నిర్ణయాత్మక శక్తి

అంతర్యామి

నిర్ణయాత్మక శక్తి

నిషి మానసిక చర్యల్లో అతిసున్నితమైనవి అతడు తీసుకునే నిర్ణయాలు. అతడి జీవన గమనం అన్ని దశల్లో ఆ నిర్ణయాలతోనే ముడివడి ఉంటుంది. జీవితాన్ని మలుపులెన్నో తిప్పుతుంది. నిర్ణయాత్మకత అనేది- మనిషికి అతడి విజ్ఞత, వివేకాలనుంచే లభించే మానసిక శక్తి. ‘నేను ఈ పని చేసి తీరగలను’ అంటూ గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పగల మనుషుల్లోనే అది కనిపిస్తుంది.
నిర్ణయాత్మకత లోపించిన మనిషి ఏ పనీ చెయ్యలేడు. చేయగలనని చెబుతుంటాడు, దాటవేస్తాడు. చేసి చూపించడు. కాలయాపన చేస్తాడు. తటస్థుడిగా తప్పించుకు తిరుగుతాడు.
ఒక నిర్ణయానికి రావలసి ఉన్నప్పుడు, మనుషులెందరికో అది కష్టతరమైన అభ్యాసంగానే కనిపిస్తుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందుకే కొందరు కారణజన్ములనిపించుకుని చిరకీర్తి సాధించారు. అశోకుడు భరతఖండమంతా తన ఏకచ్ఛత్రాధిపత్యం కిందికి రావాలని జైత్రయత్ర సాగించాడు. లక్ష్యానికి చేరువలో ఉన్నా, కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతం కళ్లారా చూశాక, మరెన్నడూ యుద్ధాల జోలికి పోరాదని నిర్ణయించుకున్నాడు. బౌద్ధమతం స్వీకరించి- బౌద్ధానికి, విశ్వవ్యాపకత లభింపజేశాడు. ఆదిశంకరులు ఆత్మజ్ఞాన సాధనలకు అనువైన మార్గం సన్యాసమని భావించారు. కన్నతల్లి కాదన్నా ప్రాధేయపడినా పిన్నవయస్కుడిగానే సన్యాసిగా మారిపోయారు. ఆ నిర్ణయం ఆదిగురువుగా ఆయన కీర్తి పొందడానికి కారణమైంది. అద్వైత సిద్ధాంతకర్తగా, హైందవ ధర్మానికి పునరుజ్జీవమిచ్చినవారిగా ఆయన అజరామరులయ్యారు. సత్యం అహింస సహాయ నిరాకరణలు సాధనాలుగా  మహాత్ముడు  తాను  అనుకున్నది సాధించారు. సంకల్పబలానికి నైతిక విలువల దన్ను ఉన్నప్పుడు నిర్ణయాత్మక శక్తికి ఎదురుండదు. మహాత్ముడది నిరూపించాడు.
కర్మలను ఆచరించే క్రమంలో తన నిర్ణయాలను భగవంతుడి నిర్ణయాలనడం మనిషికి పరిపాటి. భగవన్నిర్ణయాలని ఉండవు. భగవంతుడు మనిషికి నిర్ణయాత్మక శక్తి ఇచ్చాడు. దాన్ని తన విచక్షణతో సముచితంగా ఉపయోగించుకొమ్మన్నాడు.
ధర్మభ్రష్టుడవుతున్న వానరరాజు వాలికి తనతో విరోధం లేకపోయినా అతణ్ని వధించడానికి రాముడు సంకోచించలేదు. రాక్షస స్వభావం కలిగిన రాజులైన జరాసంధుడు, సైంధవుల సంహారం కృష్ణుడి ఆమోదంతోనే జరిగింది.
స్పష్టతలేని నిర్ణయాలతో మనిషి సాధించగలిగేదేమీ ఉండదు. అతడి నిర్ణయాల వెనక ఉన్న ఉద్దేశం వివరణలు అడగకుండానే అర్థం కావాలి. దురుద్దేశముంటే ఎప్పటికైనా అది బయటపడక మానదు. చెప్పుడు మాటలు విని తీసుకున్న నిర్ణయాలు అనూహ్యమైన తీవ్ర పరిణామాలకు తెరతీస్తాయి. రామాయణంలో మందర మాట విని కైకేయి తీసుకున్న నిర్ణయం అటువంటిదే. వ్యక్తుల్ని భయపెట్టి, బాధలకు గురిచేసే నిర్ణయాలు బాధితుల్లో తిరుగుబాటుకు కారణమవుతాయి. ప్రతీకార చర్యల్ని ప్రోత్సహిస్తాయి.
సకాలంలో కార్యరూపం దాల్చని నిర్ణయాలతో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ధన మాన ప్రాణ నష్టాలు మూడింటికీ మార్గమేర్పడుతుంది. గుణాత్మకమైన నిర్ణయాత్మకతతో మనిషి లౌకిక జీవితం మెరుగుపడుతుంది. అంతులేని అనర్థాలనుకుంటున్న ఎన్నింటికో పరిష్కారం లభిస్తుంది. జీవితంలో విజేతలనిపించుకున్న వారంతా సరైన నిర్ణయాలు, సందర్భోచితంగా సకాలంలో తీసుకున్నవారే!

- జొన్నలగడ్డ నారాయణమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న