బల నిరూపణ

అంతర్యామి

బల నిరూపణ

క్కోసారి తనకన్నా అల్పుడి ముందు మహావీరుడు తన బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. దాన్ని విజ్ఞులు చిన్నతనంగా భావించరు. దీనికి  రాముడే గొప్ప ఉదాహరణ.
పంపాసరోవర తీరంలో సంచరిస్తున్న రామ, లక్ష్మణుల్ని సుగ్రీవుడు  రుష్యమూక పర్వతం మీంచి చూశాడు. వాలి పంపిన గూఢచారులుగా  భావించి భయపడ్డాడు. అప్పుడు బుద్ధిశాలి హనుమ చొరవ తీసుకున్నాడు. మారువేషంలో రామ, లక్ష్మణుల్ని  సమీపించి, చక్కటి మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆ సోదరుల్ని భుజాన మోసుకుని సుగ్రీవుడి వద్దకు తీసుకు వెళ్ళాడు. వానర రాజు సుగ్రీవుడు,  వనవాసి రాముడు కష్ట సుఖాలు కలబోసుకున్నారు. స్నేహ హస్తాలు కలిపారు. పరస్పరం సాయం చేసుకోవాలని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు. తొలివిడతగా రాముడు ముందుకు వచ్చాడు. ‘కిష్కింధ సింహాసనంపై నిన్ను కూర్చోబెడతాను’  అంటూ సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు.
అయినా చిన్న అనుమానం సుగ్రీవుణ్ని వేధించసాగింది. రాముడి గొప్పదనం గురించి వినికిడే తప్ప, తాను నేరుగా చూసింది లేదు. కాని, వాలి విషయంలో అలాకాదు. తోడబుట్టిన వాడితో తొడకొడితే ఏమవుతుందో సుగ్రీవుడికి బాగా తెలుసు. అందుకే కాస్త  సందేహిస్తూ- ‘రామభద్రా! మా అన్నగారి బల సంపన్నత గురించి తెలిసినంతగా నీ సామర్థ్యం గురించి నాకు తెలియదు. నిన్ను  పరీక్షించాలని కాదుగానీ’ అంటూ నసిగాడు సుగ్రీవుడు. రామచంద్రుడికి అర్థమయింది. ఎదురుగా దున్నపోతు ఆకారంలో పర్వతమంత ఎత్తున ఓ కళేబరం! అది దుందుభి అనే మహా రాక్షసుడిది. ఆ మహాకాయుడు వాలి చేతిలో మరణించాడు.  అతడి కళేబరాన్ని రాముడు తన కాలి బొటన వేలితో అవలీలగా ఎత్తి, పది యోజనాల దూరంలో పడేలా విసిరేశాడు. అయినా సుగ్రీవుడిలో అనుమానం పూర్తిగా తొలగిపోలేదు.
‘రామా! ఇప్పుడు నువ్వు  విసిరేసింది రక్తమాంసాలు లేని కళేబరాన్ని కదా? నీ శక్తిని అంచనా వేయడానికి ఇది సరిపోదేమో! ఎదురుగా చూడు... ఏడు సాలవృక్షాలున్నాయి. మా అన్నయ్య వాలి ఒక చెట్టును పట్టుకుని గట్టిగా ఊపితే, దాని ఆకులన్నీ జలజలా రాలిపోయేవి. నువ్వు కనీసం ఒక్క వృక్షాన్ని ఛేదించు. నీ శక్తి, సామర్థ్యాల పట్ల నాలో  నమ్మకాన్ని కలిగించు’ అన్నాడు. అదే వేరెవరైనా అయితే సుగ్రీవుడి అనుమానాన్ని  అవమానంగా భావించేవారేమో? ఆయన రాముడు... మర్యాదా పురుషోత్తముడు. గురిచూసి బాణం విడిచాడు. ఒకటి కాదు, రెండు కాదు- మొత్తం ఏడు సాల వృక్షాలూ ఫెళ ఫెళా నేల కూలాయి. సుగ్రీవుడు శ్రీరామచంద్రుడి పాదాల మీద తల ఉంచాడు. వాలితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు.
సుగ్రీవుడి విషయంలో రాముడి బలనిరూపణ ఉదంతం నుంచి మనిషి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడో ఒకప్పుడు  ఎదురవుతాయి. అత్యంత ప్రతిభావంతుడైన వ్యక్తి తన కన్నా ఎన్నో రెట్లు తక్కువ అర్హతలు కలిగిన వ్యక్తి ముందు అవసరార్థమో, సందర్భానుసారమో తన తాహతు గురించి విడమరచి చెప్పాల్సి వస్తుంది. ఓ అడుగు ముందుకేసి, తన సామర్థ్యాన్ని  చేతల్లో  చూపించడం తప్పనిసరి అవుతుంది. అప్పుడు- ‘ఓ అల్పుడి ముందు నన్ను నేను నిరూపించుకోవాలా?’ అన్న అహానికి లోనుకాకూడదు. లాగి బిగించిన తీగె కొనగోట మీటగానే శ్రుతి పక్వంగా శబ్దించినంత ఒద్దికగా తన బలాన్ని నిరూపించాలి. చాతుర్యాన్ని ప్రదర్శించాలి. బంగారానికి తావి అబ్బడం అంటే ఇదే!

- ఓలేటి శ్రీనివాసభాను


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న