హనుమంతుడి జన్మస్థానం

అంతర్యామి

హనుమంతుడి జన్మస్థానం

కల జీవజాలానికి, మానవాళికి ఈ పుడమి పుట్టినచోటు. ఏ జీవి ఎక్కడ పుట్టినా, ఏ మనిషి ఎక్కడ సంచరించినా, ఈ భూమండలమంతా జన్మభూమిగానే పరిగణించాలి. మానవులు, ఇతర ప్రాణులే కాక, ఎందరో దేవతలు, అవతారపురుషులు సైతం ఈ భూమిపై ఆవిర్భవించారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, లోకోపకారం చేశారు. మహోన్నత చరిత్ర గల మహాపురుషులకు, అవతారపురుషులకు అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలూ జేజేలు పలుకుతాయి. అలాంటివారికి దేశ ప్రాంత దృష్టి ఉండదు. విశ్వజనీన భావనతోనే సకలలోకం వారిని అభిమానిస్తుంది. ఆరాధిస్తుంది. ప్రేమతో, భక్తితో తమవారని చెబుతుంది. సూర్యుడి కిరణాలు పుడమి అంతా పరచుకొన్నట్లు వారి తేజస్సు లోకమంతా వ్యాపించి, దారి చూపుతుంది. ఇది నిత్యసత్యం.
త్రేతాయుగంలో రావణాది రాక్షసుల ఆగడాలను అరికట్టడం కోసం మహావిష్ణువు మానవుడిగా భూమిపై అవతరించాడు. సాకేతపురం అని పిలిచే అయోధ్యానగరంలో దశరథ మహారాజు జ్యేష్ఠపుత్రుడైన రాముడిగా ఉద్భవించాడు. రాముడు అయోధ్యలో పుట్టినా పుడమి అంతా అతణ్ని తమవాడిగానే ఆదరించింది. అతడి లోకోత్తర చరిత్ర అయోధ్యకే పరిమితం కాలేదు. ఊరూరా, వాడవాడలా రామగాథ జనరంజకమై ఆచంద్రతారక ఖ్యాతితో వెలుగుతోంది.
రామకథలో కీలకమైనవాడు హనుమంతుడు. అతులిత బలధాముడిగా, అంజనాసూనుడిగా, కేసరి తనయుడిగా, పవమాన సుతుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు లోకానికి ఆరాధ్యుడు. ధర్మమూర్తి అయిన రాముడికి నమ్మినబంటుగా, కార్యసాధకుడిగా మారుతికి గల ప్రశస్తి నిరుపమానం. మహావీరుడైన హనుమంతుడి కోవెల లేని జనపదం లేదు. రుద్రాంశతో వాయుదేవుడి అనుగ్రహంతో అంజనాదేవి గర్భాన జన్మించిన వానరవీరుడైన ఆంజనేయుడు పుట్టిన వెంటనే ఆకాశానికెగసి, సూర్యబింబాన్నే కబళించబోయాడంటే అతడి ప్రతాపం జగదేకవంద్యం... కిష్కింధ రాజ్యంలోని ఋశ్యమూక పర్వతంపై హనుమ ఆవిర్భవించినట్లు పురాణేతిహాసాలు చెబుతున్నాయి. సప్తగిరులలోని అంజనాద్రి హనుమ జన్మస్థానమని  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఉత్తరాది ప్రాంతాలవారు హనుమ జన్మస్థానం తమదేనని వాదిస్తుంటే, దక్షిణాదివారు ఆ ఖ్యాతి తమ ప్రాంతానిదే అంటారు. అవతార పురుషుల మహిమలు ఎవరూ అందుకోలేనంత గొప్పవి కనుక వాటిని తమ ప్రాంతానికి వర్తించుకొనేలా జనులు ఇష్టపడటంలో ఔచిత్యం ఉంది. కానీ వీటన్నింటికంటే అతీతంగా పరమార్థం ఏదో ఒకటి ఉండి తీరుతుంది. మహాత్ములు అందరివారు. వారి జననకాలాలు, జన్మస్థలాలతోపాటు జననీజనకులూ నిమిత్తమాత్రులే. వారు ఆవిర్భవించి లోకానికి చేసిన ఉపకారాలే పరిగణనలోకి వస్తాయి.
కాలగణనలు, స్థలాలు ఎన్నటికీ పారమార్థికాలు కావు. సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు ప్రతి ఊరిలోనూ ఆకాశంలో ప్రత్యక్షం అవుతాయి. అంతమాత్రాన వాటిని ఒకచోటకే పరిమితం చేయడం సాధ్యం కాదు. వాటి ఉనికి విశ్వజనీనం. విశ్వవ్యాప్తం. అదే విధంగా హనుమంతుడి జన్మస్థలంపై కొన్నాళ్లుగా చర్చలు వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఏ కాలం వాడైతేనేమి, ఏ ప్రాంతం వాడైతేనేమి... మహనీయుడు లోకవంద్యుడే, అందరివాడే! పూజ్యస్థానాన్ని అందరూ ఆరాధిస్తారు. ఆదర్శప్రాయమైన గుణాన్ని అందరూ శిరోధరిస్తారు. ఈ భూమండలం అంతా మనందరిదీ. ఎక్కడ ఏ మహనీయతేజఃపుంజం ఉదయించినా, అది అందరిదీ. హనుమ జన్మభూమి అందరి హృదయాలలో ఉంది కాని, ఒక ప్రాంతానికే సీమితమై కనబడదు. హనుమ ఈ భూమండలం అంతటికీ చెందినవాడని భావించడమే శ్రేయస్కరం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న