చిరస్మరణీయులు

అంతర్యామి

చిరస్మరణీయులు

‘పుట్టినవారికి మరణం తప్పదు. మరణించినవారికి పుట్టుక తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి విచారించ తగదు’ అని బోధించాడు గీతాచార్యుడు. ఇది పరమ సత్యమే అయినా ఈ లోకంలో మృత్యువు గురించి భయపడని మనిషి ఉండడు.
అసలు మనిషి మృత్యువుకు ఎందుకు భయపడుతున్నాడు? కేవలం దేహాభిమానం వల్ల మాత్రమే. అంతే కాదు, మనిషి తనకు ఇష్టమైన వాటిమీద అంటే తన భార్య, పిల్లలు, బంధువులు... ఇలా అందరి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటాడు. మృత్యువు ఈ బంధాలను దూరం చేస్తుందేమోనని ఆందోళన చెందుతాడు.  నిరంతరం మృత్యువుకు భయపడుతుంటాడు.
మనిషి మనసు విషయ వస్తు వ్యామోహాలనుంచి విడివడాలని చెబుతారు సద్గురువులు. దేహాభిమానం వదిలితే జీవుడు దేవుడే. ఎవరైతే తమ మనోబుద్ధులను పరమాత్మలో నిలుపుతారో వారు ఆ పైవాడిలో ఎల్లప్పుడూ నివసిస్తారు. వారు దేనికీ భయపడరు. ఎలాంటి విపత్తు ఎదురైనా చలించరు. స్థితప్రజ్ఞుడిలా అన్నింటినీ ఒకేలా స్వీకరిస్తారు.
దారిలో రాళ్లు దొర్లిపడినప్పుడు బెంబేలెత్తిపోకుండా వాటిని మెట్లుగా మలచుకునే ప్రయత్నం చేయాలంటారు విజ్ఞులు. పరీక్షిత్తు మహారాజుకు ఏడురోజుల్లో మరణం తప్పదని తెలిసిపోయింది. వెంటనే ఆయన శుకమహర్షిని ఆశ్రయించాడు. తరించే మార్గాన్ని చూపమని వేడుకున్నాడు. భాగవత శ్రవణంతో ఆయన మృత్యు భయాన్ని పోగొట్టుకున్నాడు. పరమపదం చేరుకున్నాడు.
అత్యంత దుర్లభమైన మానవజన్మ పొంది కూడా ముక్తి కోసం ఆలోచించని వారిని మూఢులు అంటారు ఆదిశంకరులు. శాశ్వత ఆనందం కలిగించని భౌతిక సుఖాల కోసం మనిషి వెంపర్లాడకూడదు.
భౌతిక సుఖ కాంక్ష అంత త్వరగా వదిలేది కాదు. ఎంత తీర్చుకున్నా మరింత కావాలనిపిస్తుంది. ఇతర జీవుల్లా మనిషి కూడా సుఖలాలసకు దేహాభిమానానికే పరిమితమైతే- కొడుకు యౌవనాన్ని తీసుకుని అనుభవించినా సంతృప్తి చెందని యయాతి మహారాజులా మిగిలిపోతాడు. పశుపక్ష్యాదులతో సమానమవుతాడు. అందుకే మనిషి మృత్యుభయం వీడి జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నిరంతరం సత్కర్మలు ఆచరించాలి.
మనిషి చనిపోయిన తరవాత జీవాత్మతో ధర్మమొక్కటే వెళుతుందని మహర్షి మనువు బోధించాడు. ఈ సత్యం తెలుసుకున్న మనిషి ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకోడు. ధర్మమార్గంలో నడుస్తాడు. సత్‌ ప్రవర్తన కలిగి త్యాగభావంలో జీవిస్తాడు. మనిషి ఎలా జీవించాడని కాదు, ఎలా మరణించాడో చూడాలంటారు పెద్దలు. మంచి మరణం ధర్మవ్రతుడికే లభిస్తుంది. ఆ ధర్మమే మరణం తరవాత అతడిని బతికిస్తుంది. మరణానంతరం కూడా అతడు కీర్తిప్రతిష్ఠలు కలిగి చిరస్మరణీయుడవుతాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, గాంధీజీ వంటివారు సత్‌ ప్రవర్తనతో నియమబద్ధమైన జీవితం గడిపి తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధించారు. మహాత్ములుగా నిలిచిపోయారు.
ఏ వ్యక్తి అయినా పదిమందీ ఘనంగా చెప్పుకొనే విధంగా జీవితాన్ని మలచుకోవాలి. నిత్యం, నిఖిలం అయిన కర్తవ్య పరాయణ, ధర్మాచరణ కోసం కృషిచేయాలి. అనిత్యమైన వాంఛలను వీడి ఉదాత్తపథం వైపు దృష్టి మరల్చితే ఈ సమాజం మొత్తం ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. ఆ సమాజ సేవే పరమాత్మ సేవగా గ్రహించి, ఆచరించిన మనిషిని సమాజంలో అందరూ అభిమానిస్తారు. గౌరవిస్తారు. ఆ మనిషి మరణించినా అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు!

- విశ్వనాథ రమ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న