సర్దుబాటుకు చోటిద్దాం!

అంతర్యామి

సర్దుబాటుకు చోటిద్దాం!

నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా, చేరుకోలేమనిపించినా ఎంతో కొంతదూరం ప్రయాణించాలి. కనీసం చేరుకునే ప్రయత్నం జరగాలి. లక్ష్యం చేరుకున్నామా లేదా అన్నదాని కంటే- ఎటువంటి కుయుక్తులూ పన్నకుండా ప్రయత్నం చేశామా లేదా అన్నది ముఖ్యం.  విలువైనదాన్ని అందుకుంటున్నామనే భ్రమలో, ప్రయత్నంలో మన విలువల్ని తాకట్టు పెట్టకూడదు.
జీవితంలో అనేక ఎత్తుపల్లాలుంటాయి. అన్నిరకాల మనుషులతో, భిన్న పరిస్థితుల్లో ముందుకు సాగిపోవలసిందే. కొన్నిసార్లు సాగిపోవడం తేలిక గానూ, మరికొన్ని సార్లు కష్టతరంగానూ అనిపిస్తుంది. ఓర్పునకు పెద్ద పరీక్ష అనిపించవచ్చు. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉండాలని ఎక్కడుంది? పరిస్థితులు ఎటువంటివైనా మన వివేకంతో అతి తక్కువ ఘర్షణ, ప్రతిఘటనలతో జీవనయాత్ర సాగించగలగడం ముఖ్యం.
కొన్ని కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు కలగవచ్చు. అంగీకరించేందుకు మనసు సహకరించకపోవచ్చు. మన ఆలోచనా దృక్పథం, విలువలు ఏదైనా కావచ్చు- ఆ విషయంలో సగమే మంచి ఉందనిపించవచ్చు. మిగతా సగం మనం చెడుగా ముందే భావించి ఓ నిర్ణయానికి వచ్చేయవచ్చు. సగం సమ్మతం, మిగతా సగం అసమ్మతం అనిపించినప్పుడు మనుషులతోను, పరిస్థితులతోను సమస్యలు ఎదురుకావడంలో ఆశ్చర్యం లేదు. పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. అలాగే మన ‘అహం’ గానీ ఇటువంటి సందర్భాల్లో ప్రవేశిస్తే ‘వివేకం’ కనుమరుగవుతుంది. విషయాన్ని నిష్పాక్షికంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని కోల్పోతాం. పక్షపాత వైఖరితో ఆలోచించి అవతలివాళ్లు మనలాంటివారేనన్న విషయాన్ని మరచిపోతాం.
తన పంథాను నెగ్గించు కోకపోవడమంటే ఓటమిని అంగీకరించడమే అనుకోవడం తప్పు. అది దాసోహం అయిపోవడమూ కాదు. సిగ్గు పడాల్సిన విషయంగా గానీ బాధపడాల్సిన విషయంగా గానీ భావించకూడదు. అహాన్ని జయించగలిగే నిబ్బరం మనలో నిండి ఉన్నందుకు సంతోషించాలి. అంటే అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించినట్లు లెక్క.
ఎదుటివారి అభిప్రాయాల్ని, ఆలోచనలను అర్థం చేసుకుని మాట్లాడే ధోరణిని అలవరచుకోవాలి. అవతలి వారిలోని గొప్పతనాన్ని చూడటమంటే మనలో అవలక్షణాలున్నాయని కాదు. కాలాన్ని బట్టి, మనుషుల్ని బట్టి అన్ని విషయాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయని గ్రహించాలి. అసలు విగ్రహాన్ని వదిలేసి దాని నీడ వెనక పరిగెత్తకూడదు.
ఘర్షణకు దారితీయకూడదని భావిస్తే ‘సర్దుబాటు’ను అలవాటు చేసుకోవాలనేది ప్రకృతిలోనే ఉంది... భయంకరమైన గాలి సర్వాన్ని అల్లకల్లోలం చేస్తున్నప్పుడు ఎంత బలమైన వృక్షమైనా స్థిరంగా ఉండలేక అటు ఇటూ ఊగిపోతుంది. పరిస్థితులకు ఎదురొడ్డక తప్పదు.
ఒక గడ్డిపోచ వేగంగా ప్రవహించే నీటిధార ఆగిపోయిన తరవాత నెమ్మదిగా తలెత్తుతుంది. ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగే పరిస్థితుల్ని ప్రకృతిలోనే చూస్తుంటాం. అటువంటిది మేధ కలిగిన మనిషి ఎదుర్కోలేకపోవడం ఏముంటుంది? ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉంటూ మనకు మనం ప్రశాంతతను కలగజేసుకోవడం ముఖ్యం. ప్రకృతి నేర్పిన ఈ ‘సర్దుబాటు’తో సఖ్యతను సాధిస్తూ, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, ఘర్షణలకు తావివ్వక ప్రశాంత జీవనానికి కృషి చేయాలి. ఆధ్యాత్మిక ఆలోచనలతో ఇంటా బయటా శాంతిని నెలకొల్పే దిశగా పయనించాలి. సర్దుబాటుతనం విలువను గుర్తెరిగి, మన విలువల్ని కాపాడుకుంటూనే ముందుకు వెళ్ళాలి.

- మంత్రవాది మహేశ్వర్


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న