జీవిత గమనం

అంతర్యామి

జీవిత గమనం

రణం అనగానే మనిషికి చెప్పలేనంత భయం. నిజానికి మనిషిలోని సర్వ భయాలకు మూలం- మరణమే. ఆధునిక విజ్ఞానంతో మరణాన్ని కొంత కాలం వాయిదా వేయవచ్చు. దాన్ని శాశ్వతంగా నివారించలేం. జన్మ ఎత్తిన ప్రతీ జీవికి మరణమన్నది ఖాయం. అది ప్రాకృతిక ప్రామాణిక సూత్రం. దాన్నెవరూ మార్చలేరు. ప్రాణ భయం అనేది అజ్ఞానం వల్ల జరిగే తమో గుణానికి చెందిన ఒక మానసిక ప్రక్రియ. సాధారణంగా మనిషి చీకట్లో ఉన్నప్పుడు భయపడతాడు. అందువల్లే, అజ్ఞానాన్ని చీకటితో పోల్చుతారు. అజ్ఞానాంధకారంతో కూడిన మనసులోకి అరిషడ్వర్గాలు దూరతాయి. మనిషిని అనేక ఇబ్బందులు పెడతాయి. తప్పుడు పనులెన్నో చేయిస్తాయి. సామాజిక కట్టుబాట్లు, చట్టాలకు విఘాతం కలిగిస్తాయి. ఫలితంగా మనిషి మనసు భయాందోళలనకు గురవుతుంది. కొన్నిసార్లు కొత్త విషయాలన్నా, కొత్త స్థలాలకు వెళ్లాలన్నా మనిషి జంకుతాడు. కారణం, ఆ మనిషి మనసులో కాపురం ఉంటున్న అరిషడ్వర్గాల ప్రభావం. కానీ జ్ఞానదీపంతో అఖండంగా వెలిగే మనసు నిర్భయంగా ఉంటుంది. అలా ధైర్యమున్న మనసే జడత్వాన్ని ఛేదించుకుని ముందుకు సాగుతుంది.
విత్తనం చెట్టును కంటుంది. దాన్ని గూడులా భావిస్తుంది. తరవాత అదే చెట్టు(పండ్ల)లోకి వెళ్ళి తలదాచుకుంటుంది. ఎండిన ఆకులు రాలిపోతుంటాయి. కొత్త చిగుళ్లు పుట్టుకొస్తుంటాయి. ఒక రోజు అంతెత్తు వృక్షమూ కుప్పకూలిపోతుంది. అంతకన్న ముందే విత్తనం చెట్టు (పండ్ల) లోంచి బయటపడుతుంది. మరోచోట ఇంకో చెట్టై జన్మ ఎత్తుతుంది. మనిషి జీవితమూ అంతే. సూక్ష్మాతి సూక్ష్మ చైతన్య విత్తనం మనిషి రూపంలో గూడు అల్లుకుంటుంది. ఆ దేహంలోంచి రోజూ కొన్ని కణాలు చనిపోతుంటాయి. కొత్త కణాలు వస్తుంటాయి. ఆయుష్షు నిండాక ఒకనాడు ఆ మనిషి ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది.
మనిషి శరీరంలో మరణించిన కణాలు- గోళ్లు, వెంట్రుకల రూపంలో వెళ్లిపోతుంటాయి. వాటిని కత్తితో కోసినప్పుడు నొప్పి అనిపించకపోవడానికి కారణం- అవి నిర్జీవాలు. ఇలా చిన్న చిన్న విషయాలు తెలిసినప్పుడు మనసు సంతోషంతో నిండిపోతుంది. శిఖరాగ్ర భాగాన నిలిచిన అంతిమ సత్యం పట్ల అవగాహన కలిగినప్పుడు మనసు స్వేచ్ఛ పొందుతుంది. అన్ని రకాల భయాలతో పాటు మరణ భయానికీ స్వస్తి పలుకుతుంది.
గుమ్మం గృహానికి శోభాయమానం. తోరణం కట్టినా, పూమాల వేలాడదీసినా అది ఇంటిల్లపాదినీ మురిపిస్తుంది. అతిథులనూ ఆకర్షిస్తుంది. తలుపులు బార్లా తెరుచుకుని అందరికీ ఘనస్వాగతం పలుకుతుంది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో ఇంటి గుమ్మమే ప్రధాన పాత్ర వహిస్తున్నట్లుగా ఉంటుంది. రోజూ పసుపు కుంకుమలతో గడప నిండు ముత్తైదువలా అగుపడుతుంది. ఇంటి గుమ్మం ఉదయం వేళ శోభను ఆవిష్కరిస్తుంది. ఇంటి వెనకాల దర్వాజా పొద్దుగూకే సమయాల్ని తలపింపజేస్తుంది. ఇది మనిషి జనన, మరణాలకూ వర్తిస్తుంది. పుట్టుక- బతుకులోకి వచ్చే ఇంటి ముందరి గుమ్మంలాంటిది. చావు- జీవితంలోంచి వెళ్ళిపోయే దర్వాజా.

- మునిమడుగుల రాజారావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న