పరీక్షా సమయాలు

అంతర్యామి

పరీక్షా సమయాలు

జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా అనుకున్న రీతిలో హాయిగా సాగిపోతుందనుకుంటే పొరపాటే. కాయకష్టం చేస్తూ బతికే సామాన్యుల నుంచి అత్యంత తెలివితేటలున్న మేధావులు, సంపన్నుల వరకు అందరికీ క్లిష్ట సమయాలు ఎదురవుతూనే ఉంటాయి. తమ ముంగిట్లోనే కష్టాలు కాపు కాస్తున్నాయని విచారించేవారు కొందరైతే, దిక్కుతోచక తమను తాము నిందించుకుంటూ సహనం కోల్పోయేవారు మరికొందరు. కోరికలే దుఃఖానికి హేతువులని తెలిసీ మనిషి ఆ విషవలయంలో చిక్కుకుంటాడు. భూత వర్తమాన భవిష్యత్తులన్నీ తనవేనన్న భ్రమతో అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. అనుకోనిది ఏదైనా జరిగితే ఆశాభంగంతో దిగాలుగా నీరుగారడం అవిశ్వాసుల లక్షణమని దివ్య ఖురాన్‌ గ్రంథం ప్రకటిస్తోంది. ముళ్లబాటల్లోనూ చిరునవ్వు చెక్కుచెదరక అలవోకగా నడిచే మహానుభావులు ధర్మాత్ములు విశ్వాసులని ఇస్లాం ప్రబోధిస్తుంది.
అల్లాహ్‌ సృజించిన మనిషి కర్తవ్యం ఆ సృష్టికర్త ఆరాధనే అన్నది నిర్వివాదం. భూమ్యాకాశాలు, సమస్త జంతుజాలం, క్రమబద్ధమైన రుతువులు అన్నీ అల్లాహ్‌ అనుగ్రహాలని పవిత్ర ఖురాన్‌ ఆయత్‌లు చెబుతున్నాయి. అయితే, బాధాకరంగా తోచే ప్రతి కష్ట సమయమూ ఓ పరీక్షా సమయమే. ఒక వ్యక్తికి, అతడి సంతానానికి వారి సిరిసంపదలకు ఆపదలు వాటిల్లవచ్చు. ఓరిమి వహించి అన్నింటినీ స్థిరచిత్తంతో ఎదుర్కొన్నందువల్ల పాపాలన్నీ హరించుకుపోయి ఆంతర్యం నిర్మలమవుతుందని మహాప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) ఉపదేశించేవారు. చివరకు అతడి కర్మపత్రం పాపరహితంగా ఉంటుందనేవారు.
అల్లాహ్‌ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఎంత క్లిష్టమైనదైతే అంత గొప్ప బహుమానం లభిస్తుంది. దైవ నిర్ణయానికి ఆమోదాన్ని తెలిపి సహనంతో ఎవరు నిరీక్షిస్తారో వారికి అల్లాహ్‌ ప్రసన్నత లభిస్తుంది. ఎవరు అసమ్మతిని తెలుపుతూ మార్గభ్రష్టులవుతారో వారు ఆగ్రహానికి గురవుతారన్నది దివ్య ఖురాన్‌ హెచ్చరిక. అడుగడుగునా ఎదురయ్యే ఆపదలను యుద్ధాలను ఎదుర్కొని నైతిక బలంతో ఆత్మస్థైర్యంతో విజయం సాధించాలి. విషమ పరీక్షల బారి నుంచి తప్పించుకొని తృప్తిగా జీవనం సాగించగలిగితే అది సౌభాగ్యవంతమైన వైఖరి. దానికి శిక్షణా కాలమే పవిత్ర రంజాన్‌ మాసం.
పరీక్షా సమయాలు పలు రకాలుగా వేధించవచ్చు. విశ్వాసి తన జ్ఞాన శక్తి సామర్థ్యాలను బట్టి, ఆంతరంగిక స్థితిని బట్టి ప్రజల్లో పలుకుబడి, కీర్తి ప్రతిష్ఠలను బట్టి- మానసిక పరీక్షలకు గురికావచ్చు. అవాంతరాలను సృష్టించే మిథ్యావాదులను భరిస్తూ నమాజులనాచరిస్తూ నీతిమంతులై ఉన్నవారికి అల్లాహ్‌ దీవెనలు లభిస్తాయి. శాశ్వత అశాశ్వతాలను గుర్తించి అన్నీ అల్లాహ్‌ అనుగ్రహాలేనని వినమ్రతతో మెలగాలి. అదే నిజమైన స్వయం సమర్పణ ఆధారిత ఇస్లాం ధర్మ సూక్ష్మం. బాహ్యాంతర ఘర్షణలన్నింటినీ అల్లాహ్‌కు వదిలేసి ఆయనపై¸నే భారం మోపితే తవక్కుల్‌ అంటారు. అల్లాహ్‌ను తమ వకీల్‌గా నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు. అరబ్బీ భాషలో వకీల్‌ అంటే సంరక్షకుడని అర్థం. ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) స్వయంగా అనేక కష్టాలు అనుభవించారు. హింస, దౌర్జన్యాలు భరించారు. శత్రువులను క్షమించి ఎల్లప్పుడూ బానిస బతుకుల సంక్షేమానికి కృషిచేశారు. మానవాళికి మార్గదర్శిగా నిలిచారు. బలహీన క్షణాల్లోనూ కొలిమి మంటల్లో కాగిన ఉక్కులా దృఢమైన విశ్వాసాన్ని చూపేవారు అదృష్టవంతులు. అందరూ ఈ పవిత్ర రంజాన్‌ మాసంలో అల్లాహ్‌ కరుణా కటాక్షాలు పొంది విజేతలుగా నిలవాలి. ఆమీన్‌.

- షేక్‌ బషీరున్నీసా బేగం


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న