జగద్గురువు

అంతర్యామి

జగద్గురువు

‘సమాజంలో అస్తవ్యస్తత ఏర్పడినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, దాన్ని తిరిగి సన్మార్గంలో పెట్టడానికి భగవంతుడే అవతరిస్తాడు!’ అని భారతీయుల విశ్వాసం.అది సత్యసమ్మతమేనని శంకరుల పుట్టుక రుజువు చేస్తున్నది. సామాన్య మానవులెవరికీ సాధ్యంగాని అద్భుత కృత్యాలెన్నో ఆయన చేసి చూపించారు. అన్యమతాలవారివల్ల మన సాంస్కృతిక జీవన విధానానికి భంగం ఏర్పడిన దశలో, ఆజ్ఞానాంధకారం అలముకున్న ప్రమాదకర పరిస్థితుల్లో మన పవిత్ర దేశంలో అవతరించి వెలుగులు నింపిన హైందవ సూర్యుడు శ్రీశంకరాచార్యులు.
శంకరాచార్యుల కాలం ఈ శకంలోనే 686-820 అని పాశ్చాత్య పరిశోధకుల నిర్ణయం. కానీ ఆయన అంతకుముందు శకంలోనే 200 సంవత్సరాల పూర్వమే ఉద్భవించారని సనాతనవాదుల నమ్మకం. వైశాఖ శుద్ధ పంచమి శంకరజయంతి. జన్మ స్థలం కేరళ లోని ‘కాలడి’ గ్రామం. తల్లి ఆర్యాంబ. తండ్రి శివగురువు. ఆయన బాల్యంలోనే మలయాళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో పాండిత్యం సంపాదించారు. 32 సంవత్సరాల వయసుకే తాము వచ్చిన ‘అద్వైత మత ప్రాచుర్యం’ కార్యాన్ని విజయవంతంగా పూర్తి గావించుకొని ఈ మహా పురుషుడు అవతారం చాలించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే భిక్ష కోసం ఒక పేదరాలి ఇంటి ముందు నిలుచున్నప్పుడు, ఆమె తనవద్ద ఉన్న ఉసిరి కాయనే భక్తితో సమర్పించింది. శంకరులు కరుణతో కనకధారా స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారని, లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల వాన కురిపించిందని ప్రతీతి. పూర్ణానది నుంచి నీరు తేవడానికి తల్లి కష్టపడుతూ ఉండగా శంకరులు ఆ నదిని ప్రార్థించారు. నది ప్రవాహ మార్గం మార్చుకొని శంకరుల ఇంటి వెనకనుంచి ప్రవహించిందని గాథ. ఇప్పటికీ శంకరుల ఇంటి వెనక పూర్ణానది ప్రవహిస్తూ కనిపిస్తుంది! ఆయన పసితనంలోనే తన భవిష్యత్‌ జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. తల్లి అనుమతిని ఎలాగో సంపాదించి, సన్యసించి, దేశాటనకు బయలుదేరారు. తల్లి అంతిమదశలో తాను తిరిగివస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్యాంబ మరణ సమయానికి శంకరులు కాలడికి చేరారు. ఆమెకు అంతిమ సంస్కారాలు చేయడానికి సన్యాసి అయిన శంకరులకు అర్హత లేదని ఊరివారు అడ్డుతగిలారు. శంకరులు తల్లి పార్థివ దేహానికి స్వగృహంలోనే చితిపేర్చి దహనకార్యం గావించారు.
శంకరులు భారతదేశం నలుచెరగులా పర్యటించి, నాలుగు పీఠాలను స్థాపించారు. నాలుగు వేదాలకు సంకేతాలుగా వాటిని చతురామ్నాయాలు అంటారు. అవి ఉత్తరాదిన బదరి జ్యోతిర్మఠం, దక్షిణాదిన శృంగేరి శారదా మఠం, తూర్పున పూరి గోవర్ధన మఠం, పశ్చిమాన ద్వారక శారదామఠం. ఈ మఠాలను వరసగా తోటకాచార్యులకు, పద్మపాదులకు, హస్తామలకులకు, సురేశ్వరాచార్యులకు జగద్గురువులు అప్పగించారు. నిరాకార ఈశ్వరుణ్ని పూజించడం కష్టంగనుక, శంకరులు ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణనాథుడు, మహేశ్వరుడు- అనే దేవతలను పూజించే పంచాయతన విధానాన్ని ప్రవేశపెట్టారు. శైవం, వైష్ణవం, సౌరం, శాక్తం, గాణాపత్యం, కౌమారం- ఈ ఆరుమతాలకు సమరసత నెలకొల్పి షణ్మత స్థాపనా చార్యులయ్యారు. కాశీలో విశ్వేశ్వరుడు వీరికి చండాలుడి వేషంలో దర్శనం ఇచ్చినప్పుడు ‘మనీషా పంచకం’ చెప్పారు.
శంకరులు ‘ఏక శ్లోకి’ మొదలు ‘ప్రస్థానత్రయ భాష్యం’ వరకు 400 గ్రంథాలను రచించారు. మొత్తం 91 స్తోత్ర గ్రంథాలున్నాయి. శివానందలహరి, సౌందర్యలహరి వంటివి ఆయన రచనాపటిమకు, అద్భుత శైలికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇలాంటి గొప్ప సంస్కర్త, తత్త్వవేత్త, మహాకవి కనుకనే ధార్మిక సమైక్యతను సాధించగలిగారు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న