంగా ఉండటం చూశాక గానీ ఆంజనేయుడి మనసు కుదుటపడలేదు.
అవమానించడం రాజస తామస లక్షణం! గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం వారి సంస్కృతి. సత్వగుణ శోభితులు అవమానాన్ని పొందినా తొందరపడి ప్రతీకారానికి పూనుకోరు. దాన్ని చేతకానితనంగా భావిస్తారు మూర్ఖులు. తాము పొందిన అవమానాలకు ధర్మనిష్ఠతో పాండవులు ప్రతీకార చర్య చేపట్టని కారణంగా వారిని దుర్యోధనాదులు చేతకానివారిగా భావించారు.
అవమానించడం వల్ల తాత్కాలికంగా అహం చల్లారుతుందేమోగాని అది ఎంతటి దుశ్చర్యో, దానికి నిష్కృతి ఏమిటో బోధపడదు. లోకంలో దుష్కర్మలకు దుష్ఫలితాలే సంభవిస్తాయి. సత్కర్మలకు సత్ఫలితాలే అందివస్తాయి. ఎవరినీ అవమానించని మనస్తత్వం సాధన వల్ల సిద్ధిస్తుంది. విమర్శకు హద్దులు ఉంటాయి. ప్రశంసకు అవధులు లేవు. ఫలితం మధురంగానే ఉంటుంది. గెలుపు గుర్రాలెక్కిన ఎందరో మహనీయుల మౌలిక లక్షణం స్నేహశీలత!

- గోపాలుని రఘుపతిరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న