అగ్ని అర్చన

అంతర్యామి

అగ్ని అర్చన

పంచభూతాల్లో అగ్ని ఒకటి. భారతీయ సంస్కృతిలో ‘అగ్ని’కి ఉన్న స్థానం విశిష్టమైంది. రుగ్వేదం ‘అగ్నిమీళే పురోహితమ్‌...’ అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. మాకు హితాన్ని, శ్రేయస్సును సమకూర్చే అగ్నిని ప్రార్థిస్తామని అర్థం. దేవతల్లో అగ్ని ప్రధానం కనుక రుగ్వేదం అగ్ని శబ్దంతో ప్రారంభమైంది. ‘జీవి’లోని అగ్ని సమపాళ్లలో ఉన్నంతవరకే వివిధ కార్యకలాపాలను సామర్థ్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ అగ్ని క్షయించడంతోటే దానికి మూలమైన గాలీ ఆగి జీవయాత్ర ముగుస్తుంది.
అగ్ని శుభాశుభాలకు సాక్షీభూతుడు. రుత్విక్కు, యజ్ఞాల్లో వివిధ దేవతలకు సమర్పించే హవిస్సుల్ని అగ్నే వారికి అందిస్తుంది. సూర్యుడిలోని అగ్ని వల్లనే మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసి పంటల ద్వారా సకల జీవరాశికీ ఆహారం అందుతోంది. ఈ ఉపకారానికి కృతజ్ఞత చెప్పుకోవడానికే ప్రార్థన. పురోహిత వ్యవస్థ అగ్నిపైనే ఆధారపడి ఉంది. దేవతల్ని యజ్ఞవేదికకు తీసుకొనివచ్చేవాడు అగ్నిభట్టారకుడే.
పంచభూతాలనూ దేవతలుగా భావించి స్తుతించడం భారతీయ సంస్కృతిలోని వైశిష్ట్యం. అగ్నిని పూజించడంవల్ల ధనధాన్య వృద్ధి, సంతానవృద్ధి కలుగుతాయని; జ్ఞానం, శక్తి, కీర్తి సమకూరతాయని విశ్వాసం. అగ్నిని అర్చించేవారికి సకల శుభాలూ కరతలామలకమని శాస్త్రాలు చెబుతున్నాయి.
మనుషులకు లాగే పంచభూతాలకు సైతం ఆగ్రహానుగ్రహాలుంటాయని విజ్ఞులు చెబుతారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుపానుల వంటివన్నీ పంచభూతాల ఆగ్రహానికి చిహ్నాలైతే- సకాల వర్షాలు, సమశీతోష్ణస్థితి వంటివి వారి అనుగ్రహానికి ప్రతీకలుగా భావించవచ్చు.
‘అగ్నిహోత్రా! నువ్వు చక్కని బుద్ధిని ప్రసాదించగలవాడవు. మనసును పరిశుద్ధం చెయ్యగల శక్తి నీది. నిన్ను అర్చించేవారి కార్యాలన్నీ ఫలవంతమవుతాయి. నీ అనుగ్రహంతో మేం బాధలనుంచి విముక్తిని పొందుతాం’ అని అగ్నిని రుషులు ప్రార్థించినట్లుగా- రుగ్వేద మంత్రాలు తెలుపుతున్నాయి.
జలాల్లో విద్యుత్తు, సముద్రంలో బడబాగ్ని, ఆకాశంలో సూర్యుడు... ఈ మూడూ అగ్ని స్వరూపాలే. రుతువుల ఉద్భవం దాని విశేషమే.
అష్టదిక్పాలకుల్లో అగ్ని ఆగ్నేయాధిపతిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే గృహంలో ఆగ్నేయమూల వంటగదిని నిర్మించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అగ్ని మూడు రకాలుగా వేదం పేర్కొంటోంది. యజ్ఞవేదికకు తూర్పున చతురస్రంగా ఉండే కుండలోని అగ్నిని ఆహవనీయమంటారు. గృహస్థు ఇంట్లో ఎప్పుడూ ఉండే అగ్నిని గార్హపత్యమంటారు. యజ్ఞవేదికకు దక్షిణ దిశలో అగ్నిని దక్షిణాగ్నిగా వ్యవహరిస్తారు.
పురాణాలు అగ్ని జన్మను గురించి పలువిధాలుగా చెబుతున్నాయి. అంగీరసుడి కుమారుడైన బృహస్పతి పుత్రుడు సంయువు. సంయువు, సత్యలకు ప్రభవించినవాడు అగ్ని అని భాగవత, భారతాలు పేర్కొన్నాయి. అగ్ని భార్య స్వాహాదేవి. పావక, పవమాన, శుచి వారి పుత్రులని పురాణాలు పేర్కొన్నాయి. నీలుడనే వానరుడు అగ్నిపుత్రుడని రామాయణం చెబుతోంది. ద్రుపద పుత్రుడు  ధృష్టద్యుమ్నుడు అగ్నిగుండం నుంచి జన్మించాడు. సుబ్రహ్మణ్యస్వామినీ అగ్నిపుత్రుడిగానే కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అష్ట వసువుల్లో అగ్ని ఒకడని విష్ణుపురాణం పేర్కొన్నది.

- డి.భారతీదేవి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న