బుద్ధ పూర్ణిమ

అంతర్యామి

బుద్ధ పూర్ణిమ

దృశ్యం మనుషుల మనసులను వెంటాడుతుంది. దృశ్యంతోనే మనిషి బతుకుతాడు. దృశ్యాలు కోకొల్లలు. రెప్ప తెరిస్తే దృశ్యం. రెప్ప మూసేవరకు దృశ్యమే. దృశ్య అదృశ్యాల మధ్య జీవనం. నాలుగే నాలుగు దృశ్యాలు ఆయనలో విరక్తి పుట్టించి ఎన్నటికీ మరింకొక దృశ్యం చూడనివ్వకుండా చేశాయి. మహోన్నతమైన ధ్యానం లోతుల్లోకి తీసుకెళ్లి అనంత విశ్వక్షేత్ర మూలాల్లో విడిచి పెట్టాయి. అక్కడి నుంచే అష్టాంగయోగం అనే ఎనిమిది సాధనా సౌరభాలతో నిండిన కమలాన్ని విశ్వానికి బహుమతిగా తీసుకొచ్చాడు. బుద్ధుడిగా మారిన భగవానుడైన సిద్ధార్థుడు.
అతడు సామాన్యుడు కాడు. ఒక చక్రవర్తి కుమారుడు. భార్య ఉంది. బిడ్డ ఉన్నాడు. కుటుంబం ఉంది. పుట్టుకలో అతడి జాతకచక్ర గణన చేసి సన్యాసిగా మారుతాడని పండితులు చెబితే, విధిని ఎదిరించాలనుకున్నాడు తండ్రి శుద్ధోదనుడు. పుట్టుక, చావు, రోగం, వృద్ధాప్యం అనే మానవ జీవన అనివార్య దృశ్యాలకు దూరంగా ఉంచాలని, అంతఃపురంలోనే ఉంచి పెంచాడు. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు, ఓసారి గౌతముడు బయటకు వెళ్ళినప్పుడు అవి కంట పడనే పడ్డాయి. తీవ్రమైన మనోవ్యాకులతకు లోనయ్యాడు... అంతే! అతడి స్థితి మారిపోయింది. గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
రాజభవనం విడిచిపెట్టి, అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. దుఃఖ నివారణా మార్గం కనుగొన్నాడు. దివ్యమైన సాధనతోనే జ్ఞానోదయమైంది. కాలినడకన వేల మైళ్లు ప్రయాణం చేశాడు. ఆధ్యాత్మిక అన్వేషణతో సనాతన మార్గాల చిక్కుముడుల్లో ఇరుక్కున్న మానవుల జ్ఞానార్తిని తీర్చాడు. ధ్యానజ్యోతిని వెలిగించాడు. ‘అప్పోదీపోభవ’ అని చెప్పి, ‘నీ హృదయ జ్యోతిని నువ్వే వెలిగించుకో. నీకు నువ్వే గురువు. నీ జ్ఞానమే నీకు వెలుగు. నిరంతరం ధ్యానంలో మునిగి సత్యాన్ని పట్టుకో’ అని బోధించాడు.
బుద్ధుడి ముందు, బుద్ధుడి తరవాత హీనయాన, మహాయాన శాఖలుగా విడిపోయింది. అష్టాంగయోగానికి ప్రాధాన్యం ఇచ్చిన బుద్ధుడు వ్యక్తి పూజను వ్యతిరేకించాడు. నాలుగు దివ్య సత్యాలు ఆయన చెప్పాడు. దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖం అంతమయ్యే మార్గం, దుఃఖాంతం. ఇవే మానవ జీవనానికి ఎంతో ఉపయోగపడ్డాయి. బుద్ధుణ్ని అవతారమూర్తిగా నిలిపాయి.
ఒక ఊరిలో బుద్ధుడు తన బోధ మొదలుపెట్టబోతుంటే ఒక పద్నాలుగేళ్ల అమ్మాయి వచ్చింది. ‘నాకు, మీ గురించి నాలుగేళ్ల వయసులోనే తెలుసు. ఇంతకాలం మీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మీరు ఇక్కడికి వచ్చారు. నాకెంతో ఆనందంగా ఉంది. అయితే, పొలం వెళ్లి, మా నాన్నకు ఈ అన్నం మూట ఇచ్చి రావాలి. అంతవరకు మీరు ఉండగలరా?’ అని అడిగింది. ‘తప్పకుండా... ఇచ్చి రా. నీ కోసం చూస్తుంటాను’ అని చెప్పాడు బుద్ధుడు. ఆ అమ్మాయి తన తండ్రికి భోజనం ఇవ్వడానికి వెళ్ళింది. ఇదంతా గమనించిన బుద్ధుడి ముఖ్య శిష్యుడైన ఆనందుడు ఆశ్చర్యపోయాడు.
చాలా సేపయింది. ఆ అమ్మాయి రాలేదు. బుద్ధుడి కార్యక్రమం మొదలుకాలేదు. ఇక్కడ ఇంత మంది ఉండగా ఆ అమ్మాయి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ఆనందుడు అడిగాడు. నేను ఈ ఊళ్ళో బోధ చేస్తున్నది ఆ అమ్మాయి కోసమే. శిష్యుడు సిద్ధమైనప్పుడు గురువు వస్తాడు.
దాహమే నీటిని చూపిస్తుందని బుద్ధుడు చెప్పాడు.
వైశాఖ పూర్ణిమనాడు జన్మించిన సిద్ధార్థుడు, వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయంతో నిర్వాణం పొంది, ఎనభై సంవత్సరాలు జీవించి, అదే వైశాఖ పూర్ణిమ రోజున తన శరీరాన్ని పంచభూతాల్లో లీనం చేశాడు.

- ఆనందసాయి స్వామి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న