సింహాచల చందనోత్సవం

అంతర్యామి

సింహాచల చందనోత్సవం

‘కోటి పున్నములు ఒక్కసారి వచ్చి వెన్నెల వాన కురిసినట్లు, కోటి పద్మాలు రేకులు విప్పి జల జల తేనె కాలువలు చిందించినట్లు, కోటి హంసలు రెక్కల కాంతితో తళతళలు చిలికినట్లు, కోటి ముత్యాలు దండగా గుచ్చినట్లు’ శ్రీ సింహగిరి వాసుడి నిజరూపం సాక్షాత్కరించిందని అభివర్ణించారు శ్రీ చందన శతక కర్త, విద్వత్కవివరేణ్యులు శ్రీ మానాప్రగడ శేషసాయి.
శ్రీహరి తన దశావతార వైభవంలోని మూడు, నాలుగు అవతారాల యుగళంగా దర్శనమిచ్చింది సింహాచలంలో శ్రీవరాహాలక్ష్మీనరసింహస్వామిగా మాత్రమే. నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్త్వానికి, మూలాధారానికి, విశ్వ చైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మ తత్త్వాన్ని దర్శిస్తుందని పండితులు చెబుతారు.
దక్షిణ భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లో ప్రముఖమైనది సింహాచల క్షేత్రం. తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యం నడుమ వెలసిన స్వామి అశేష భక్త కోటికి ఇలవేల్పు. శ్రీ మహా విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించాక, నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ని సంహరించాడు. హిరణ్యకశిపుడి పుత్రుడు పరమ విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడి కోరికపై స్వామి వరాహనృసింహుడిగా వైశాఖ శుద్ధ తదియ నాడు వెలసి పూజలందుకుంటున్నాడని ప్రతీతి. స్వామిని ప్రహ్లాదుడు సేవిస్తున్న కాలంలోనే బ్రహ్మ మహేశ్వరుడితో, ఇంద్రాది దిక్పాలురతో సింహగిరికి తరలి వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ కథనం. ఇది కృతయుగం నాటి గాథ.
అనంతర కాలంలో స్వామికి ఆరాధనలు లేక ఆలయం శిథిÅలమై శ్రీవారిపై పుట్టలు లేచి దివ్య మంగళ విగ్రహం కనుమరుగైంది. షట్చక్రవర్తుల్లో ఒకరైన పురూరవుడు ఊర్వశితో గగన మార్గాన విహరిస్తుండగా వారి విమానం స్వామి ఉన్న ప్రదేశం నుంచి ముందుకు సాగకుండా నిలిచిపోయింది. ఊర్వశి తన దివ్య దృష్టితో ఆ ప్రదేశంలో వరాహ నరసింహుడు ఉన్నాడని గ్రహించి పురూరవుడికి తెలిపింది. నాటి రాత్రి స్వామి పురూరవుడికి స్వప్నంలో కనిపించి తనను పుట్ట నుంచి బయటకు తీసి గంధాన్ని సమర్పించమన్నాడు. భూమికి గంధవతి అని పేరు. అందుకే పుట్ట మట్టికి బదులు గంధాన్ని సమర్పించమన్నాడు. చక్రవర్తి సహస్ర కలశ గంగ ధారతో, పంచామృతాలతో స్వామిని అభిషేకించాడు. ఇది స్థల పురాణం. హిరణ్యకశిపుడి వధానంతరం ఉగ్రనరసింహుని చల్లబరచడానికి దేవతలే చందనం పూశారని భక్తుల విశ్వాసం.
వైశాఖ శుద్ధ తదియ నాడు అంటే చందనోత్సవం నాడు ఏడాది పొడవునా స్వామి దేహానికి పూసిన చందనాన్ని వలిచి, నిజరూప సందర్శనం కలిగిస్తారు. అనంతరం స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనం పూస్తారు. తరవాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి దినాల్లో మూడేసి మణుగుల చందనం సమర్పిస్తారు. మూడు మణుగులు అంటే ఇప్పటి లెక్కల్లో 120 కేజీలని ఆ క్షేత్రంలోని పండితులు చెబుతారు.
స్వామి వారి పూజా విధానం పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరుగుతుంది. గోవిందరాజ స్వామి ఇక్కడ ఉత్సవ మూర్తి. మదనగోపాలస్వామి శయన మూర్తి. వేణుగోపాల స్వామి స్వప్న మూర్తి. యోగ నారసింహమూర్తి బలి మూర్తి. సుదర్శనుడు చక్ర పెరుమాళ్‌. ఈ అయిదుగురు మూర్తులకు జరిగే నిత్యారాధనను ‘పంచభేరి’ అంటారు. ఈ ఆలయంలో ‘కప్పస్తంభం’ విలక్షణమైనది.

- డి.భారతీదేవి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న