దైవ లక్షణం

అంతర్యామి

దైవ లక్షణం

జీవితంలో జరిగే అన్ని అనర్థాలకూ మూలం పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే. జీవన ప్రక్రియల పట్ల అవగాహన కొరవడటమే. బతుకు పయనంలో చేపట్టే ప్రతీ చర్యను సావధానంగా గమనించినప్పుడు ఆ ఎరుకలోంచే అర్థం చేసుకోవడం ఆరంభమవుతుంది. అంతిమంగా అవగాహన కలుగుతుంది. అర్థం చేసుకోవడం మొదటి మెట్టు. అవగాహన కలగడం ఆఖరి మెట్టు.

వివేకం, బుద్ధి, తెలివి, పూర్వజ్ఞానం.... అర్థం చేసుకోవడం అనే ప్రక్రియలో పాలు పంచుకుంటాయి. అందుకు భిన్నంగా ఉద్వేగం, కోపం, అసూయ, ఈర్ష్య... విచక్షణ కోల్పోయేట్టు చేసి అర్థం కాకుండా అడ్డుపడతాయి. ప్రాథమికంగా మనసు అలలు లేని నిశ్చలమైన కొలనులాంటిది. సరస్సులో నీళ్లు నిలకడగా ఉన్నప్పుడు అది పారదర్శకంగా కనిపిస్తుంది. దాని అడుగు భాగాన్ని నేరుగా స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. మనసూ అంతే. అది స్థిరచిత్తంగా ఉన్నప్పుడు పూర్తి చైతన్యంతో ఉంటుంది. అప్పుడు హృదయం స్పందిస్తుంది. మనసూ ప్రతిస్పందిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాధికారత కలిగి ఉంటుంది. పరిస్థితుల్ని చాలా బాగా అర్థం చేసుకొని చక్కబెడుతుంది. కానీ, విచలితమైన మనసు అరిషడ్వర్గాల వశమై బానిస పాత్ర వహించవలసి వస్తుంది. అందువల్ల మనసును ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంచడానికే చూడాలి.

జీవితంలో మొదటి సగభాగం తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వినాలి. రెండో అర్ధభాగం తక్కువ(అవసరం మేరకు) వినాలి, ఎక్కువ మాట్లాడాలి( అంటే, జ్ఞానం పంచడం అన్నమాట).

బాల్య, యౌవనప్రాయాల్లో బాగా వినడం ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. దాంతో అర్థం చేసుకునే శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. ఆ తరవాత తెలిసిన జ్ఞానాన్ని నలుగురికీ పంచుతూ గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి. అనేక తెలివితేటలతో అనుభవజ్ఞులైన వయోజనుల మౌనం అభివృద్ధి నిరోధకం, బాధ్యతా రాహిత్యం. దైవం సైతం అలాంటి జడత్వాన్ని సహించదు. ధైర్య సాహసాలతో ముందడుగు వేసే వారికే పైనుంచి తోడ్పాటు అందుతుంది. తెలియనిది తెలుసుకునేందుకు చేసే సత్యాన్వేషణలో అర్థం చేసుకోవడం కీలకమైనది. సత్యాన్ని అన్వేషించే పయనంలో పూర్తి ఎరుకతో విన్నది, కన్నది, చదివింది... కూలంకషంగా అర్థం చేసుకోవడం వల్లనే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడిగా మారాడు.

చెట్టు నుంచి పండు కింద పడటం చూసి దాని గురించి బాగా ఆలోచించి చక్కగా అర్థం చేసుకోవడం వల్లే- న్యూటన్‌ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని తేల్చిచెప్పాడు. ప్రకృతి నిత్యం అనేక పాఠాలు బోధిస్తుంది. వాటిని క్షుణ్నంగా అర్థం చేసుకున్న మనిషే జీవితాన్ని సుసంపన్నం చేసుకోగలడు. నీటి ఆవిరి వస్తువుల్ని కదిలించడం గమనించిన మానవుడు దానికి చాలా బలం ఉందని అర్థం చేసుకున్నాడు. ఫలితంగా పట్టాలపై నడిచే పొగబండ్లు కనిపెట్టాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని పరికించి విమానాలు తయారుచేశాడు. విజ్ఞాన రంగంలో అద్భుతాలెన్నో ఆవిష్కరించాడు.

శాంతి, సహనం, ప్రేమ ఉన్నచోట అర్థం చేసుకోవడం పురివిప్పుకొంటుంది. అర్థం చేసుకోవడం ఎంత బాగా పెరిగితే అంత ఆనందం లభిస్తుంది. మనోధైర్యం కలుగుతుంది. ధ్యాన సాధనతో రోజురోజుకీ ’అర్థంచేసుకోవడం’ క్రమంగా వృద్ధి చెందుతుంది. జీవితానికి అర్థమూ తెలుస్తుంది. ఆఖరున ‘అంతిమ సత్యం’ అనుభంలోకి వస్తుంది. అందుకే ‘అర్థం చేసుకోవడం’ దైవ లక్షణం!

- మునిమడుగుల రాజారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న