ఆవేశ రాహిత్యం

అంతర్యామి

ఆవేశ రాహిత్యం

మాట ఒక తపస్సు లాంటిది. నోటి నుంచి వెలువడే మాట ఆవేశాన్ని కలిగించకుండా, సత్యసమన్వితమై ప్రియమైనదై మేలును కలిగించేదై ఉండాలని భగవద్గీత చెబుతోంది. అలా మాట్లాడగలిగేవారే అందరి శ్రేయం కోరేవారు. లోకంలోని మానవులు విభిన్న మనస్తత్వాలతో జీవిస్తుంటారు. ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి ఇష్టమైన పదార్థం మరొకరికి వెగటుగా అనిపించవచ్చు. ఇది లోకసహజమే. పశుపక్ష్యాదులకు లేని గొప్పవరం అయిన ‘మాట్లాడటం’ అనే గుణాన్ని బ్రహ్మదేవుడు మనిషికి ప్రసాదించాడు. జంతువులకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేదు. ఆలోచించి మాట్లాడగలిగే అదృష్టం లేదు. ఆ రెండు దివ్యగుణాలను మనిషికి దానం చేశాడు విధాత.
దురదృష్టవశాత్తు మనిషి తన ‘మాట’ను అదుపులో ఉంచుకోవడం లేదు. మాటలను తూటాలుగా చేసి ఎదుటివారి హృదయాలను గాయపరుస్తున్నాడు. నీతిబాహ్యమైన తన ప్రవర్తనను సమర్థించుకొనేందుకు ఇతరులను అసభ్యంగా దూషించడానికీ వెనకాడటంలేదు. పరమశాంత స్వభావులను సైతం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి.
మాటలు బంగారు పుష్పాల వంటివని, అవి మనసులో ప్రభవించే రత్నాలని, అవి సకల మంగళాలకూ నిలయాలని, దేవతలకు ప్రతిరూ పాలని, అభ్యుదయ కారకాలని, లక్ష్మీనివాస స్థానాలని వ్యాకరణశాస్త్రం చెబుతోంది. ఒక్క అమంగళకర వాక్యం కూడా నోటినుంచి వెలువడరాదని, అలా వెలువడితే అది మనిషి ఆయుర్దాయాన్ని తగ్గించి వేస్తుందని- శబ్దశాస్త్ర రహస్యాలు తెలిసిన పాణిని, వర రుచి, పతంజలి వంటి మహర్షులు ఉద్బోధించారు. పొరపాటున గానీ బుద్ధిపూర్వకంగా కానీ మనిషి తన నోటినుంచి చెడుమాటలనో, తిట్లనో ఉచ్చరిస్తే దేవతలు ‘తథాస్తు’ అంటారని, అప్పుడు ఆ మాటలే శాపాలై ఎదుటివారి వినాశనానికి కారణాలవుతాయని అంటారు. కనుక, చెడు మాటల వల్ల సమాజానికి ఎంత అనర్థమో గ్రహించవచ్చు. వేదం కూడా- ‘సత్యాన్నే మాట్లాడు... ప్రియంగా మాట్లాడు... సత్యాన్ని కూడా అప్రియంగా మాట్లాడకు... ప్రియమైంది కదా అని అబద్ధం మాట్లాడకు... ఇదే మానవ ధర్మం!’ అని చెబుతోంది. మనిషి వేద వాక్యాలను శిరోధరించాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే ప్రియాన్నే హితాన్నే మాట్లాడాలి.
ఒక మంచిమాట పలకడం వల్ల మనిషికి వేయి ఏనుగుల బలం వస్తుంది. చెడుమాట పలకడం వల్ల మనిషి మనసు నీరసించిపోతుంది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు. కాబట్టి, కలలోనైనా చెడుమాట నోటినుంచి వెలువడరాదు. ‘ప్రాణం పోయినా సరే చెడుమాటను మాత్రం ఎన్నడూ పలకను’ అని తమ జీవితాన్నే ధారపోసిన పూర్వపురుషులెందరో ఉన్నారు. వారి మాట పూలబాట. ప్రియభాషణం వల్లనే రాముడు ఆదర్శ మానవోత్తముడైనాడు. ప్రియభాషణంతోనే మహర్షులు గర్వాంధులైన రాజులకు కనువిప్పు కలిగించారు.
నేటి కాలంలో ధనం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, అక్రమార్జనల కోసం, అనుచిత సుఖాల కోసం, దుర్వ్యసనాల కోసం... మనుషులు తోటివారిని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉద్వేగకర వ్యాఖ్యల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొంటున్నారు. మనిషిలో ఆత్మవిమర్శ కలగాలి. ఒక్కమాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించాలి. అదే మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి దర్పణం!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న