అనుభవ జ్ఞానం

అంతర్యామి

అనుభవ జ్ఞానం

నిషిది శతాయుష్షు అని వేదాలు చెబుతున్నాయి. సరైన నియమాలను పాటిస్తూ క్రమశిక్షణతో జీవితాన్ని గడిపితే ఎక్కువమంది నిండు నూరేళ్లు జీవించవచ్చు అంటూ ఆరోగ్య శాస్త్రం సైతం చెబుతోంది. మానవుడు తన జీవితకాలంలో సుఖదుఃఖాలకు సంబంధించిన అనుభవాలను ఎన్నో చవిచూస్తాడు.  పెద్దల నుంచి లభించే అనుభవసారాన్ని అందిపుచ్చుకోవడానికి యువకులు సిద్ధంగా ఉండాలి.
కొన్ని అనుభవ వాక్యాలు వింటూనే ఒంటపట్టించుకోవాలి. నమ్మకుండా పరిశీలనకు దిగితే గుణపాఠం తప్పదు. నిప్పు దహన స్వభావం దృష్ట్యా దాన్ని తాక వద్దు అని పెద్దలు చెబుతారు. స్వయంగా చూస్తేనే నమ్ముతాను అంటూ వాదిస్తే చేతులు కాలతాయి. అనుభవజ్ఞుల మాటలు ఆలకించడం అంటే వారు చెబుతున్న విషయ జ్ఞానం పొందడానికి వ్యయం చేసిన కాలాన్ని పొదుపు చేసుకుంటూనే ఆ జ్ఞానాన్ని మనం సముపార్జించడంగా భావించాలి.
అనుభవజ్ఞుల మాటలు అమృతోక్తులు. తమ జీవితానుభవాలను రంగరించి వారు మాట్లాడతారు. భాషాసంపదగా మనం చెప్పుకొనే సామెతలు, జాతీయాలు, సూక్తులు మొదలైనవన్నీ పెద్దల అనుభవ సారమే. అక్షరజ్ఞానం లేనివారు సైతం తమ అనుభవ పూర్వక జ్ఞానంతో అబ్బుర పరుస్తారు. పెద్దలు సూర్య చలనాన్ని అనుసరించి సమయాన్ని కచ్చితంగా తెలుసుకునేవారు. ఎంతో పరిశీలన ద్వారా అనుభవం వల్ల పొందిన జ్ఞానం అది. పూర్వం రైతులు శీతాకాలపు రాత్రివేళ కొంత దూదిని నాగలి అంచుకు కట్టి ఉంచేవారు.  వేకువజామున దాన్ని పిండి స్రవించే నీటిధార పరిమాణాన్ని బట్టి మున్ముందు వర్షాలెలా కురుస్తాయో అంచనా వేసేవారు. ఈ సంగతి సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం దోనయా మాత్యుడు అనే కవి సస్యానందం అన్న గ్రంథంలో తెలియజేశాడు. ఇలాంటి గొప్ప విశేషాలన్నీ పెద్దలు మనకందించే అనుభవాల నిధులే.
పెద్దల నుంచి పొందే అనుభవసారంతో పాటు మానవుడు స్వయంగా అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. వైద్యుడిని సాక్షాత్తు నారాయణుడి అంశగా చెబుతారు. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక వ్యాధులకు ఔషధాలను కనిపెట్టడంలో వైద్య పరిశోధకులు తలమునకలై ఉంటారు. జంతువుల మీద మనుషుల మీద వారు చేసే పరిశోధనలు ఒక పట్టాన ఫలితాలనివ్వవు. ఆరోగ్యంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పరిశోధన చేసుకుంటూ వెళతారు. ప్రయత్నపూర్వకంగా వారు పదేపదే చేసే ప్రక్రియ వారికి అనుభవాన్ని ఇస్తుంది. ఆ కృషి ఫలితంగా వైద్య పరిశోధకులు వ్యాధులకు ఔషధాలను తయారు చేయగలుగుతారు. శస్త్రచికిత్స వైద్య వృత్తిలో అంతర్భాగం. వైద్య విద్యాభ్యాసం చేస్తున్న సున్నిత హృదయుడైన వైద్య విద్యార్థి రక్తం చూసి గగుర్పాటుకు లోనుకావచ్చు. విగతజీవి రూపంలో తన ఎదురుగా పడి ఉన్న వ్యక్తి కారణంగా భయం కలగవచ్చు. ప్రారంభదశలో అవన్నీ సాధారణ విషయాలు. అనుభవం ఆ విద్యార్ధిని రాటుతేలుస్తుంది. జీవికి జనన మరణాలు సహజమన్న జ్ఞానాన్ని అందజేస్తుంది. ఆ జ్ఞాన ఫలితంగా భవిష్యత్‌ కాలంలో ఆ విద్యార్థి తన వృత్తికే తలమానికంగా నిలుస్తాడు.
అపజయానికి భయపడి కార్యనిర్వహణకు దూరంగా ఉంటే, ఎటువంటి అనుభవ జ్ఞానం దక్కదు. నడక నేర్చుకొనే సమయంలో పిల్లలు ఎన్నోసార్లు కింద పడుతుంటారు. పైకి లేస్తుంటారు. కొన్నాళ్ల తరవాత వారే పరుగులు తీస్తారు... జీవితమైనా అంతే. అనుభవ సారాన్ని ఆసరాగా చేసుకుని కొత్త అడుగులు వేయాల్సిందే.

- జి.రామచంద్రరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న