పండుగలా... జీవితం!

అంతర్యామి

పండుగలా... జీవితం!

నం చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడి ఉంటాం. ప్రతి ఆటకూ ఒక పందెం ఉంటుంది. ప్రత్యర్థులుంటారు. గమ్యం ఉంటుంది. గెలుపూ ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన, అద్భుతమైన క్రీడ ఉంది. అదే జీవితం. అందులో మనం ఆట నడిపేందుకు ఎన్నుకున్న విధానం ఉంటుంది. కోరుకున్న ‘ప్రాధాన్యం’ ఉంటుంది. అప్పుడదే, ఆ విధానమే జీవితం అవుతుంది. అదే... మముక్షత్వం. అదే జీవితం. మరొకటి లేని నిశ్చిత విధానం అదే... మన క్రీడ. మనం ముచ్చటగా ఆడుకునే, ఆడుకోవలసిన ఆట. దానిలో ప్రత్యర్థులం మనమే. మనమీద మనమే గెలవాలి. ఎవరితోనూ పోటీ ఉండదు. ఎవరి ప్రోద్బలమూ ఎవరో దిగలాగడమూ ఉండవు. మన ఆట మనదే. మన నియమ నిబంధనలు మనవే. మనం విధించుకున్న, మనం నియంత్రించుకున్న జీవన సరళి, శైలి మనదే. ఎంత విచిత్రం! ఇంత వింతైన అపురూపమైన ఆట మరొకటేదీ ఉండదు. ఈ జీవితకాల క్రీడను మనం జీవిస్తూనే ఆడుకోవచ్చు. ఆటనే జీవించవచ్చు. దాని కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆటలోనే జీవితం. జీవితమే ఆట. ఎవరి అనుమతీ తీసుకోవలసిన పని లేదు. ఏ క్రీడా సామగ్రినీ సమకూర్చుకోవలసిన శ్రమ లేదు. ప్రథమంలో గురువు, ఆసనం, శాస్త్ర పరిజ్ఞానం... ఆ తరవాత, ఆ తరవాత్తరవాత వివేకం, వైరాగ్యం, కౌపీనం, మౌనం, ఆంతర్య జీవనం, అనంతాన్వేషణ... క్రమేణా అద్భుతమైన సాధనైశ్వర్యం!!

అరణ్య మధ్యాలు, చెట్టు తొర్రలు, హిమాలయ పర్వతాగ్రాలు... అయినా... గాలికి ఆసరా అవసరం లేదు. సూర్యకిరణానికి ఆలంబనతో పని లేదు. సాధువు సాధనాగ్నికి ఏ పాత్రతో అగత్యం ఉండదు. కౌపీనం కూడా బరువయ్యే నిజ యోగికి ఆంతర్యమే అనంతం. సాధనా సౌధం. జీవితాన్ని కూడా తోసిరాజని అంతర్యాగం చేసే ఆ విశ్వ యాజ్ఞికుడికి అంతర్యామికి నివేదించేందుకు ఏమి మిగిలి ఉందని? సమర్పించేందుకు ఏమి ‘శేష’మైందని? అసలు నివేదించేందుకు మరొకరెవరున్నారని? ఆ మహా శూన్యంలో ఆ రిక్తభావంలో అభివ్యక్తికి, అర్పణకు చోటెక్కడుందని?

అయితే ఎంతటి సాధకుడైనా ఇంత భావౌన్నత్యం ఎవరికుంటుంది? అసలు సాధ్యమా... భావమే లేనప్పుడు, భావశూన్య స్థితిమాత్రుడు ఏం చేయగలడు? నిజమే... అయితే అందరికీ, సాధకులైనా సరే అందరికీ- ఇది సాధ్యం కాదు. మరి ఈ సాధనామయ జీవితం, భక్తిపూర్ణ జీవితం మాత్రం ఎలా సాధ్యం? ప్రయత్నం చేయడమే. స్వల్ప సాధనతో మొదలుపెట్టి క్రమసాధన... ఆపై నిరంతర సాధన సాగించాలి. చాలా ప్రశాంతంగా, ఎలాంటి పోటీలు, ఈర్ష్యాసూయలు, ఉద్వేగాలు లేకుండా నడిచే, నడిపే భక్తి సాధన, ధ్యానసాధనగా అది మారాలి. ఈ పోటీలో ప్రత్యర్థులు లేరు. సంఖ్యా పరిమితి లేదు. ఎవరైనా పాల్గొనవచ్చు. ఎందరైనా. అందరిదీ ఒకే గమ్యం... దారులు వేరైనా. ఎవరైనా గెలవవచ్చు. అందరం గెలవవచ్చు. ఇది... అందరం గెలిచే పందెం. పాల్గొనాలి... అంతే. ప్రారంభించాలి... అంతే.

ఇది జీవితంలాంటి ఆట. ఆటలాంటి యుద్ధం. మనోక్షేత్రమే యుద్ధభూమి. ప్రత్యర్థులందరూ మనవారే. ఇది ఆయుధాలు లేని యుద్ధం. యుద్ధంలాంటి పండుగ. పండుగ చేసుకుందాం. ప్రతిరోజూ పండుగే. ప్రతిక్షణమూ. ఇలాంటి జీవితం, ఇలాంటి జీవితమే మనకు కావాలి!

- చక్కిలం విజయలక్ష్మి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న