సత్యం... శివం... సుందరం

అంతర్యామి

సత్యం... శివం... సుందరం

త్యమేవ జయతే- సత్యమే జయిస్తుంది అనే ఉపనిషద్వాక్యానికి సాకార రూపంగా, సత్య స్వరూపుడిగా శ్రీమన్నారాయణుడు దశావతారాలకు అతీతంగా, అద్వితీయంగా కొలువైన క్షేత్రం- అన్నవరం. వ్రతాధిష్ఠాన దైవంగా, తెలుగువారి ఆరాధ్యవేలుపుగా సత్యదేవుడు అలరారుతున్నాడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకోన్ముఖంగా ఒకే సన్నిధిలో వర్ధిల్లుతున్న అరుదైన సన్నిధి- అన్నవరం!
స్కాంద పురాణంలో అన్నవరక్షేత్ర వైభవం, సత్యనారాయణుడి లీలా ప్రాభవం సవివరంగా ఉన్నాయి. దుర్వాస మహాముని శాపానికి గురైన ఓ విప్రుడు, పంపాతీరాన రత్నగిరి రూపాన్ని ధరించాడంటారు. నారద మహర్షి భూలోకాన అనేక ప్రదేశాల్ని సందర్శిస్తూ, పంపాతీరానికి చేరుకున్నాడు. గిరి శీర్ష భాగం నుంచి అష్టాక్షరీ మహామంత్రం నారదుడికి వినిపించింది. విప్రశాప వృత్తాంతాన్ని తెలుసుకున్న నారదుడు, ఆ రత్నగిరిపైనే మహానారాయణ మంత్రాన్ని ఉపాసన చేశాడు. తన తపోశక్తిని ఆ గిరి అంతర్భాగంలో నిక్షిప్తం చేసి, కలియుగాన సత్య ధర్మానికి సంకేతంగా శ్రీమన్నారాయణుడు సత్యనారాయణుడిగా ఈ గిరిపై స్వయం వ్యక్తమవుతాడని పేర్కొన్నాడు. శ్రీఖర నామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియ అంటే 1891 సంవత్సరం ఆగస్టు ఆరో తేదీన అంకుడు చెట్ల మధ్య తులసీ వనంలో హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక రూపంలో సత్యదేవుడు సాకారమయ్యాడు. అనుగ్రహించిన అన్ని వరాల్ని నెరవేర్చే అన్నవరంగా, ఆపన్నుల పాలిట దివ్యధామంగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. 1893వ సంవత్సరంలో బదరీక్షేత్రం నుంచి శిలాశోభితమైన మహావిరాట్‌ నారాయణ యంత్రాన్ని ఆలయం దిగువన ప్రతిష్ఠించారు. ఇరవై నాలుగు వృత్తాల సమన్వితంగా నవవిధ గాయత్రీ మంత్ర బీజాక్షరాల పరివేష్ఠితంగా ఈ మహిమాన్విత యంత్రం రూపుదాల్చిందంటారు. గర్భాలయంలో అనంతలక్ష్మీ సమేత సత్యమూర్తి, మహేశ్వరుడు, యంత్రరూప బ్రహ్మ నెలకొని ఉంటారు. అందుకే ఇది సత్యశివసుందర ధామంగా విఖ్యాతి గాంచింది.
సత్వర ఫలసిద్ధికి సత్యనారాయణ స్వామి వ్రతాచరణ సర్వశ్రేష్ఠమని బ్రహ్మ, నారదుడికి వివరించాడంటారు. సత్యదేవ వ్రతం- సకల దేవతారాధన సమ్మేళనం. పంచలోక పాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకుల ఆరాధన ఈ వ్రత సంవిధానంలో ముఖ్య భాగం. సత్యనారాయణ వ్రతంలో అతి ముఖ్యమైన అంశం- అయిదు అధ్యాయాల కథాసమాహారం. సత్వగుణ శోభితంగా, సత్యం, ధర్మం, శాంతి, దయ వంటి ఉత్తమ గుణాల ఆలంబనగా జీవన పథాన ఏ విధంగా పురోగమించాలో ఈ కథలు తెలియజేస్తాయి.  
గోధుమనూక, ఆవునెయ్యి, బెల్లం, సుగంధ ద్రవ్యాలతో కలిపి తయారుచేసే ‘సుపాద’ అనే అన్నవర సత్యనారాయణస్వామివారి ప్రసాదం మహిమోపేతమైనదని భక్తుల నమ్మకం. ఏకాదశి నాడు స్వామివారి కల్యాణ క్రతువుకు ముఖ్య భూమిక ఉంటుంది. గరుడ వాహనసేవ, ద్వాదశి హోమం, రావణ వాహన సేవల్ని ద్వాదశినాడు నిర్వహిస్తారు. త్రయోదశినాడు కల్యాణ సదస్యం, చతుర్దశినాడు స్వామివారి వన విహారయాత్ర, పూర్ణిమ నాడు చక్రతీర్థం, నాకబలి, బహుళ పాడ్యమినాడు పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలలో జరిగే శ్రీరామసభ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీరాముడే సభాపతిగా పండిత సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న ఆనవాయితీ! కరోనా నేపథ్యంలో ఈ ఉత్సవాల నిర్వహణలో ఈ ఏడాది కొన్ని పరిమితుల్ని విధించారు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న