కష్టమొస్తే రానీ...

అంతర్యామి

కష్టమొస్తే రానీ...

ష్టసుఖాలు చీకటి వెలుగుల్లాంటివి. చీకటి తరవాత వెలుగు రేఖలు ఉదయించినట్లు కష్టం తరవాత సుఖం కలుగుతుందని నమ్మాలి. అయితే వచ్చిన కష్టాన్ని భరించలేని మనిషి, దుర్బలుడై సహనం కోల్పోయి ప్రవర్తిస్తాడు. వివేకశూన్యుడై పిరికివాడిలా మారి విలపిస్తాడు. కష్టం సంప్రాప్తించిందని నిగ్రహాన్ని కోల్పోయి దైవదూషణ చేస్తాడు. నమ్ముకొన్న దైవం అక్కరకు రాలేదని వాపోతాడు. ‘నాకొచ్చిన కష్టాలు తీర్చనివాడు దేవుడెందుకవుతాడు’ అని విచక్షణ కోల్పోయి దైవాన్ని దూషిస్తాడు. ఇది ఏ మాత్రం సరైన ఆలోచన కాదు. అలాటి కష్ట సమయంలో ‘పరమాత్మ లీలలు చిత్రమైనవని, అన్నీ మన మంచికే అని అనుకోవాలని, ప్రతి పరీక్ష వెనకా విజయం లభిస్తుందని’ సాంత్వనపరచే గురువో, స్నేహితుడో, సన్నిహితుడో తప్పక కావాలి.
యుద్దరంగంలో ‘తనవాళ్ళు’ అనుకునే కౌరవప్రముఖులను చూసి ఖేదంతో యుద్ధమే వద్దన్న అర్జునుడికి, ‘ఇన్నాళ్ల మీ కష్టాలకు యుద్ధమే సరైన మార్గమని, తరవాత లభించే రాజ్యాన్ని సుఖశాంతులతో పాలించాలని’ చెప్పిన కృష్ణుడు లభించడం నిజంగా పాండవుల అదృష్టమే. శ్రీమహావిష్ణువు సేవలో తరిస్తున్న జయవిజయులు, తాము శాపగ్రస్తులుగా మారడం తమ దురదృష్టమని, నమ్ముకున్న స్వామికి దూరం కావడం తగని కష్టమని దుఃఖించారు. మూడు జన్మలలో విరోధులుగా జన్మించి, శిక్షను పొంది, వేగంగా మళ్ళీ స్వామిని చేరుకోవడం మనకు తెలుసు.
హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించి బాల ప్రహ్లాదుడి అనన్యభక్తిని వారు లోకానికి చాటి చెప్పారు. రావణ, కుంభకర్ణులై పుట్టి, పరనారీ అపహరణం ఎంతటి అపరాధమో, ఫలితం ఎలా ఉంటుందో తెలియజెప్పారు. శిశుపాల దంతవక్త్రులై ప్రత్యక్ష భగవద్దూషణ ఎంతటి ప్రమాదకరమో భక్తావళికి తెలియజేశారు.
మహాభారత యుద్దంలో కర్ణుడి బారి నుంచి అర్జునుడిని రక్షించేందుకు రాధేయుడు ప్రయోగించిన ‘శక్తి’ ఆయుధానికి ఘటోత్కచుడు బలి అయ్యేలా చేశాడు శ్రీకృష్ణుడు. ఘటోత్కచుడు మరణించినప్పుడు ఆనందిస్తూ నృత్యం చేశాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటన పాండవులను, ముఖ్యంగా భీముణ్ని ఎంతో బాధించింది. ఒళ్ళు తెలియని కోపంతో పరమాత్ముడినే నిందించాడు. కానీ, ఆ ‘శక్తి’ నిజంగా అర్జునుడిపై ప్రయోగించినట్లయితే, అది అర్జునుడి ప్రాణానికే ప్రమాదమని ఒక్క కృష్ణుడికే తెలుసు. వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ, ఒకానొక సందర్భంలో పాండవులకు కష్టాలు కలగాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించింది కుంతీదేవి. భోగలాలసులై, కన్నూమిన్నూ గానని ధనగర్వంతో, సుఖలోలురై, భగవంతుడిని తలవరేమోనని ఆమె భయం. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం విడవక, సహనం కోల్పోక, దైవంపై నిశ్చలమైన భక్తిశ్రద్ధలు నిలిపి, విజయం కోసం పోరాడారు పాండవులు. అనుకోని కష్టంవచ్చి పడినప్పుడు శ్రీరామచంద్రుడంతటివాడే నిబ్బరం కోల్పోక సహనంతో ఆలోచనతో, మంచి మిత్రులను సంపాదించుకుని శత్రువుపై విజయం సాధించాడు.
కొన్ని సందర్భాల్లో కష్టాలు కలగడానికి మనిషి నిర్లక్ష్యం, స్వయం కృతాపరాధమూ కారణమవుతాయి. కష్టపడని విద్యార్థులు పరీక్షలలో పరాజయం పాలయితేగానీ, వారికి చదువు విలువ తెలియదు. ‘బాధ పడక మరోసారి ప్రయత్నించు. కష్టపడి చదివితే విజయం నీదే!’ అని చెప్పే పెద్దలు చాలా అవసరం. వ్యాపారమైనా, వ్యవహారమైనా కష్టపడనిదే రాణించవు. అసలు కష్టాలను తట్టుకునే శక్తి కలిగితే గానీ, సుఖం విలువ తెలియదు. ఈ శక్తిని మనం పెంచుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని అలవరచుకోవాలి. కష్టం మనిషికి ఎన్నో పాఠాలు బోధిస్తుంది. ఎలా బతకాలో నేర్పిస్తుంది. బాల్యం నుంచే పిల్లలకు కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో నూరిపోయాలి. ఎంతటి కష్టం వచ్చినా చిరునవ్వుతో భరించేలా తర్ఫీదివ్వాలి.

- మాడుగుల రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న