విదుర నీతులు

అంతర్యామి

విదుర నీతులు

విదురుడు అనగానే గుర్తుకు వచ్చేది నీతి. సర్వకాల సర్వావస్థల్లో ఉపయోగపడే నీతి విషయాలను లోకానికి అందించినవాడు విదురుడు. ఇతడిది మహాభారతంలో ప్రధాన పాత్ర. వ్యాసుడికి,  అంబిక దాసికి పుట్టినవాడు. ధృతరాష్ట్రుడి ఏకోదర సోదరుడు. గొప్ప జ్ఞానవంతుడు. ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో విదురుడికి పరిపాలన బాధ్యతలు అప్పగించాలి. కానీ అతడికి రాజ్యాధికారం ఇవ్వలేదు. అంబాలికకు జన్మించిన పాండురాజు వయసులో చిన్నవాడైనా అతడికే రాజ్య వ్యవహారాలు అప్పగించారు. వాస్తవానికి విదురుడు రాజ్యం కోసం ఎప్పుడూ ఆశపడలేదు. రాజ్యకాంక్ష గాని, ఎత్తుగడలు గాని లేనివాడు. నైతిక వర్తనకు మారు పేరు. యుద్ధ విద్యలన్నీ తెలిసినవాడు. మహారథి. అయినప్పటికీ భారత యుద్ధంలో ఎవరి పక్షమూ వహించలేదు. అందుకు కారణం అన్యాయాన్ని సహించని నైజం. ఎవరితోనూ శతృత్వం ఉండకూడదనేది అతడి ప్రధాన నియమం.
నీతికి మారు పేరైన విదురుడు ధృతరాష్ట్రుడికి- రాజు, అతడి గుణాలు ఎలా ఉండాలో ఎన్నోసార్లు వివరించాడు. ధృతరాష్ట్రుడికి మాత్రమే కాకుండా జనావళికందరికీ ఉపయోగపడే నీతులనెన్నింటినో సందర్భవశాన చెప్పాడు.
విదురుడు చెప్పిన నీతి సూత్రాల్లో కొన్ని... ఆలస్యం, అహంకారం, చంచలత్వం, అనవసర ప్రసంగం, స్తబ్ధత్వం, గర్వం, లోభం అనే ఏడూ విద్యార్జనకు ఆటంకాలని విదురుడు ఉపదేశించాడు. గురుసేవా రాహిత్యం, తొందరపాటుతనం, ఆత్మస్తుతి అనే ఈ మూడూ విద్యకు శత్రువులని ఆయన చెప్పాడు.
మిత్రుడిని ద్వేషించకూడదు. మనం ఎవరి శ్రేయం కోరుకుంటున్నామో వాళ్లకు మంచి చేయడానికి - ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చావు బతుకుల్లో ఉన్నప్పటికీ, ధర్మాన్ని వీడకూడదు. స్త్రీ వ్యామోహం, జూదం, వేట, సురాపానం, పుల్ల విరిచినట్లు మాట్లాడటం, క్రూరంగా దండించడం, దుబారా ఖర్చుతో డబ్బును నాశనం చేసుకోవడమనే ఏడూ వదులుకుంటే సుఖం కలుగుతుంది అన్నది విదురనీతుల్లో ప్రధానమైనది.
మంచి పదార్థాలన్నీ ఒక్కడే ఆరగించకూడదు. ఒక్కడే కూర్చుని ఏ ఆలోచనా చేయకూడదు. దూరదేశాలు వెళ్ళవలసి వస్తే ఒక్కడే వెళ్ళకూడదు. ఇంటిల్లపాదీ గాఢంగా నిద్రపోయేటప్పుడు ఒక్కడే మేలుకుని ఉండకూడదు- ప్రతి మనిషీ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మెలగాలి.
ప్రతివారూ తెలుసుకోదగ్గది, పలకవలసింది సత్యం ఒక్కటే. అది స్వర్గానికి తొలిమెట్టు. సముద్రంలో ప్రయాణం చేసేవాడికి ఓడ ఎలాంటిదో, లోకంలో బతికేవాడికి సత్యం అలాంటిది. ప్రతి మనిషీ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇతరుల విషయంలో ఎప్పుడూ ఈర్ష్య ఉండకూడదు. పొగడ్తలకు పొంగిపోకూడదు. పాలించేవాణ్ని, దేవుణ్ని, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి.
పరాయి స్త్రీల పట్ల వ్యామోహం ఉండకూడదు. మద్యపానం, ఇతరులను అనవసరంగా ఆడిపోసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ‘మహావీరుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పుడైనా గురి తప్పవచ్చేమో... కానీ మహానుభావుల మాటలు మాత్రం గురి తప్పవు. వారితో జాగ్రత్తగా మెలగాలి.
శరీరంలో దిగిన బాణాలను ఏవేవో ఉపాయాలతో తీసివేయవచ్చు. కానీ నిష్ఠురంగా మాట్లాడిన మాటలు మనసులో నాటుకుంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా తీయలేం’ అనేది మరో నీతి. విదురుడు బతికినంత కాలం ఈ నీతి, నియమాలనే నమ్మాడు. ఆచరించాడు. ఎవరితోనూ వైరం లేకుండా జీవించాలనే నియమం ఉండడంతోనే అతడు పాండవ పక్షపాతి అని తెలిసినా కౌరవులు భక్తి పూర్వకంగా ‘విదురదేవా!’ అని సంబోధించేవారు.
‘జీవిస్తే విదురుడిలా, తనువు చాలిస్తే సరయూనది నుంచి నేరుగా వైకుంఠం చేరిన శ్రీరాముడిలా ఉండా’లనేది అక్రూరుడు విదురుడికి ఇచ్చిన కితాబు.

- అయ్యగారి శ్రీనివాసరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న