కృష్ణమూలం

అంతర్యామి

కృష్ణమూలం

సామాన్యులు సైతం చదివి ఆకళించుకోగలిగే అసామాన్యమైన అనూహ్యమైన ఏకైక పురాణం భాగవతం. దాని రచనకు పడిన పునాదుల బలమే అందుకు కారణం. విశ్వమంతా భగవంతుడి నెలవుగా, కొలువుగా చిత్రించి చేసిన రచన అది. దీని పఠన/శ్రవణ మాత్రం చేతనే కలియుగంలో భక్తి నిలబడేటట్లు గొప్పగా రచించాడు వ్యాసుడు.
భాగవతాన్ని మొదట శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడట. ఆయన దాన్ని నారదుడికి ఉపదేశించాడు. ఆ కథనంతటినీ సంక్షిప్తీకరించి నాలుగు శ్లోకాల్లో వ్యాసుడికి ఉపదేశించి, కలియుగ జనులకు సూక్ష్మంలో మోక్షం కలిగే మహాపురాణంగా మలచమని వ్యాసుణ్ని ఆదేశించాడు నారదుడు.
అలా వ్యాస భగవానుడు భాగవత రచనకు పూనుకొన్న సమయంలో, నారదుడు ఇంకొన్ని సూచనలూ చేశాడంటారు. అవేమిటంటే- కలియుగంలో ప్రజలు అల్పాయుష్కులు, బుద్ధిబలం తక్కువైనవారై ఉంటారు. వారి ఆలోచనలెప్పుడూ అర్థ కామాలనే రెండు పురుషార్థాలపైనే కేంద్రీకృతమై ఉంటాయి. వాటినుంచి వారి దృష్టిని మరల్చి భగవద్భక్తికి సంబంధించిన విషయాలను అందరికీ అందించడం నీవు చేయాల్సిన పని. వారు తెలిసో తెలియకో, భాగవతాన్ని వినేలా/చదివేలా రచించు. అందులో సాధ్యమైనంతవరకు భగవంతుడికి సంబంధించిన విశేషాలు, భక్తుల కథలతో కూడిన విషయాలే తెలియజెయ్యి.
అలా చేస్తే భాగవత శ్రవణం/ పఠనం వల్ల మనసు భగవద్భక్తి వైపు మరలుతుంది. ఫలితంగా ధర్మ, మోక్షాలనే మిగిలిన పురుషార్థాలనూ పొందగలుగుతారు. హీనమార్గం లోకి వెళ్ళిపోకుండా మంచివైపు మరలుతారు.
ఒంటికి పట్టిన బురదను తొలగించుకోవడానికి స్నానం చెయ్యాలని బురద నీటిలోకి దిగితే ప్రయోజనం లేదు. మంచినీటి సరస్సును ఆశ్రయించాలి. అలాగే ఇంద్రియ లోభానికి గురై కొన్ని కోట్ల జన్మలు ఎత్తినవాడు మళ్ళీ ఇహలోక సుఖాలనే కోరుకుంటే ఉత్తమ గతులు పొందలేడు. బురద అంటినవాడు మంచినీటి స్నానం చేస్తే ఎంత ప్రయోజనమో భాగవత పఠనం వల్ల సైతం అంత ప్రయోజనం ఉండాలి. అంటే, భాగవతమే ఆ మంచినీటి కొలను కావాలి.
మునిశ్రేష్ఠుడవైన నువ్వు రచించిన ఈ భాగవతాన్ని సద్భక్తితో వినగోరేవారి నిర్మల చిత్తాల్లో ఈశ్వరుడు శీఘ్రమే ప్రవేశిస్తాడు. కపటం, కోరిక, మాత్సర్యం వంటివి లేనివారికి, మంచిబుద్ధి గలవారికి, ఈ భాగవత తత్వం వల్ల మహత్వబుద్ధి కలిగి, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే తాపత్రయాలు తొలగిపోయి, పరమార్థ తత్త్వం అనుభవంలోకి వస్తుంది’ అని సూచించాడట.
భగవంతుణ్ని బుద్ధి కుశలత, అర్పణ భావాల ద్వారా మాత్రమే త్వరగా చేరుకోగలగాలి. తనలో ఉన్న మార్గదర్శి భగవంతుడేనని, ఆయనే తనలో ఉండి పనిచేయిస్తున్నాడనే భావం ద్వారా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోగలగాలి అని చెప్పడంతో- ఆయన సూచనానుసారం రచించాడు వ్యాసుడు.
అందువల్లే ‘భాగవతం లలితస్కంధం, కృష్ణమూలం, శుకాలాపాభిరామం, మంజులతా శోభితం, సువర్ణ సుమనస్సుజేయం, సుందరోజ్జ్వల వృత్తం, మహాఫలం, విమలవ్యాసాలవాలమై కల్పతరువులా భూమిమీద సర్వజన శ్రేయమైన కావ్యంగా నిలుస్తుంది’ అని నారదుడు చెప్పాడని పురాణ కథనం.

- అయ్యగారి శ్రీనివాసరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న