జీవిత ధ్వనులు

అంతర్యామి

జీవిత ధ్వనులు

‘తిరక్కపోతే మనిషి చెడిపోతాడు’ అనేవారు పూర్వకాలంలో పెద్దలు. ఆ రోజుల్లో ఏ విద్యా ప్రదర్శనకో, సాహిత్య సమావేశాల నిమిత్తమో దేశమంతటా పర్యటించడాన్ని కవులు గొప్ప అనుభవంగా పరిగణించేవారు. భక్తులైతే తీర్థయాత్రలను సేవించడం అద్భుత పుణ్యకార్యంగా భావించేవారు.
గోదావరి ఒడ్డున పుట్టి పెరిగిన ప్రసిద్ధ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఖమ్మందాకా ప్రయాణించడాన్ని తన ‘కథలూ- గాథలూను’లో అబ్బురంగా వర్ణించారు. తన దేహంలోకి కొత్త ప్రాణం వచ్చి చేరిందన్నారు. అతికష్టంమీద రాష్ట్రం నలుమూలలా పర్యటించి తన పంచప్రాణాలు చైతన్యవంతమయ్యాయని పొంగిపోయారు. తెలుగు జాతి జీవనాడి తెలిసిందని, తెలుగుభాష ఆత్మస్వరూపం అనుభూతమైందని అనిపించిందాయనకు. వారి అనుభవాన్ని అర్థం చేసుకొంటే నేటి ప్రపంచ పర్యాటకుల మనోగతాన్ని సూక్ష్మరూపంలో దర్శించినట్లు అనిపిస్తుంది.
ఉదాహరణకు ‘భారతీయ ఆత్మ అవగతం కావాలంటే కుంభమేళాను సందర్శించాలి’ అన్నారొక ప్రసిద్ధ ప్రపంచయాత్రికుడు. కుంభమేళాను సందర్శించడమంటే కిక్కిరిసిన జనసందోహాన్ని గమనించి ముక్కున వేలేసుకోవడం కాదు. కుంభమేళాలనగా, నదీపుష్కరాలనగా  ఈ దేశంలో జనం జలదేవతకు సమర్పించే నీరాజనం. పుష్కరుడి రాకతో పులకించిపోయే పుణ్యజలాలు, భక్తజనంతో కిటకిటలాడే స్నానఘట్టాలు, వేదఘోషతో ప్రజ్వరిల్లే యాగవాటికలు, నదీతీరాలకు పోటెత్తే జనసాగరాన్ని చూసి ఉప్పొంగిపోయే పుణ్యతీర్థాలు, పరమేశ్వర విభూతిని ఆస్వాదించే భక్త మహాశయులు, జనతా జనార్దన చైతన్యాన్ని అనుభూతం చేసుకొనే ఆసక్తిపరులు... ఒకటేమిటి? జలసంబరాలు ప్రజల సమష్టి చైతన్య మహావిరాట్‌ స్వరూపానికి ఆనవాళ్లు.
ఆ సజీవ మహా చైతన్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించి పులకించేందుకు గాను మనం తగినన్ని జాగ్రత్తలతో పుష్కరాలకు కుంభమేళాలకు తరలివెళ్లాలి. ‘ఒక సూర్యుడు సమస్య జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక’ వారివారి జీవన సంస్కారాలను బట్టి వేరువేరు, అపూర్వ దివ్యానుభవాలను గుండెల్లో పదిలం చేసుకోవాలి. సమష్టి భారతీయ ఆత్మస్వరూపానికి చెందిన అంశను తనలోతాను కనుగొనాలి. తన నిజమైన మూలాలు గుర్తించాలి.
కుంభమేళాలు పుష్కరాలు- జలదేవతకు నీరాజనాలనుకొంటే- పల్లెపట్టుల తిరునాళ్లు, సమ్మక్క సారక్క జాతరలు... వనదేవతలకు వందనాలు!  గిరిజనులు- రాళ్లు రప్పల మధ్య ముళ్ల బాటల్లో కొండలు గుట్టలు దాటుకుంటూ అన్ని మైళ్లు కాలినడకన పరుగులిడుతూ వనజాతరలకు ఎందుకు హాజరవుతారు?
అది గ్రహించాలంటే... నీలోంచి నీవు బయటకు రావాలి. వారి గుండెల్లోకి తొంగిచూడాలి. ‘అన్ని నేనులు నేనైన నేను’తో నీకు పరిచయం బలపడాలి. నీలోను వారిలోను అందరిలోనూ... నిజానికి ఈ విశ్వమంతటా అణువణువునా వ్యాపించిన ఈశ్వరుడి చైతన్యాన్ని గుర్తించాలి. అదే పర్యటనల పరమలక్ష్యం. తీర్థయాత్రల అసలు ప్రయోజనం.
‘నువ్వు పర్యటించకపోతే, విస్తృతంగా చదవకపోతే, జీవన ధ్వనులను నువ్వు వినకపోతే, నిన్ను నువ్వు అభిమానించకపోతే... నువ్వు మెల్లగా మరణించడం మొదలవుతుంది’ అన్న ప్రముఖ స్పానిష్‌ కవి పాబ్లోనెరూడా మాటల్లోని అంతరార్థం బోధపడితే - పెద్దలు చెప్పిన ‘చెడిపోవడం’ అనేదానికి తాత్పర్యం తెలుస్తుంది. జీవిత ధ్వనులు చెవిన పడటం మొదలవుతుంది. నీలోకి నీ పర్యటన ఆరంభం అవుతుంది!

- ఎర్రాప్రగడ రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న