గాలి మార్పు

అంతర్యామి

గాలి మార్పు

మార్పు సృష్టి వికాసానికి, అస్తిత్వానికి ఎంతో ఆవశ్యకం! లోకంలో మార్పునకు ఉన్న ప్రాధాన్యాన్ని మనిషి గుర్తెరగాలి! ఓ విత్తు మొలకెత్తి, మారాకు తొడిగి ఎదిగి మహా వృక్షంగా రూపాంతరం చెందడానికి మార్పు అవసరం. జగత్తు అనునిత్యం నూతన మార్పులను సంతరించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఓ శిశువు తల్లిగా, తండ్రిగా రూపాంతరం చెందడానికి మార్పు అవసరం. కాల స్వరూపం ‘మార్పు’గా వెల్లడవుతుంది. దైహిక, మానసిక ఎదుగుదలల్లో మార్పు అంతర్లీనమై ఉంటుంది. ఓ కృషీవలుడు, వ్యాపారి, ఉద్యోగి తమ తమ జీవితాల్లో ఎదుగుతూ సంపన్నతను పొందేది మార్పు వల్లే. ఓ నిత్య ఆధ్యాత్మిక సాధకుడు మార్పు ఆధారంగానే విజ్ఞాని అవుతాడు. నేటి బాలలే రేపటి పౌరులన్న నానుడిని నిజం చేసే కాలం మార్పుతో కూడి జైత్రయాత్ర సాగిస్తుంది. మార్పు లేనిదే దృశ్య ప్రపంచం లేదు. బయటకు వెల్లడి కాని మానసిక ప్రపంచానికి సైతం మార్పే ఆలంబన!
మనుషులు అనునిత్యం మార్పునకు లోనవుతూ కూడా యాజమాన్యాలు వారి ఉద్యోగ ధర్మాల్లో ఏవైనా మార్పులు సూచిస్తే, నిబంధనాత్మకం చేస్తే తల్లడిల్లిపోతారు. సృష్టిలో చైతన్య సూత్రాలకు మరో పేరు ‘మార్పు’. జీవితాల్లో కొత్త బాణీలు కమ్ముకు వస్తే కొత్తను ఓ భూతంలా చూసి చలించిపోవడం, ఆపై వాటికి అలవాటు పడటం ప్రజలకు మామూలే! ఆధ్యాత్మిక జగత్తులోనూ మార్పు ఉండవలసిన అవసరం అడుగడుగునా కనిపిస్తుంది. నిజానికి అదో కీలకమైన అంశం కూడా!
దీక్షలు చేపట్టిన వారికి ఆహార విహారాల నుంచి అనేక ప్రవర్తనాంశాలకు వర్తించే నియమావళి మార్పునకు వేదిక అవుతుంది. మారుతున్న కాలం తెచ్చిపెట్టే మార్పులను ఆవశ్యకంగా భావించి స్వీకరించలేనివారు అయోగ్యులుగా మారి క్రమంగా అదృశ్యమవుతారు. వారి ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. సాధన ప్రారంభించిన వ్యక్తి భక్తుడిగా, భగవద్విశ్వాసిగా, తదనంతరం మౌనిగా, యోగిగా, తపస్విగా రూపాంతరం చెందడం... మార్పులో అంతర్భాగమే!
రోజురోజుకూ మీదపడే వయసు తెచ్చిపెట్టే శారీరక, మానసిక మార్పులకు అద్దం పట్టే పరిణామ శీలత జ్ఞానప్రియులకు అలంకారమవుతుందే తప్ప అయోగ్యతకు దర్పణం పట్టదు.
వ్యక్తి తీరని అనారోగ్యంతో బాధ పడుతున్న సందర్భంలో వైద్యులు ఔషధ సేవనంతోపాటు గాలి మార్పును సూచిస్తారు. అతడు నివసిస్తున్న ప్రదేశంలో ఆరోగ్యవంతమైన గాలి లేదని కాదు. తాను నివసించే ప్రదేశం కన్నా భిన్నమైన ఓ కొత్త వాతావరణం లోని మార్పును మనసు కనిపెట్టి ఆహ్లాదిస్తుంది. ఏదో తెలియని మనోహర మార్మిక సందేశం మనసుకు సోకుతుంది. కొత్త ప్రదేశాన్ని, కొత్త వ్యక్తులను కళ్లు ఇంతింతలు చేసుకొని చూసి పసి బిడ్డలా మనసు చెప్పే పాఠాల్ని శ్రద్ధగా వింటుంది దేహం! ఆ మార్దవ స్థితిలో శరీరంలో మేలుచేసే ఆనంద రసాయనాలు ఎన్నో స్రవిస్తాయి.
ఉన్న రోగాన్ని మనసు మరచిపోతే చాలు, దేహమూ అదే బాట పడుతుంది. వైద్యుడిచ్చిన మందులు చక్కగా పని చేస్తాయి. దేహం కోలుకుంటుంది. అందుకేనేమో దేశ విదేశాల్లో కొన్ని వైద్యాలయాలు కొండలూ కోనల మాటున, లోయల అంచున ఏర్పాటవుతాయి. దానినే ‘గాలిమార్పు’ అంటారు.
అటువంటి గాలిమార్పు కోసం పుణ్య క్షేత్రాల సందర్శన చేసే భక్తుల అదృష్టం ఎనలేనిది. సకల సంకటాలనూ హరించివేసే దివ్యమారుతం కోసం ప్రతి భక్తుడూ నిరీక్షిస్తాడు. అవకాశం చేతికందినప్పుడు గుండెల నిండుగా ఆ గాలి పీల్చి జన్మను చరితార్థం చేసుకుంటాడు.

- గోపాలుని రఘుపతిరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న