సత్యం తెలుసుకోవాలి

అంతర్యామి

సత్యం తెలుసుకోవాలి

ప్రపంచం కంటికి కనిపిస్తున్నట్లుగా లేదు. అంటే ఎవరూ నమ్మరు. మరెలా ఉంది? అలా అడిగిన వాళ్లు కూడా తక్కువ. కళ్లతో చూస్తున్నాం. నమ్ముతున్నాం. ఇంకా ఇందులో గమ్మత్తు ఏం ఉంది? మీ చూపులోనే లోపం ఉంది అని అనేవాళ్లూ లేకపోలేదు. అది వాళ్ల చూపు.
అంతేకదా. కనిపిస్తున్న దృశ్యమానమైన జగత్తు మరోలా ఉందంటే... మరెలా ఉందని. దీనికి ఆదిశంకరుడు ఆయన అనుభూతితో ఒక నిర్ధారణకు వచ్చి- ఆధ్యాత్మిక ప్రమాణాలతో ఈ జగత్తు లేదు. అలా కనిపిస్తోంది. దీనికి ఆధారమైన సత్యం మాత్రమే ఉంది. అది కంటికి కనపడదు. అదే ఇదిగా కనిపిస్తోంది అని చెప్పారు. చీకట్లో తాడు పాములా కనిపించినట్లు, ఇది మనల్ని భ్రమకు గురిచేస్తోంది. మాయలో ఉంచుతుందని బోధించారు.
ఇదంతా ఓ కట్టుకథలాగా అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే- చీకటి వెళ్ళిపోయిన తరవాత పాము కనిపించదు. తాడు మాత్రమే కనిపిస్తుంది. నిజానికి చీకటి ఉన్నప్పుడు, లేనప్పుడు తాడే ఉంది. తాడులో మనకు కనిపించే పాము లేదు. లేని పామును మనమే కల్పించుకుని, మనల్ని మనమే భయపెట్టుకుని గజగజ వణికిపోయాం. వెలుగు వచ్చాక పాము లేదు, తాడు ఉందని తెలిశాక భయం పోయింది.
ఈ ప్రపంచమూ అంతే. అజ్ఞానం అనే చీకటిలో ఉన్నట్లు కనిపిస్తుంది. జ్ఞానం కలగగానే ప్రపంచం తొలగిపోయి, సత్యం మిగులుతుంది. ఆ సత్యాన్ని అంటిపెట్టుకుని జీవితం సాగించాలి. అదే నిజమైన జీవితం. అక్కడ ఆందోళనలు, భయాలు ఉండవు. బంధాలు బంధుత్వాలు ఉండవు. నేను, నీవు అనే భేదాలు ఉండవు. అంతా ఒకటిగానే కనిపిస్తుంది. ఆ ఒకటిని చూడు అంటారు అరుణాచల రమణ.
చలనచిత్రం ముందు ప్రకటనలు వేసినట్లు, ముందు ఈ ప్రపంచం మాయగా కనిపించి సాధన చేసిన తరవాత సత్యంగా కనిపించడం ఏమిటో చాలామందికి అర్థం కాదు. అవగాహనకు రాదు. అవగాహనకు రానంతమాత్రాన సత్యాన్ని కాదనలేం కదా. ఆ సత్యాన్ని అపరోక్షానుభూతి ద్వారా తెలుసుకోవచ్చునని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. అపరోక్షానుభూతి అంటే ఎవరికి వారు శోధించి, సాధించి రుజువు చేసుకోవడం అన్నమాట.
వేరొకరు చెప్పినంతమాత్రాన మనం అంగీకరించి అవును అనడానికి వీల్లేదంటుంది ఆధ్యాత్మికత. విజ్ఞానశాస్త్రంలో రుజువులు ఉంటేనే ఎలా ఒప్పుకొంటామో, ఇందులోనూ మనకు మనమే రంగంలోకి దిగి ఆ సత్యం అంతు ఏమిటో తేల్చుకుని, అనుభవించి, అనుభూతి చెంది లోకానికి వెల్లడించాలి. అదే శాస్త్రీయమైన, ప్రామాణికమైన పద్ధతి అంటోంది వేదాంతం.
ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మకుండా మన ఆత్మను మనం ఉద్ధరించుకోవడానికి ఈ పద్ధతి ఎంతో గొప్పదని రుషులు, యోగులు, ప్రవక్తలు, అవతారమూర్తులు తెలియజేశారు. ప్రశ్నించడం, వెదకడం, తెలుసుకోవడం- మనిషికి పుట్టుకతో వచ్చిన విద్యలు.
అందరికీ అలా తెలుసుకోవాలని ఎందుకు అనిపించడంలేదంటే- ఈ ప్రపంచం నిండా అంత మోహం, ఆకర్షణ, మాయ నిండి ఉన్నాయని వేదం చెబుతోంది. అదంత సులువు కాదు. ప్రపంచం నుంచి దృష్టి మరల్చలేం. ఆటల పిల్లవాడు రంగు రంగుల వస్తువుల వెంట ఎలా పరుగులు తీస్తాడో- మనం కూడా అలాగే ఈ అందమైన ప్రపంచానికి వశమై పోతున్నాం. ఒక్క క్షణమైనా ఆలోచించలేకపోతున్నాం. ఈ మాయ హాయిగా ఉంది. ఇందులోనే ఉందాం అని ఏ మహానుభావుడి మాటను కూడా పట్టించుకోవడంలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు.

- ఆనందసాయి స్వామి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న