ప్రతి దశా కీలకమే

అంతర్యామి

ప్రతి దశా కీలకమే

మానవ జీవితం దైవం ఇచ్చిన వరం. సృష్టిలోని అనేక కోట్ల జీవరాసులకు లేని ఎన్నో ప్రత్యేకతలు, లక్షణాలు మనిషికి ఉండటమే అందుకు కారణం. అలాంటి మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి దశ, ఘట్టం కీలకమైనవే. వాటిని మానవుడు ధర్మబద్ధంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనేవి మానవ జీవితంలో వివిధ దశలు. వివేకవంతులు ప్రతి దశలోని సంఘటనలను తగిన విధంగా మలచుకుని, ధర్మబద్ధంగా గడుపుతూ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు.      
తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ద్వారా ఎన్నో నేర్చుకున్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడిగా ఈ భూమి మీదకు వచ్చాడు. భక్తికి మించిన మార్గం మరొకటి లేదని చాటాడు, నిరూపించాడు.    
అవతార పురుషుడైన రాముడు బాల్యంలో చందమామ కోసం ఏడవడం, దాన్ని అద్దంలో చూసి మురిసిపోవడం, అలాగే కృష్ణయ్య గోపాలకుల మధ్య గడిపిన బాల్యం, చేసిన అల్లరిచేష్టలు... మన పిల్లలకు మురిపెంగా చెప్పుకొంటాం. అలాంటి తిరిగిరాని బంగారు బాల్యాన్ని తల్లిదండ్రుల ఆలంబనతో వారి సంరక్షణలో ఆనందంగా గడపాలి.
కౌమారం జీవితంలో కీలకమైంది. గురువుల పర్యవేక్షణతో విద్యలను కష్టపడి ఇష్టంతో నేర్చుకోవాలి. ఆ దశలో నేర్చుకున్న విషయాలు, గడిపిన తీరు బట్టే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కౌమారంలో దుర్యోధనుడికి భీముడిపై కలిగిన అసూయతో విష ప్రయోగం చేసి అతణ్ని హతమార్చాలని చేసిన ప్రయత్నమే కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది. అర్జునుడికి విద్యపై ఉన్న శ్రద్ధ, గురువులపై ఉన్న భక్తి- కురుక్షేత్రంలో అజేయుడిగా నిలబెట్టాయి.  
యౌవనంలో తగిన భాగస్వామిని ఎంచుకుని సంసార జీవనాన్ని గడుపుతూ, ప్రకృతి ఆనందించే విధంగా సత్సంతానాన్ని ప్రపంచానికి అందించాలి.  తన కుటుంబం గురించి మాత్రమే కాకుండా సమాజం, తోటివారు, ప్రకృతి లాంటి అనేక విషయాలకు మేలు, సేవ చేసే అవకాశం ఉన్నది గృహస్థాశ్రమం ఒక్కటే. అందుకే ఆ దశను మోక్షమార్గానికి పునాదిగా మలచుకోవాలి.    
ఆనందమయంగా జీవించే ప్రతి క్షణం కీలకమే. గడచిన క్షణం తిరిగి రాదు. రావాలని కోరుకోకూడదు కూడా. అలా తిరిగి వేస్తే అనర్థాలే తప్ప ప్రయోజనం ఉండదు.
ఏ వయసులో ఎలా ఉండాలో రఘువంశం కావ్యంలో మహాకవి కాళిదాసు ఇలా చెప్పాడు. ‘బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకుని, యౌవనంలో విషయాసక్తి కలిగి ఆనందమయమైన జీవితాన్ని గడిపి, వృద్ధాప్యంలో ముని ప్రవృత్తితో ఆశ్రమవాసం చేసి, యోగమార్గంలో తనువును విడిచి పెట్టేవారు’ అని రఘువంశ రాజుల లక్షణాలను గురించి చెప్పాడు. అలా చెప్పడంలో ఆంతర్యం ప్రతి మనిషీ తన జీవితాన్ని అలా గడిపితేనే మానవజన్మ సార్థకమవుతుందని.  
ఎవరైనా జారిపోయిన జీవితం తిరిగి రావాలని కోరుకోకూడదు. దాని బదులు జీవితంలోని ప్రతి దశను ఆస్వాదిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే జీవితం ఆనందమయం అవుతుంది. అలాంటివారి యోగక్షేమాలు ఆ భగవంతుడే పర్యవేక్షిస్తాడు.
జరామరణాలు జీవితంతో పెనవేసుకున్న బంధనాలు. వీటిని ఎవరూ తప్పించుకోలేరు. ఎంత నిబద్ధతతో జీవితాన్ని గడిపితే, భక్తితో భగవంతుణ్ని ఆరాధిస్తే అంతకు రెట్టింపు ప్రేమతో భగవంతుడు భక్తుణ్ని అక్కున చేర్చుకుంటాడంటారు పెద్దలు. ఇది మానవుడు గడిపే ప్రతి దశలోనూ గుర్తుంచుకోవలసిన సత్యం.

                    - గంటి ఉషాబాల


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న