ఎన్నో భూమికలు

అంతర్యామి

ఎన్నో భూమికలు

‘స్త్రీ కారణంగానే సృష్టికి శోభ చేకూరుతుంది’ అన్నారు పెద్దలు. ‘ఇంటికి దీపం... కంటికి వెలుగు’ అన్నారు కవులు. పురుషులు ఎందరున్నా అదొక సత్రమే. ఒక స్త్రీ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడే అది ఇల్లు అవుతుందన్నది పురుషుడికి అనుభవమయ్యే విషయం. ముఖ్యంగా స్త్రీ- యువతిగా, ఇల్లాలిగా, తల్లిగా నిర్వహించే పాత్ర పోషణ ఎంతో నైపుణ్యంతో కూడుకున్నది. ఆమె అంతర్గత శక్తులు అపురూపమైనవి. బాధ్యతలు అమోఘమైనవి. ఈ దేశం ఆచార వ్యవహారాలు, సంసృతీ సంప్రదాయాలు, కట్టుబాట్లు స్త్రీల మూలంగానే సజీవంగా కొనసాగుతున్నాయి.
కవులు, కళాకారులు, నిజ జీవిత విజేతల్లో తెలివైన యువతులు రగిల్చే ఉత్తేజం, స్ఫూర్తి అనితరసాధ్యం. ‘క్రైం అండ్‌ పనిష్మెంట్‌’తో లోక ప్రసిద్ధుడైన దాస్తోవస్కీ సృష్టించిన ‘పొలీనా’ (గేంబ్లర్‌) ‘నాస్తసియా’ (ఇడియట్‌) ‘గ్రుహెంకా’ (బ్రదర్స్‌ కరామజాఫ్‌) వంటి అద్భుత పాత్రలకు ఆయన ప్రేమించిన ‘పొలీనా సువా’ అనే యువతే గొప్ప ప్రేరణగా నిలిచిందని సాహితీ వేత్తల అభిప్రాయం.
ఇల్లాలిగా స్త్రీ పాత్ర మరింత విస్తృతమైనది. భార్య అనే పదానికి మన భాషలో ఎన్నో పర్యాయ రూపాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఆమె చేపట్టే బాధ్యతలకు ప్రతీకలు. ఆ భూమికను అనుసరించి ఆయా సందర్భాల్లో ఆ పేర్లతో వ్యవహరించాలి. అగ్ని సాక్షిగా వివాహమాడిన స్త్రీని పత్ని అంటారు. యజ్ఞయాగాదులలోనే కాదు, శుభ అశుభ కార్యాలన్నింటా సహధర్మచారిణిగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆమెను ధర్మపత్నిగా పిలుస్తారు.
‘ఆలు’ అంటే స్త్రీ. ఇంటావిడ, ఇంటి ఆలు, ఇంటికి యజ మానురాలు... అనే అర్థాల్లో ఆమెను ఇల్లాలిగా సంబోధిస్తారు. భార్య అనే మాటకు అర్థం వేరు. భర్త తన ఉద్యోగ వ్యాపారాల రీత్యా గ్రామాంతరాలకు వెళ్ళినప్పుడు భర్త స్థానంలో కుటుంబ బరువు బాధ్యతలను నిర్వహించేది భార్య. సత్వగుణంతో శోభించే స్త్రీ సతి. అన్ని వేళలా భర్తతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవనం సాగించేది దార! ఇలా ఒక్కో కర్తవ్యానికి ఒక్కో పేరు. బాధ్యతకు సరితూగే సంబోధన భావన. ఏ పాత్రకు ఆ పాత్రే విభిన్నం... ప్రత్యేకం. ప్రతిదానికీ ఎన్నో పర్యాయపదాలను ప్రతిపాదించే ఆంగ్లభాష భార్యకు ఒక్క వైఫ్‌ అనే పదాన్ని చెప్పి ఊరుకుంది. అర్ధాంగి పదానికి సరిపడేలా ‘బెటర్‌హాఫ్‌’ అనే ముద్దు పేరును వ్యాప్తిలోకి తెచ్చింది. భార్యకు ఎన్నో పర్యాయపదాలు వినియోగంలోకి రావడం భారతీయ భాషల పరిపుష్టికి చిహ్నం.
స్త్రీకి అన్నింటికన్నా గొప్ప గౌరవ వాచకం తల్లి. అమ్మ అంటే అమృతమూర్తి. అన్ని చోట్లా తాను ఉండలేని ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతుడే తనకు ప్రతిరూపంగా సృష్టించిన పాత్ర పేరు అమ్మ! బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతుంది. అమ్మ సహకారం లేనిదే బ్రహ్మ సృష్టి సాగదు.
లోకంలో స్త్రీలది ఇంతటి యోగ్యమైన బాధ్యతాయుతమైన పాత్ర కాబట్టే దేశ పాలనలో, ప్రభుత్వ నిర్వహణలో సామాజిక సంస్కరణల్లో స్త్రీలు పాలుపంచుకోవాలని రుగ్వేదం ఆశించింది. స్త్రీ ధైర్యవంతురాలు కావాలని యజుర్వేదం దీవించింది. జ్ఞానవంతురాలై ప్రజల్ని వివేకవంతులుగా తయారు చేయాలని అధర్వణ వేదం ఆదేశించింది. అన్ని రకాలుగా శక్తిమంతురాలైన స్త్రీ ముందు లోకం సాగిలపడుతుంది. స్త్రీత్వానికి జేజేలు చెబుతుంది!

- ఎర్రాప్రగడ రామకృష్ణ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న