మొల్ల రామాయణం

అంతర్యామి

మొల్ల రామాయణం

రామాయణం ఆదికావ్యం. రామచరితం రసభరితం. ఆదికవి వాల్మీకి రచించిన రామాయణాన్ని ఎన్నో భాషల్లో ఎంతమందో మహనీయులు మరలా రచించారు. ఇప్పటికీ రచిస్తున్నారు. ఎవరి భక్తి వారిది. ఎవరి ప్రత్యేకత వారిది. భక్తికి కులమతాలు, లింగభేదాలు అడ్డురావు.
రామాయణాన్ని రసరమ్యకావ్యంగా రచించి ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఆణిముత్యంగా నిలిచిపోయింది ఆతుకూరి మొల్ల.
మొల్ల పేరు వినగానే మొల్ల రామాయణం అందరికీ స్ఫురిస్తుంది. మొల్ల అంటే మల్లెపూవు. ఆ పేరులాగే ఆమె రచించిన రామాయణ సౌందర్య సౌరభం నలుదిశలా గుబాళిస్తూనే ఉంది.
పదిహేను, పదహారు శతాబ్దాల్లో జీవించిన మొల్ల అచ్చతెలుగులో రామాయణ రచన చేసి అందరినీ అలరించింది. మొల్ల కుమ్మరి వంశస్తురాలు. నెల్లూరు మండలం గోపవరంలో జన్మించింది. మొల్ల తండ్రి కేసన గురులింగ జంగమార్చనపరుడు. గొప్ప శివభక్తుడు.
స్త్రీలు ఎక్కువగా చదువుకునే అవకాశాలు లేని ఆ కాలంలో పుట్టినా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రామాయణం వంటి ఉద్గ్రంథం రాసిది మొల్ల. తాను చదువుకోలేదని శ్రీకంఠమల్లేశ్వరుడి వరంచేత కవిత్వం చెబుతున్నానని వినయభావంతో ప్రకటించింది. చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలుకుమీద తాను రామాయణ రచనకు పూనుకొన్నట్లు వివరించింది.
‘తేనెసోక నోరు తీయన యగురీతి’గా కవిత్వం వీనులవిందుగా ఉండాలం టుంది మొల్ల. అంత మధురంగానూ ఆమె తేటతెలుగులో రామాయణం రచించి వాసికెక్కింది.
రామచరితం ఇహపర సాధనం. భక్తికి, ముక్తికి మూలం. ఇంతటి విశేషమైన రామాయణం వేదతుల్యం. ఇది మూర్తీభవించిన ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీరాముడి దివ్యచరితం. అందుకే మొల్ల రామాయణం రచించి తరించింది. ఇది ఆరు కాండాల పద్యకావ్యం.
మృదువైన మాటలతో, దేశీయాలైన పలుకుబడులతో సరళ గంభీర సరళితో ఉన్న మొల్ల రామాయణం చదివినవారికి ఆమె కవిత్వతత్త్వం ఆకళించుకున్న విదుషీమణి అని అర్థమవుతుంది. ఆమె కవిత్వం ద్రాక్షాపాకం.
మొల్ల తన రచనలో అలంకారాలు, రసపోషణ, ప్రబంధ లక్షణాలన్నింటినీ చక్కగా పాటించింది. శ్రీరాముణ్ని అడవులకు పంపేటప్పుడు దశరథుడి దుఃఖాన్ని మహాద్భుతంగా వివరించింది. నదిని దాటించేముందు గుహుడు రాముడి పాదాలు కడగడాన్ని హృద్యంగా వర్ణించింది. సీతాదేవి ముగ్ధత్వాన్ని, పాతివ్రత్యాన్ని ఎంతో ప్రభావాన్వితంగా చిత్రీకరించింది. భక్తి, కరుణ రసాలను ఎంతో చాకచక్యంగా వర్ణించిన మొల్ల- యుద్ధఘట్టాల్లోనూ రౌద్ర వీర రసాలను నైపుణ్యంతో చిత్రించగలిగింది.
మహాకవి పోతన తన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చిన తీరుగా, మొల్ల తన రామాయణాన్నీ రామచంద్రుడికే అంకితమిచ్చింది. మొల్ల ఆ విష్ణుమూర్తినే తన భర్తగా భావించి బ్రహ్మచారిణిగా భక్తిసాధనలోనే జీవించి తరించింది. ఆమె సమకాలీన మూర్ఖుల వ్యతిరేకతలను అధిగమించిన ధైర్యశాలి. ఆమె ఏనాడూ సన్మానాలు, సత్కారాలు ఆశించలేదు. ఆత్మానందం కోసం ఆమె రచన చేసింది.
కమ్మని కవిత్వంతో జనరంజకంగా రామాయణం రాసిన ప్రథమాంధ్ర కవయిత్రి మొల్ల. సామాన్యులకు సైతం తన రామాయణం అర్థం కావాలని తేట తెలుగులో చక్కని సామెతలతో రామాయణ రచన చేసి ధన్యురాలైంది. తెలుగు సాహితీవనంలో శాశ్వతస్థానం సంపాదించుకున్న మొల్ల మహిళాలోకానికే గర్వకారణం!

- విశ్వనాథ రమ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న