వైశాఖమాస విభవం

అంతర్యామి

వైశాఖమాస విభవం

వైశాఖం ఎంతో పవిత్రమాసం. ఈ నెలలో ఎందరెందరో మహాత్ములు జన్మించారు. నరసింహస్వామి, హనుమంతుడు, పరశురాముడు, ఆదిశంకరులు, కన్యకాపరమేశ్వరి, బసవేశ్వరుడు, అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ మొదలైన వారందరూ వైశాఖ మాసంలో జన్మించిన వారే.
వైశాఖాన్ని మాధవమాసమనీ అంటారు. ఈ మాసమంతా తులసిదళాలతోపాటు మల్లెలు, తామరపువ్వులు చేర్చి మహావిష్ణువును పూజిస్తే శుభప్రదమని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలోనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం పద్మావతీ దేవితో జరిగింది.
శ్రీమహావిష్ణువు దర్శనార్థం వచ్చిన సనకసనందనాదులను అడ్డగించిన జయ విజయులనే ద్వారపాలకులు శాప ఫలంగా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు అహంకారపూరితుడై భూమిని చాపగా చుట్టి తలపై పెట్టుకొని రసాతలం వెళ్ళాడు. అప్పుడు శ్రీహరి వరాహరూపంలో అతణ్ని నిర్జించి భూదేవిని కాపాడాడు. ఈ కారణంగా శ్రీ మహీజయంతినీ వైశాఖమాసంలోనే జరుపుకోవడం ఓ విశేషం. అన్నను చంపిన కారణంగా శ్రీహరిపై హిరణ్యకశిపుడు ద్వేషం పెంచుకొన్నాడు. హరిభక్తుడైన తన తనయుని చిత్రహింసల పాల్జేశాడు. తన భక్తుడి బాధను చూసి శ్రీహరి తాళలేక దుష్టశిక్షణకై స్తంభంలో ప్రకటితుడై వైశాఖ శుద్ధ చతుర్దశి ప్రదోషకాలంలో హిరణ్య కశిపుణ్ని సంహరించాడు.
పరమేశ్వరుడి అంశ వాయు దేవుడి ద్వారా అంజనాదేవికి చేరి వైశాఖ బహుళ దశమినాడు హను మంతుడు జన్మించాడు. రుద్రాం శతో జన్మించిన హనుమంతుడు రామాయణ మహాకావ్యంలో హృదయ స్థానీయుడయ్యాడు.
ఆది శంకరాచార్య కేరళలోని కాలడిలో ఏడో శతాబ్దంలో వైశాఖ శుద్ధ పంచమినాడు జన్మించారు. ఆయన ఏక సంథాగ్రహి. శ్రీ కృష్ణ పరమాత్మ తరవాత భారతీయులు జగద్గురువుగా నోరారా పిలుచుకొన్నది ఆదిశంకరులనే. భారతీయ ధార్మిక జీవనంలో అవ్యవస్థ నెలకొన్నప్పుడు, అజ్ఞానం ముసురుకొన్నప్పుడు, ఆచార కాండల పేరిట ఆర్భాటాలు తోడైనప్పుడు శంకరభగవత్పాదులు ఉదయించారు. ఆ జ్ఞాన భాస్కరులు అల్లంత దూరాన ఆకాశంలో నిలిచిపోకుండా నేలమీద కాలు సాగించి దేశం నలుమూలలా పర్యటించి అద్వైత సిద్ధాంత ప్రభలను ఉజ్జ్వలంగా నిలిపారు.
1423లో వైశాఖ మాసాన జన్మించిన అన్నమాచార్య వేంకటేశ్వరస్వామి వారిపై ముప్ఫైరెండువేల మధుర భక్తి సంకీర్తనలు రచించిన వాగ్గేయ కారుడు. పదకవితా పితామహుడిగా కీర్తినందుకొన్నాడు. ఆంధ్ర భాషా భారతిని స్వతస్సిద్ధమైన తెలుగు పదాలతో సర్వజన, సర్వమత, సమానత్వం అనే వైష్ణవ సిద్దాంతాన్ని నినదించిన అన్నమయ్య నిన్న, నేడు కాదు- రేపటి తరానికి సైతం మార్గదర్శి కాగలడనడంలో సంశయం లేదు.
నరసింహస్వామి వారి అంశతో 1730లో నృసింహ జయంతి నాడే జన్మించిన మహిమాన్వితురాలు తరిగొండ వెంగమాంబ. ఈమె శ్రీనివాసుడి పాదపద్మాలకు జీవితాన్ని అంకితం చేసి నిశ్చలభక్తితో, నిరంతర దైవ స్మరణతో పరిసరాలతోపాటు తన చుట్టూ ఉన్న జనావళిని భక్తితో పరిమళ భరితం చేసిన అనన్య భక్తురాలు. విశిష్ట విదుషీమణి. ఈమె ఎన్నో కృతులు వెలయించి ఆంధ్ర వారస్వత లోకంలో తన భక్తి ద్వారా ప్రసిద్ధి చెందిన వెంగమాంబ జీవితం ఆపాత మధురం. ఆద్యంతం స్ఫూర్తిదాయకం.

  - యం.సి.శివశంకరశాస్త్రి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న