హనుమంతుడి మాటలు

అంతర్యామి

హనుమంతుడి మాటలు

దికావ్యం వాల్మీకి రామాయణం సమస్త ప్రపంచ మానవాళికీ ఆదర్శపాత్రం. ఆరు కాండలతో విరాజిల్లే ఈ మహాకావ్యంలోని అయిదో భాగం సుందరకాండ. ఈ కాండలో మనసులను రంజింపజేసే గుణసుందరుడు హనుమంతుడని, అసలు ఈ కాండ మొత్తం సుందర మయమనీ పెద్దల మాట. ఈ భాగంలో కనిపించే రాముడు సుందరుడు. సీత సుందరి. కథ సుందరం. పాత్రలన్నీ సుందరాలే.
హనుమంతుడు సీతాదేవి జాడను కనుగొనడానికై సముద్రాన్ని దాటడం మొదలుకొని, లంకానగరంలోని అశోకవనంలో సీతాదేవిని కనుగొనడం, దుష్టరావణపాలితమైన లంకలో చిచ్చు పెట్టడం, వనాలను ధ్వంసం చేయడం, రాక్షసులను ముప్పుతిప్పలు పెట్టడం వంటి ధార్మికావేశ కృత్యాలతో సుందరకాండ అంతా హనుమంతుడి వీరవిహారానికి నెలవుగా కనబడుతుంది. ధర్మంపట్ల హనుమంతుడి నిబద్ధత తేటతెల్లమవుతుంది.
సముద్రంపై ఎగురుతూ ప్రయాణిస్తుండగా సురస అనే రాక్షసి అడ్డుకొన్నప్పుడు హనుమంతుడు ‘నేను రామకార్యార్థినై లంకకు వెళ్తున్నాను. నన్ను ఇప్పుడు నీవు అడ్డుకోకు. తిరిగి వచ్చే సమయంలో నేను నీకు ఆహారం అవుతాను’ అని ధైర్యంగా పలుకుతాడు.
లంకానగరంలోకి ప్రవేశించిన తరవాత రాణుల అంతఃపురాలను దర్శించిన సందర్భంలో, అక్కడ అతిలోక సౌందర్యవతులైన రాక్షస స్త్రీలను చూసి, ఏ మాత్రం చలించకుండా వారిని పూజ్య భావంతో సంబోధించడం హనుమంతుడి ఉత్తమ గుణానికి నిదర్శనం.
లంకలో ఎంత వెదకినా సీతాదేవి కనిపించక ‘రాముడి మాటను నిలపని నేను బతికి ఉండటం ఎందుకు?’ అని మనసులో అనుకొని, వెంటనే- ‘నేను మరణిం చడం వల్ల అన్నీ అనర్థాలే కలుగుతాయి. అందరూ నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేసినవాణ్ని అవుతాను. మరణం అనేక దోషాలకు నెలవు. జీవించి ఉండటమే అన్ని శుభాలకూ కారణం’ అని పలికిన మాటలు బలహీన మనస్కులైన నేటి యువతరానికి గుణపాఠాలు!
సీతాదేవిని దర్శించి, నమస్కరించి, రాముడు పడుతున్న వేదనను వివరించి, ‘త్వరలోనే రాముడు వస్తాడని, రావణుని వధించి, నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్తా’డని ధైర్యం చెబుతాడు మారుతి. సీతాదేవి ఎంతో సంతోషించి, హనుమంతుణ్ని ఆశీర్వదిస్తుంది.
లంకనుంచి నిష్క్రమించే ముందు రాముడి ప్రతాపానికి ప్రతీకగా హనుమంతుడు చేసిన విధ్వంసం- అధర్మంపై ధర్మం విజయానికి సంకేతంగా కనిపిస్తుంది. రావణుడి ఎదుట రాక్షసులు తనను బంధించిన సందర్భంలో- ‘ఈ అస్త్రాలు శస్త్రాలు నన్నేమీ చేయలేవు. రాముడికి చేటు కలిగిస్తే దేవాసురులను ఎవ్వరినీ వదిలిపెట్టను’ అని పలికిన మాటలు హనుమంతుడిలోని అపార ధైర్యసాహసాలకు ఉదాహరణలు. రాక్షసులు తన తోకకు నిప్పు అంటిస్తే, దానితోనే లంకను కాల్చిన హనుమంతుడు ఈ అగ్నిలో సీతామాత కూడా దహించుకొనిపోతుందేమో అని మనసులో సంశయించి, వెంటనే- ‘నా తపస్సు, సత్యవాక్య పరిపాలన వల్ల తల్లికి ఏ ప్రమాదమూ రాదు. అగ్నిదేవుడు సైతం పరమపావని అయిన సీతామాతను తాకలేడు. ఇది నా దృఢవిశ్వాసం’ అని ధైర్యంగా పలికిన అపార ధీశాలి హనుమ! ఇలా సుందరకాండలో అడుగడుగునా మారుతి ధార్మికత, ఉత్తమశీలం, రామభక్తి, కర్తవ్యనిష్ఠ కనిపిస్తాయి.  

- డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న