నృసింహ జయంతి

అంతర్యామి

నృసింహ జయంతి

శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారం నరసింహావతారం. స్వామి అవతరించిన వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహజయంతి జరుపుకొంటారు.
వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదుల శాప ఫలితంగా హిరణ్యాక్ష, హిరణ్య కశిపులుగా జన్మిస్తారు. వరాహావతారంలో శ్రీహరి హిరణ్యాక్షుణ్ని వధించడంతో, హిరణ్య కశిపుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. నర-మృగాల వల్ల కానీ, రేబవళ్లలో కాని, ప్రాణి-ప్రాణహీనుల వల్ల కానీ తనకు మరణం సంభవించకుండేలా వరం కోరుకున్నాడు. బ్రహ్మ వరమిచ్చి అంతర్థానమయ్యాడు.
హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా, దేవేంద్రుడు హిరణ్య కశిపుడి భార్య గర్భవతి అయిన లీలావతిని అపహరించి తీసుకెడుతూంటే, నారద మహర్షి అడ్డుకుని, లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆమె గర్భస్థ శిశువుకు విష్ణుభక్తి బోధించాడు.
హిరణ్య కశిపుడు వరం పొంది తిరిగి వస్తూ, తన భార్యను రక్షించినందుకు నారద మహర్షికి కృతజ్ఞత తెలిపి, ఇంటికి తీసుకెళ్లాడు. పుట్టిన పుత్రుడికి ‘ప్రహ్లాదుడు’ అని నామకరణం చేశాడు. కొన్నేళ్ల తరవాత ప్రహ్లాదుణ్ని విద్యాధ్యయనం కోసం గురువులు చండామార్కుల వద్ద చేర్చాడు. వరబల గర్వంతో ప్రజలను, మునులను, దేవతలను హింసించసాగాడు. క్రమేపీ అతడిలో విష్ణుద్వేషం పెరగడం మొదలైంది.
ప్రహ్లాదుడు నిరంతరం హరినామ స్మరణం చేస్తూ, గొప్ప విష్ణుభక్తు డయ్యాడు. తండ్రి పిలిపించి, నేర్చు కున్నది చెప్పమన్నప్పుడు చదువులలో మర్మమెల్ల నేర్చానని, అదే హరినామ స్మరణ అనీ బోధించాడు. సత్సంగ మహిమ వల్ల దైత్యుల హృదయాలలో శ్రీహరి సర్వదా కొలువై ఉంటాడని ఎంతో వినమ్రంగా వివరించాడు. కొడుకు మాటలకు కుపితుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని చిత్రహింసలకు గురిచేస్తాడు. ఎన్ని శిక్షలు విధించినా, అవేవీ ప్రహ్లాదుణ్ని ప్రభావితం చేయలేదు. ‘హరి ఇందుగలడందు లేడను సందేహంబు వలదు’ అన్న పుత్రుణ్ని ‘ఈ స్తంభంలో చూపించు నీ దేవుణ్ని’ అంటూ ఓ స్తంభాన్ని గదతో మోదాడు. అంతే! స్తంభం నుంచి దిక్కులు దద్దరిల్లే భయానక శబ్దం వెలువడింది. స్తంభం నిలువునా చీలి, అందులోంచి మహావిష్ణువు మహోగ్ర రూపంలో నారసింహుడిగా ఆవిర్భవించాడు. హిరణ్య కశిపుణ్ని తన తొడల మీద పడుకోబెట్టి, ఉదరాన్ని చీల్చి, రక్త నాళాలను తెంచి, పేగులు బయటకు లాగి సంహరించాడు. ఉగ్రరూపుడైన స్వామిని ప్రహ్లాదుడు స్తుతించి, శాంతింపజేశాడు.
నారమంటే ప్రాణి, సింహమంటే ఈశ్వరుడని అర్థం. జీవుడు ఈశ్వరుడిలో ఐక్యం పొందడమే ఈ అవతార రహస్యం. స్తంభం మనో నిశ్చలతకు ప్రతీక. ప్రాణాయామం ద్వారా ఈ స్థితిని సాధించవచ్చని రమణ మహర్షి ప్రవచించారు (నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః). నామ స్మరణే ధన్యోపాయమని ప్రహ్లాదుడి హరినామ సంకీర్తన కలియుగ మానవాళికి సంకేతమిస్తోంది. శత్రు జయానికి ఈ రోజున స్వామి వ్రతం చేయడం ప్రశస్తమైందని, ఆరోగ్య సిద్ధి చేకూరుతుందని వివిధ పురాణాలు పేర్కొంటున్నాయి.
అంతర్వేది, అహోబిలం, మంగళగిరి, సింహాచలం, యాదాద్రి, స్తంభాద్రి (ఖమ్మం), ధర్మపురి, కదిరి, ఆగిరిపల్లి, మణుగూరు మొదలైన ప్రసిద్ధ నృసింహ క్షేత్రాలు సందర్శించదగినవి.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న