పరిణతికి సూచిక

అంతర్యామి

పరిణతికి సూచిక

రీరానికున్న వయసును బట్టి రూపాన్ని అభిమానిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. చిన్నతనంలో, ఏమీ తెలియని వయసులో పిల్లల అమాయకత్వం ముచ్చట గొలుపుతుంది. ప్రకృతిలో ప్రతిదీ వాళ్లకు వింతే. అన్నీ తమ కోసమేనని అందరు తమవారేనని అనుకుంటారు. ముఖ్యంగా కల్లాకపటం తెలియదు. ఇలలో దైవాన్ని చూడగలిగే అపురూప మైన వయసు అది. ప్రహ్లాదుడిలాంటివారు చిన్న వయసులోనే పరిమళిస్తారు. మాటల్లో, చేతల్లో పెద్దరికాన్ని ప్రదర్శిస్తారు. శాస్త్ర విషయంలో పరిణతి ప్రదర్శించే చిన్నవారికి పాదాభివందనం చేయడం తప్పు కాదు. వేదజ్ఞానం జ్యేష్ఠత్వానికి కాని వయసుకు కాదు అంటారు పెద్దలు.

శరీరం పసితనం నుంచి కుర్రతనానికి మార్పు చెందుతున్నప్పుడు వ్యక్తిత్వం వికసిస్తుంది. తమకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకుని గురువు సమక్షంలో విద్యార్జన చేస్తూ, ఉన్నత లక్ష్యం ఏర్పరచుకునే దశ అది. ప్రపంచంలో ఏదైనా సాధించగలం అన్న దృఢ విశ్వాసంతో, సముద్రమంత విశాలమైన భావాలతో ఆకాశమే హద్దుగా సాగే ఉత్తుంగతరంగంలాంటి వయసు అది. వాల్మీకి రాముడి ప్రశాంతతతో కూడిన హుందాతనాన్ని, పోతన కృష్ణుడి అల్లరి చేష్టలను చదువరుల కళ్లకు కట్టి, మనసున నాటిన వయసది. సాహస కార్యాలకు చిరునామాగా నిలిచేదీ ఆ వయసే. ఏకలవ్యుడిలా పరిస్థితులు అను కూలంగా లేకపోయినా అనుకున్నది సాధించగలిగేది ఆ వయసులోనే.

యుక్త వయసులో, శ్రద్ధగా అభ్యసించిన విద్యను సమాజానికి ఉపయోగించడం అతి ముఖ్యమైనది. మనసు పెడదారి పట్టే దశ అది. బుద్ధి వక్రిస్తే వయసు వల్ల, చక్కటి సావాసం వల్ల చక్కబడుతుందని శ్రీ మద్భాగవతంలోని సప్తమ స్కంధం చెబుతోంది. స్నేహితులతో సత్సాంగత్యం ఏర్పడితే హృదయం కమలంలా వికసిస్తుంది. అనుభవం వల్ల కలిగే జ్ఞానం, పుస్తకాలు చదవడం వల్ల, ఇతరుల ఉపదేశం వల్ల పొందలేమంటారు అను భవజ్ఞులు. చదివిన చదువుకు ఎన్నో ప్రయోగాలను జతచేసి మార్కొని, అలెగ్జాండర్‌ గ్రాహం బెల్‌ వంటి శాస్త్రవేత్తలు ఈ ప్రపంచం రూపురేఖలు మార్చారు. శాస్త్ర సాంకేతిక విప్లవంతో మన జీవితాలను సౌకర్యవంతం చేశారు. ప్రతి ఉద్యోగీ తన పరిధిలో, అప్పటిదాకా ప్రోది చేసుకున్న పరిజ్ఞానంతో, పని చేయడంలో తనదైన ముద్రవేస్తాడు. మనిషి ఎంత బలవంతుడైనా, అవినీతి అతణ్ని బలహీనుణ్ని చేస్తుందంటారు పండితులు. ఉద్యోగ పర్వాన్ని నిప్పులా గడిపేవారు ఆదర్శప్రాయులు. ప్రపంచ అభివృద్ధి శకటానికి కనిపించని చక్రాలు ఆ వయసు వారు. అటు సంసార బాధ్యతను, ఇటు ఉద్యోగ ధర్మాన్ని సమన్వయం చేసుకుంటూ సాగే దశ అది. వృద్ధాప్యాన్ని చీకూచింతా లేకుండా గడిపేందుకు కావలసిన ప్రణాళికలు వేసుకుని, అమలు చేయవలసిన వయసు కూడా ఇదే.

ముసలి వయసులో జుత్తు తెల్లబడి, పళ్లు కదులుతూ, శక్తి ఉడిగి, శరీర పటుత్వం సడలినా మనసు పరిపక్వతతో నిండుకుండలా ఉంటుంది. పెద్దరికం, అనుభవసారంతో శరీరానికి గౌరవ ప్రతిష్ఠలు చేకూరి సమాజంలోను, తనవారితోను తామరాకు మీద నీటిబొట్టులా గడపాల్సిన తరుణమది. మనో పరిణతి కలిగి స్థితప్రజ్ఞతో ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపే వయసు సేవాభావానికి నాంది పలుకుతుంది. ‘నేను నా వాళ్లు’ అన్న సంకుచిత భావాల నుంచి ఆలోచనలు విస్తరిస్తాయి.

పుట్టిన ప్రతి మనిషీ పెరిగి కడకు ఆయువు కుంగి నేలకు ఒరుగుతాడు. ఏ వయసుకు ఆ ముచ్చటలా, సముచితమైన ప్రవర్తన అవసరం. మానవ వ్యక్తిత్వానికి వయసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. పెరిగే వయసు వ్యక్తి శారీరక, మానసిక పరిణతికి సూచిక కావాలి. సృష్టిలోని సకల జీవరాశికి మనిషికి తేడా అదొక్కటే!

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న