దేనికైనా తపన కావాలి!

అంతర్యామి

దేనికైనా తపన కావాలి!

నిషి అంటే మనసున్నవాడని, ఆ మనసే ఒక పరీక్ష అని అంటారు. మనసున్న మనుషులు పోతపోసినట్టు ఒకేలా ఉండరు. ఎవరి మనసుకు వారు దాసులు కాని మరో మనసుకు బాధ్యులు కారు. వాసనలను బట్టి మనసు, మనసు చేసే ఆలోచనలను బట్టి మనిషి జీవితం నడుస్తాయి. వాసన అంటే వెనకటి జన్మల సంస్కారం. ఆయా జన్మలలో ఆ మనిషి కర్మలను బట్టి సంస్కారాలు ఏర్పడతాయి. వాటినుంచి చెడు పైన ఆధారపడి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు అనుభవించక తప్పదు. కర్మచక్రంలో మనిషి తిరుగుతున్నంతకాలం సుఖ దుఃఖాల వలయంలో పడి అతడి జీవితం గిరగిరలాడుతూనే ఉంటుంది. ఈ క్షణం సుఖం, మరుక్షణం దుఃఖం పట్టి పీడిస్తాయి.
కర్మపాశం నుంచి తప్పుకోవడానికి ముఖ్యమైన మూడు మార్గాలున్నాయి. ప్రయాణానికి ముందు మూట ముల్లె సర్దుకుంటారు. అలాగే ఏ మార్గంలో పయనించాలన్నా ముందుగా మనసును సర్దుబాటు చేయాలి. అది తెలుసుకుంటేనే తికమక పడకుండా సంసార సాగరం దాటి ఆవలి తీరం చేరుకోవచ్చు. జ్ఞాన భక్తి వైరాగ్యాలనే మూడు తరుణోపాయాల్లో దేనినైనా ఆశ్రయించి అడుగు ముందుకు వేయవచ్చు. సాంఖ్యదర్శనం ద్వారా జ్ఞాన యోగులు, శరణాగతి ద్వారా భాగవతులు, నిష్కామకర్మ ద్వారా కర్మజీవులు ముక్తులు కావచ్చు. ఈ మూడూ వేరుగా కనిపించినా, త్రివేణీ సంగమం లాంటివే. జ్ఞాన గంగ, కర్మ యమున, భక్తి సరస్వతి ఏకమై ముక్తి ద్వారం వైపు భక్తులను నడిపిస్తాయి. అంతర్వాహిని సరస్వతి లాంటి భక్తిని ఆశ్రయిస్తే జ్ఞాన వైరాగ్యాలు వరిస్తాయని, ఎవరికివారు కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ మోక్షగాములు కావచ్చునని అంటారు మధ్వాచార్యులు.
భగవంతుడు రస స్వరూపుడు కాబట్టి- భక్తిని మార్గం అనడం కన్నా రసంగా భావించడం, సేవించడం, తద్వారా ముక్తులు కావడం సులభం. భగవాన్‌ కృష్ణ పరమాత్మ ఆ మాటే పదేపదే అర్జునుడికి చెప్పాడు. మనం కర్తలం కాదు నిమిత్త మాత్రులమేనన్న తెలివి- మోక్షానికి తొలిమెట్టు. ఆ తొలిమెట్టు మీద అడుగు పెట్టాలంటే అహంకార మమకారాలు తొలగించు కోవాలి. రాగద్వేషాలే అహంకార మమకారాలకు అసలు కారణాలు.
అభ్యాసం కూసువిద్య అంటారు. సాధన యోగవిద్య... వెరసి అభ్యాస యోగం! తాను గాక, తన తోటివారినందరినీ ముక్త జీవులుగా మార్చాలని ప్రయత్నించే వ్యక్తినే జీవన్ముక్తుడంటారు. దివ్య జీవనం ద్వారా దివ్య మానవుడిగా ఎదగడం ఎలాగో అతణ్ని చూసి మనం నేర్చుకోవాలి. భక్తి సులభమే అయినా, తపన లేనిదే భక్తుడు కాలేడు. భాగవతులు శ్రవణ, మనన, నిదిధ్యాసలనే మూడు మంత్రాల ద్వారా తరిస్తారు. నిరంతరం భగవత్‌ చింతన చేయాలంటే ఆయన దివ్యకథలను వినాలి. మరుగున పడకుండా మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకోవాలి. సాధన అంటే ఇదే!
ఇంతకన్నా సులభ మార్గంలో మనసును తీసుకువెళ్లాలంటే కళ్లకు మంచి దృశ్యాలను చూపించాలి. చెవులకు భక్తి సంగీతాన్ని వినిపించాలి. నోటికి మంచి మాటలు అలవాటు చేయాలి. కాళ్లను పవిత్రమైన ప్రదేశాల్లో నడిపించాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్న తొమ్మిది ఉపాయాలను భాగవతం చెబుతున్నది. భక్తి క్లేశాగ్నిని తట్టుకోగలిగితే ప్రహ్లాదుడిలా ఎన్ని అగ్నిపరీక్షలకైనా భక్తుడు భయపడడు. మనసులో భక్తి బీజం నాటితే భయం తొలగిపోతుంది. బతుకు పండి, జీవిత నందనంలో పండు వెన్నెల ప్రసరిస్తుంది!

- ఉప్పు రాఘవేంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న