సన్నద్ధతే సగం విజయం!

అంతర్యామి

సన్నద్ధతే సగం విజయం!

‘అప్రమత్తత’ అంటే జాగ్రత్త, జాగరూకత అనే అర్థాలున్నాయి. మనిషి జీవితంలో అప్రమత్తత అనుక్షణం అత్యవసరమైందే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, కార్యభంగమవుతుంది. కీడెంచి మేలెంచమన్న పెద్దల మాటలో వాస్తవం ఉంది. మనిషికి దూరాలోచన అవసరం. ముందస్తు ప్రణాళిక అవసరం. భూతకాల పునాదులపైన, అప్పటి అనుభవాలను స్మరించుకుని, సింహావలోకనం చేసుకుని, భవిష్యత్తులో జరగబోయే ఫలితాలను ముందుగా ఊహించుకుని, వర్తమానంలో తగిన కార్య రూపకల్పన చేసుకోవడం విజ్ఞుడైనవాడి ధర్మం.
కుటుంబంలోని పెద్దలను, లేదా అనుభవజ్ఞులైన మేధావుల సలహాలను, సూచనలను ఆహ్వానించడం దోషమేమీ కాదు. దాన్ని ఆత్మన్యూనతగా భావించరాదు. ఒక్కొక్కప్పుడు పరాజయాలే విజయ సోపానాలుగా మారిపోతాయి. సమస్యలెన్నో ఎదురవుతూనే ఉంటాయి. విజ్ఞతతో పరిష్కార మార్గాలు ఆలోచించుకోవాలి. ఏదైనా సుసాధ్యమే అన్న సానుకూల దృక్పథం అప్రమత్తతకు ప్రాణం పోస్తుంది.
మనం తరచూ కొన్ని సూక్తులు వింటూంటాం. ఆలస్యం అమృతం విషం అని, శుభస్య శీఘ్రం అని... ఆయా సందర్భాల్లో అవీ పాటించదగినవే! ‘గత జలసేతు బంధనమని, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేమిటి?’ అని కూడా వింటుంటాం. సందర్భానుసారం ఇవీ అనుసరణీయాలే. ఏమైనా- కార్యసాధకుడు ఏ పని ఆరంభించినా, అందుకు తగిన సన్నాహాలు చేసుకోనిదే ముందడుగేయడు.
ఆరంభానికి ఆత్మవిశ్వాసమే నాంది. చేసే పనిని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగితే జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం అదే నేర్పుతుంది. ఆలోచన తరవాతే ఆచరణ. అప్పుడే అది అనుసరణీయం, ఆదర్శప్రాయం అవుతుంది. శ్రీరాముడు రావణుడితో యుద్ధం ప్రారంభించినప్పుడు ఎన్నో విధాల ఆలోచించాడు. అగస్త్యమహర్షి బోధించిన ఆదిత్య హృదయాన్ని హృదయంలో నిలుపుకొన్నాడు. ఆయన విజయానికది ఎంతో దోహదపడింది. కార్యశీలి అనుభవజ్ఞుల్ని అనుసరించకపోతే అంధుడి వెనక అంధుడు నడిచినట్లే అవుతుంది. తొందరపాటు ఆలస్యానికి మొగుడంటారు. త్వరపడినకొద్దీ ఆలస్యం, అపజయం ఎదుర్కోక తప్పదు. తొందరపడి అడుగేస్తే, తీరిగ్గా విచారించాల్సి వస్తుంది.  
ఎంతోమంది మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. అవహేళన చేస్తూంటారు. మనం కొంచెం జాగరూకతతో, శ్రద్ధగా పనిచేసుకుపోతే ఎవరి విమర్శలూ ఏమీ చేయలేవు. అప్రమత్తులం కాకపోతే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. మన శారీరక ఆరోగ్యానికీ ఇది వర్తిస్తుంది. ఆహారం, నిద్ర, వ్యాయామం మొదలైన విషయాల్లో అప్రమత్తత లేకపోతే అనారోగ్యం కుంగదీస్తుంది. సావధానంగా ఉండలేని మనిషి మనస్ఫూర్తిగా ఏ పనీ చేయలేడు.
విదురుడి నుంచి సమాచారం అందుకున్న పాండవులు ముందుగానే అప్రమత్తులై లక్క ఇంటి దహనానికి ముందే అందులోంచి సురక్షితంగా బయటపడ్డారు. అజ్ఞాతవాస సమయంలో ఎన్నో కష్టాలకు, అవమానాలకు ఓర్చి, సహనంతో అప్రమత్తులై మెలగడం వల్లనే సఫలీకృతులైనారు. ఇలాంటి సన్నివేశాలెన్నో పురాణాల్లో కూడా మనకు కనిపిస్తాయి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఆచితూచి అడుగేయడం అత్యంతావశ్యకం. లక్ష్యసిద్ధికిదే మూలం. అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని ముందడుగు విషపు మడుగవుతుంది. ఒక దారి మూసుకుపోయినప్పుడు మరో దారి కనిపిస్తుంది!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న