చాణక్య నీతి

అంతర్యామి

చాణక్య నీతి

చరిత్ర పురుషుల్లో చాణక్యుడి స్థానం విశిష్టమైనది. అలాంటి వ్యక్తిని మళ్ళీ చరిత్ర చూడలేదు. బహుశా మళ్ళీ చూడటం సాధ్యం కాకపోవచ్చు.
రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయగల ప్రజ్ఞ చాణక్యుడి సత్తా. తనను ఘోరంగా అవమానించిన నవనందుల్ని నేలంటా అణగ దొక్కి, సామాన్యుడిగా బతుకుతున్న చంద్రగుప్తుణ్ని రాజుగా చేసిన ఘనత ఆయనది. ఆయనకు కౌటిల్యుడనే పేరూ ఉంది. అర్థశాస్త్ర రూపకర్తగా ఆయనకు ప్రపంచవ్యాప్త కీర్తి లభించింది.
అధికార మదంతో రాజులు ప్రజలను నిరంకుశంగా పాలించడాన్ని స్వయంగా అనుభవించిన చాణక్యుడు ప్రజారాజ్యాలను ప్రతిపాదించాడు. ఎవరు ప్రజలచేత ఎన్నికవుతారో వారే పాలకులు. ఆనువంశిక పాలనను చాణక్యుడు వ్యతిరేకించాడు. ఒకప్పుడు రోమ్‌ లాంటి చోట్ల ఉత్తమ వీరుడికే రాజ్యాధికారం లభించేది. ‘రాజ్యం వీరభోజ్యం’ అనే సూక్తిని పాటించేవారు.
ఇప్పుడు రాజ్యం వీరభోగ్యంగా మారిపోయింది. ప్రజాపాలన అపహాస్యమవుతోంది. ప్రజల అభీష్టాలు తీరే దారే కనిపించడం లేదు.
పాలకులకు ప్రజాసంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టితో పాటు ఆచరణాత్మక నిబద్ధత ఉండాలి. అధికారాన్ని  అవకాశంగా తీసుకుని తమ స్వార్థానికి పెద్దపీట వేసినా పదవులు పదిలం కావు. తీరా అధికారం చేజారిపోయాక ఎంత చింతించినా వ్యర్థమే.
మనిషి కాలమహిమను అర్థం చేసుకోలేకపోతుంటాడు. తన శరీరం, సిరిసంపదలు, అధికార హోదాలు శాశ్వతమనే భ్రమలో బతుకుతుంటాడు. సంకోచం లేకుండా అన్ని తప్పులూ చేస్తుంటాడు. పర్యవసానాల గురించి కాస్తయినా ఆలోచించడు.
ప్రతి వ్యక్తికీ క్రమశిక్షణ అనేది జీవితానికి పునాది వంటిది. క్రమశిక్షణ అన్నింటా ఉండాలి. నడవడిక మాత్రమే కాదు. ఆర్థిక క్రమశిక్షణా అత్యంత ప్రధానం. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్లు- ఆదాయ పరిధులు దాటకుండా ఖర్చు చెయ్యాలి. అందులోనే కొంత పొదుపు చెయ్యాలి. అనుకోని అనారోగ్య సమస్యలు రావచ్చు. మరేవైనా ప్రాణావసరాలు డబ్బుతో ముడివడి ఉండవచ్చు.
అప్పటికప్పుడు అప్పు పుట్టకపోవచ్చు. పుట్టినా తీర్చగల స్థోమత లేకపోవచ్చు. ముందే పొదుపు పాటించి సొమ్ముదాచి ఉంచితే ఎవరి ఎదుటా చెయ్యి చాచాల్సిన దుర్గతి దాపురించదు.
కొందరు ఆపదలో ఆర్థిక సాయం చేసినవారిని తప్పించుకు తిరుగుతుంటారు. అలాంటివారి కారణంగానే సాయం చేయగలవారూ సంశయిస్తారు. మొండిచెయ్యి చూపిస్తారు. నిజాయతీ లేనివారిని ఎవరూ నమ్మరు. అశక్తతను అర్థం చేసుకోవచ్చు. కానీ, కృతఘ్నతను ఎవరూ సహించరు.
ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్రే కాలినట్లు, ఎవరి మనసులు అసూయా ద్వేషాలతో రగిలి పోతుంటాయో- వారే నష్టపోతారు. శరీరం కూడా ఒక సామ్రాజ్యం లాంటిదే. మంచి ఆలోచనలన్నీ మన మిత్రులు, చెడు ఆలోచనలే మన శత్రువులు. విజ్ఞత, విచక్షణలే మన ఆయుధాలు. మన మేధ చాణక్యుడిలా పనిచెయ్యాలి. నవనందుల్లాంటి దుష్ట భావనలను అణచివెయ్యాలి. మనసును చంద్రగుప్తుడిలా బలోపేతం చేసుకోవాలి. గెలవాలి. పరిమితమైన జీవితకాలమే మన సంగ్రామ సమయం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వ్యతిరేక పరిస్థితుల్లో యుక్తియుక్తంగా చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యనీతి సూత్రం. దీన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న