చిరునవ్వు వెల ఎంత?

అంతర్యామి

చిరునవ్వు వెల ఎంత?

నంద స్వరూపుడైన ఈశ్వరుడు తన చిద్విలాసానికి మరో స్వరూపంగా ఈ సృష్టిలో నవ్వగలిగే ఒకే ఒక ప్రాణిని సృష్టించాడు. సర్వచరాచర ప్రపంచంలోనూ నవ్వగలిగే జీవి ఒక్క మానవుడే. ‘నవ్వవు జంతువుల్‌ నరుడు నవ్వును నవ్వులు చిత్తవృత్తికిన్‌ దివ్వెలు...’ అంటూ జాషువా కవి పువ్వుల్లా ప్రేమరసాన్ని వెదజల్లేవే విశుద్ధమైన నవ్వులని, నవ్వు దుఃఖాన్ని హరిస్తుందని, వ్యాధులకు అది మహదౌషధమని పేర్కొన్నాడు. నవ్వు శారీరక ప్రక్రియ, మనిషి సహజ ప్రవృత్తుల్లో ఒకటి. మన మనసులోని ఆనందానికి బాహ్య చిహ్నం. నవ్వుతూ ఉన్న ముఖ ముద్ర ప్రసన్నమైన చిత్తానికి ప్రతీక. గణపతిని ‘ప్రసన్నవదనం’ అంటూ స్తుతిస్తాం.
కడుపునిండా పాలు తాగిన పసిపాప నవ్వుతుంది. క్రమంగా శారీరక పుష్టితో పాటు మానసిక తుష్టి కలిగి నవ్వడం అలవాటుగా మారి నరనరాల్లో జీర్ణించి, సంస్కార ప్రాయంగా మనిషి ప్రవర్తనలో భాగమవుతుంది. నవ్వు మన మనసును ఉల్లాసంగా ఉంచడమే గాక బరువును, ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసారా హాయిగా నవ్వడం అవసరం. నవ్వు మానవ సంఘాన్ని, జాతిని, వ్యక్తిని కూడా సుఖంగా నడిపించే సాధనమని విజ్ఞులు గుర్తించారు. మన పొరపాటు దిద్దుకోవడానికి, దుఃఖాన్ని విస్మరించడానికి, మన చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని సృష్టించుకోవడానికి- నవ్వును మించిన సాధనం లేదు.
అన్ని రకాల నవ్వులూ ఉత్తమమైనవి కావు. ఆలంకారికులు ఆరువిధాలైన నవ్వుల్ని పేర్కొన్నారు. 1.స్మితం, 2.హసితం, 3.విహసితం, 4.ఉపహసితం, 5.అపహసితం, 6.అతిహసితం. వీటిలో మొదటిదైన స్మితం చిరునవ్వు. కొద్దిగా చెక్కిళ్లు వికసింపజేసే హాసభంగిమ. దరహాసమనీ వ్యవహరిస్తాం. మల్లె పువ్వులా వదనంపై విరిసేది చిరునవ్వు. ‘దరహాస చంద్రికలు’ అంటూ చిరునవ్వును వెన్నెలగా వర్ణిస్తారు కవులు. చిరునవ్వు ప్రేమకు స్నేహానికి తొలిరూపం. రామాయణం అయోధ్య కాండలో శ్రీరాముణ్ని ‘స్మితపూర్వభాషి’ అని అభివర్ణించాడు వాల్మీకి. ఎదురైనవారిని చిరునవ్వుతో పలకరిస్తూ తానే ముందుగా మాట్లాడే వాడని అర్థం.
గౌతమబుద్ధుడు కరుణాళువు. ధర్మ ప్రచారంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. శత్రుత్వం పూనినవారిని చిరునవ్వుతో జయించాడు. అంగుళీమాలుడనే క్రూరుణ్ని సైతం మందస్మితంతో కూడిన మధుర భాషణంతో మార్చివేశాడు. తన బోధనల్ని తప్పుబడుతూ దుష్ప్రచారం సాగించిన వారికి చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. ప్రేమ, కరుణ నిండిన హృదయానికి పెదవులపై విరిసిన చిరునవ్వే ప్రతిబింబం. గోపాలకృష్ణుడు ‘నవ్వు రాజిల్లెడు మోమువాడు‘ అంటాడు పోతన.
అప్రియ వచనమైనా చిరునవ్వుతో చెప్పాలి. ఎదుటివారి దోషాల్ని వెల్లడించినప్పుడు ముఖం ప్రసన్నంగా ఉంటే వారు నొచ్చుకోకుండా ఆ మాటలు అర్థం చేసుకుంటారు. ముఖంలో చిరాకు, కోపం ఉంటే పదిమందిలో మనిషికి గౌరవం  ఉండదు. చిరునవ్వుతో మాట్లాడేవారికి జనాకర్షణ ఎక్కువ. సభల్లో ప్రసంగించేవారికి చిరునవ్వే అలంకారం. ఇంటికి వచ్చిన అతిథులకు చిరునవ్వుతో స్వాగతం పలకాలి. దానధర్మాలు చేసేటప్పుడు ముఖంపై చిరునవ్వుండాలి. ఎవరైనా వారి కష్టం చెప్పుకొన్నప్పుడు సహాయం చేయలేక పోయినా నవ్వు ముఖంతో వారి మాటలు వినాలి. సహనానికి నవ్వు గుర్తు. విమర్శలు చేసేవారికి, నిష్కారణంగా ముఖంమీదే నిందించేవారికి మర్యాదపూర్వకమైన చిరునవ్వే తిరస్కారం. మహాత్మాగాంధీ ప్రత్యర్థుల్ని చిరునవ్వుతోనే ఎదుర్కొనేవారు. ‘నువ్వు నవ్వితే లోకం నీతో పాటు నవ్వుతుంది. నువ్వేడుస్తుంటే మాత్రం నువ్వొక్కడివే ఏడుస్తావు’ అంటాడు బీర్బల్‌. అందుకే ముఖంపై చిరునవ్వును వెలిగిద్దాం. మనచుట్టూ ఉన్న వాతావరణాన్ని వీలైనంతవరకు ఆహ్లాదమయం చేద్దాం.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న