హితోపదేశకుడు అన్నమయ్య

అంతర్యామి

హితోపదేశకుడు అన్నమయ్య

లుకులు తేనియలై, భావాలు అమృతమయమై భక్తి, సంగీత, సాహిత్య మిళితమైన సంకీర్తనలు వెలయించిన వాగ్గేయ శిరోమణి అన్నమయ్య.
పల్లవి, చరణాలతో కూడిన తెలుగుపాటకు తన భాషాపటిమతో ప్రాణప్రతిష్ఠ చేసిన పదకవితా పితామహుడు అన్నమయ్య తెలుగుజాతి మొత్తం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన స్తవనీయుడు!
దేహాత్మేశ విచారాదులను ప్రకటించే ఆధ్యాత్మ సంకీర్తనలను,  జీవాత్మ, పరమాత్మల అమలిన ఐక్యాన్ని చాటే శృంగార సంకీర్తనలను, దేహి నిత్యుడని, దేహం అనిత్యమని చాటే వైరాగ్య సంకీర్తనలను రసబంధురంగా లిఖించిన ఘనుడు అన్నమయ్య. ఆయన శృంగార సంకీర్తనల్లో శ్రీమద్భాగవతంలో వర్ణితమైన గోపికల మధురభక్తి నిండి ఉందని సంకీర్తనల భాషను, భావాన్ని పరికిస్తే మనకు అవగతమవుతుంది. భక్తజయదేవుడి ప్రభావమూ అన్నమయ్య సంకీర్తనలపై మనోహరంగా ప్రసరించిందని శృంగార సంకీర్తనల్లోని రమణీయమైన భావసంచయం మనకు విశదం చేస్తుంది.
సకల దేవతాస్వరూపాల్లో శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళరూపాన్నే తిలకించిన అన్నమయ్య తన సంకీర్తనలను ‘వేంకట పదముద్ర’తో లిఖించడం గమనార్హం. ‘సారసనేత్రుపై సంకీర్తనములు సరసత్వమున తాళ సముఖముల్‌ గాగ పరమ తంత్రములు ముప్పది రెండువేలు’ అన్న తాళ్లపాక చినతిరుమలాచార్యుల పదాలద్వారా అన్నమయ్య ముప్ఫై రెండువేల సంకీర్తనలు లిఖించినట్లుగా మనకు తెలుస్తోంది. అన్నమయ్య సుప్రసిద్ధ నారసింహ క్షేత్రమైన అహోబలంలో వేదాంతవిద్యను అభ్యసించాడు. నృసింహ మంత్రంలోని 32 బీజాక్షరాలకు సంకేతంగానే అన్నమయ్య 32000 సంకీర్తనలు లిఖించినట్లు భావించాలి. ప్రజలభాషకు సాహిత్యగౌరవం కలిగించిన తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య. జానపదులకు అన్నమయ్య ప్రాణప్రదుడు. జానపదుల జీవభాషను తన సంకీర్తనలకు ప్రాణశ్వాసగా నిలిపిన సాహితీమూర్తి అన్నమయ్య. పల్లెపట్టుల్లో, తమ శ్రమను మరచిపోవడానికి అక్కడి జనులు పాడుకునే గేయఫణితులను తన జానపద సంకీర్తనలకు ఆలంబనగా చేసుకున్నాడు అన్నమయ్య. ఉల్లాసంగా సాగిపోయే కోలాటం పాటలు, గొబ్బిళ్ల పాటలు, ఉట్లపాటలు అన్నమయ్య సంకీర్తనల్లో మంజులంగా రాగ రంజితమయ్యాయి. జానపదులు పాడుకొనే జాజర గీతాలకు అన్నమయ్య ఎంతో ప్రాశస్త్యం కలిగించాడు. జాజర పాటలను వేడుకకు, సందడికి పర్యాయపదంగా మార్చిన ఘనత అన్నమయ్యదే.
జీవి అల్పత్వాన్ని ఎన్నో తత్వసంకీర్తనల్లో పటుత్వంగా ప్రకటించిన అన్నమయ్య ‘అయ్యో... నేనేగా అన్నిటికంటే తీలు... గయ్యాళినై వ్రిధా గర్వింతు గాని’ అంటూ, ‘పురుషోత్తముడ వీవు... పురుషాధముడ నేను’ అంటూ నైచ్యానుసంధాన ప్రక్రియలో ఎన్నో సంకీర్తనలు రాసి దుర్లభమైన పరాన్ని చేరాలంటే పరమ పురుషుడికి శరణాగతిని సమర్పించవలసిన విధాన్ని తేటతెల్లం చేశాడు.
అన్నమయ్యలో చెప్పుకోవలసిన మరో ప్రత్యేకమైన అంశం సంఘ సంస్కరణాభిలాష. ‘కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై’ అంటూ మానవులకుండే దురాశను నిందిస్తూనే, ‘ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పనియట్టి చదువేలా’ అంటూ పరోపకారమనే సుగుణాన్ని కలిగి ఉండమని బోధించాడు.తన సంకీర్తనల్లో లోకనీతిని, మానవ జీవన రీతిని సైతం వర్ణించి మహితమైన హితోపదేశం చేశాడు అన్నమయ్య.
వైశాఖమాసం విశాఖ నక్షత్రంనాడు తాళ్లపాక అన్నమయ్య జన్మించాడు. అన్నమయ్య జన్మదినం తెలుగుజాతికి పర్వదినం.

- వెంకట్‌ గరికపాటి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న