ధర్మపీఠాధిపతి

అంతర్యామి

ధర్మపీఠాధిపతి

డపిల్ల పుట్టగానే పూడ్చిపెట్టే మూర్ఖ సమాజంలో ఒక స్త్రీ నలభై సంవత్సరాలకు పైగా ధర్మ పీఠాధిపతిగా నిలిచింది. ఆమె జీవితం మొహ్మద్‌ (స.అ.వ.) ప్రవక్తతో ముడివడి ప్రపంచానికి శాశ్వత జ్ఞాన సందేశాన్ని అందించింది. హజ్రత్‌ అబూబకర్‌ సిద్దిఖ్‌, హజ్రత్‌ ఉమ్మెరుమాన్‌ దంపతుల గారాల పట్టి హజ్రత్‌ ఆయేషా సిద్ధిఖీ క్రీ.శ. 613 సంవత్సరంలో జన్మించారు. ఇస్లామీయ వాతావరణంలో పెరిగారు. తొమ్మిదేళ్ల వయసులో ఆధ్యాత్మిక విప్లవోద్యమ సారథిÅ ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.)ను వివాహమాడారు. ఆమె ప్రవక్తకు ప్రియమైన భార్య. వారిరువురి బలమైన మేధాబంధం ఇస్లాం ధర్మవ్యాప్తికి తోడ్పడింది.

గొప్ప తెలివితేటలు, అవగాహనా శక్తి కలిగిన హజ్రత్‌ ఆయేషా(ర.అ.) నుంచి మతపరమైన పద్ధతులను తెలుసుకొని విలువైన సూచనలు తీసుకొని పాటించవలసిందిగా తన సహచరులకు ప్రవక్త(స.అ.వ.) ఆదేశించేవారు. పవిత్ర ఖురాన్‌ గ్రంథాన్ని ఆమూలాగ్రం స్మరించగలిగే అమోఘమైన జ్ఞాపకశక్తి ఆయేషా(ర.అ.) కలిగి ఉండేవారు. రెండు వేల రెండు వందలకు పైగా హదీసులను వివరించేవారు. పద్దెనిమిదేళ్ల ప్రాయంలో ఉన్న హజ్రత్‌ ఆయేషా(ర.అ.) ఒడిలో ప్రవక్త మొహమ్మద్‌(స.అ.) చివరి శ్వాస విడిచారు. మొక్కవోని ధైర్యంతో అల్లాహ్‌ ఏకత్వాన్ని ప్రబోధిస్తూ ఆమె జీవితమంతా త్యాగ వైరాగ్య భావనలతో గడుపుతూ ఆదర్శ మహిళగా కీర్తి పొందారు.
శత్రువులు పెట్టిన కష్టాలను, అపనిందలను ఎదుర్కొని విజేతగా సచ్ఛీలురాలిగా నిలిచారు. ఇస్లాం ధర్మ సూక్ష్మాలను ప్రజలకు విడమరచి చెబుతూ వారి మన్ననలు పొందేవారు. ఆమెకున్న విశేష ప్రజ్ఞా పాటవాలను చూసి ప్రజలు విస్మయం చెందేవారు.
మదీనాలో మూడో ఖలీఫా ఉత్మాన్‌ పాలన కాలంలో హజ్రత్‌ ఆయేషా(ర.అ.) ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రధాన పాత్ర వహించి, గొప్ప నాయకురాలిగా సేవ చేశారు. హజ్రత్‌ అలీ ఆమెను అత్తగారిగా ఎంతో గౌరవించేవారు.
కొన్ని లక్షల దిర్హమ్‌లు ఆమెకు కానుకలుగా వచ్చేవి. వాటన్నింటినీ ఆమె దానం చేసేవారు. దైవ దాసునికి ప్రాపంచిక సౌఖ్యాల వల్ల గర్వం ఏర్పడితే అల్లాహ్‌ ఆ వైపు చూడడు అని వ్యాఖ్యానిస్తూ నిరాడంబరంగా జీవించేవారు. ఉపవాసాలు పాటించే ఆమె ఇంట కొన్ని రొట్టెలు మాత్రమే ఉండేవి. ఎవరైనా ఆకలిగొన్న వారొస్తే అవీ దానం చేసేవారు. ఎవరైతే అణుమాత్రం పుణ్యం చేసుకుంటారో వారు పరలోకంలో దాని ఫలితం చూస్తారు అని బోధించేవారు.
యతిప్రాసలు, శబ్దాలంకారాలు అల్లాహ్‌కు చేసే దుఆల్లో ఉండనవసరం లేదని, దైవగ్రంథం పట్ల వెగటు కలిగేలా అడగనివారికి హితబోధలు చేయరాదని, తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికే హితబోధ చేయాలని అనుచర సహాబీలకు చెప్పేవారు. రంజాన్‌ పవిత్ర మాసంలో హజ్రత్‌ ఆయేషా ప్రత్యేక తరావీహ్‌ నమాజు ఎంతో శ్రద్ధాభక్తులతో చేసేవారు. సూర్యోదయమైన తరవాత చాష్త్‌ నమాజును క్రమం తప్పక చేసేవారు.
హజ్రత్‌ ఆయేషా(ర.అ) గురించి దివ్య ఖుర్‌ఆన్‌లో అనేక ఆయత్‌లు అవతరించాయి. తత్త్వజ్ఞానంతో ధార్మిక తీర్పులిస్తూ విశ్వాసుల తల్లిగా మొహమ్మద్‌(స.అ.వ.) సంప్రదాయాన్ని కలకాలం ఉండేటట్లు ఆమె యావజ్జీవితాన్ని అంకితం చేసి క్రీ.శ. 678వ సంవత్సరంలో పరమపదించారు. పవిత్ర రంజాన్‌ మాసంలో హజ్రత్‌ ఆయేషా సిద్ధిఖీ(ర.అ.)ని కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటారు. ఆమె చిరస్మరణీయురాలు.

- షేక్‌ బషీరున్నీసా బేగం


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న