దృష్టి ఎన్నో విధాలు

అంతర్యామి

దృష్టి ఎన్నో విధాలు

దృష్టి అంటే చూడటమని సాధారణ అర్థం. అది జ్ఞానేంద్రియాల్లో ఒకటైన కన్ను చేసే పని. మనసు అనే ఇంద్రియ సహాయం ఉంటే మరింత రాణిస్తుంది. ఆ దృష్టికి సార్థకత కలుగుతుంది. దృష్టి అనేక రకాలని వీటిలో దేహదృష్టి, మనోదృష్టి, ఆత్మదృష్టి అనే మూడు  ముఖ్యమైనవని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. చర్మచక్షువుతో చూడటాన్ని దేహదృష్టి అంటారు. దీనివల్ల భౌతికమైన విషయాలను మాత్రమే చూడగలుగుతాం. అందులోని నిజానిజాలు విశ్లేషించలేం. మనోనేత్రంతో... అంటే ఆలోచనా పూర్వకంగా చూసే దృష్టిని మనోదృష్టి అంటారు. దీనివల్ల అవగాహన పెరిగి మంచి చెడుల విశ్లేషణ కలిగి జీవన ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది.
స్థూలదృష్టి, సూక్ష్మదృష్టి అని మరి రెండు రకాలు. అలవోకగా చూడటాన్ని స్థూలదృష్టి అని, అవగాహనతో నిశితంగా పరిశీలించడాన్ని సూక్ష్మదృష్టి అంటారు. ఇవి మానవ మనుగడ సక్రమంగా సాగడానికి ఉపకరిస్తాయి.
తనను గురించి తాను తెలుసుకోవడాన్ని ఆత్మదృష్టి లేదా ఆత్మావలోకనం అంటారు. వ్యక్తి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ పని చేస్తున్నా దృష్టి, మనసు రెండూ పని మీదే కేంద్రీకృతం చేయాలి. అప్పుడే అనుకున్న పనిలో సఫలీకృతులవుతారు.

జాగ్రత్తగా ఉండటాన్ని ముందుచూపు అంటారు. ప్రతి విషయానికీ జాగ్రత్తలు తీసుకుంటూ జీవితం గడపడం వల్ల ఇది సాధ్యమవుతుంది. జాలి, కరుణ వంటివి కలిగి ఉండటాన్ని చల్లని చూపు అని పిలుస్తారు.  ఇతర సహప్రాణుల పట్ల సమదృష్టి కలగడం దీని ఫలితం. పరిశీలనా తత్వం ఉంటే సూక్ష్మ దృష్టి అంటారు. ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే దాన్ని నిశితదృష్టి అంటారు.
నిజానికి తల్లి గర్భంలో ఉండగా ఏడోనెలలో జీవుడికి దృష్టికి సంబంధించిన ఇంద్రియాలు రూపు దిద్దుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతి జీవికీ ఎన్నో జన్మలు గడిచాయని పురాణాలు చెబుతున్న మాట. కానీ ఏ జన్మ విషయమూ వర్తమానంలో గుర్తుకు రాదు. అదృష్టవశాత్తు జన్మలలో సర్వోత్తమమైన మానవ జన్మ లభించింది. దాన్ని సార్థకపరచుకునే మార్గాన్ని ఆత్మజ్ఞానం చూపిస్తుంది. తద్వారా కర్మ బంధం నశించి అతడింకా ఎన్నో జన్మలనెత్తే అవసరం లేని మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అర్జునుడికి తన అసలు రూపాన్ని చూపాలని నిశ్చయించుకున్నాడు  శ్రీకృష్ణుడు. ఆయన కేవలం పాంచభౌతిక రూపుడు కాదు. విశ్వవ్యాప్తమైన పరమాత్మ. ఆ రూపాన్ని భౌతిక నేత్రాలతో ఎవ్వరూ  చూడలేరు. జ్ఞాననేత్రం అవసరం. అందుకోసం తన విశ్వరూపాన్ని చూడటానికి వీలుగా అర్జునుడికి దివ్యదృష్టి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు.
నిశితమైన ఆత్మదృష్టి ఉండగోరేవారు పైమెరుగుల కోసం వెంపర్లాడకూడదు. దేహం, మనసు ప్రకృతి జన్యాలు. కాబట్టి అవి నశ్వరమైనవి. ఆ దృష్టులు సరైనవి కావు. ప్రకాశిస్తున్న సూర్యుణ్ని గుడ్డివాడు చూడలేనట్లు చర్మ చక్షువులు భగవంతుణ్ని వీక్షించలేవు. ఎవ్వరినీ ద్వేషించరాదని, అందరినీ సమదృష్టితో చూడాలని, సృష్టిలోని ప్రతి ప్రాణి పట్లా సమదృష్టి కలిగి ఉండాలని అదే ఆధ్యాత్మిక దృష్టిగా పిలుస్తారని పండితులు బోధిస్తుంటారు.
మునులకు, మహాత్ములకు దివ్యదృష్టి ఉంటుందంటారు. దానితో జరిగిపోయినది, జరగబోయేది అన్నీ చెబుతారని, అది తపస్సు వల్లనే సాధ్యమవుతుందంటారు.
సచ్ఛీలం, సాధుస్వభావం, సాధన ఉంటే  భగవంతుడి పట్ల దృష్టి మరలి మానవుడే మహనీయుడు అవుతాడు. ఇది పురాణాలు తెలియజెబుతున్న సత్యం.

- వి.ఎస్‌.ఆర్‌.మౌళి 


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న