శ్రీ ఆంజనేయం

అంతర్యామి

శ్రీ ఆంజనేయం

శ్రీరామ కార్యనిర్వహణలో అనన్య భక్తిని, సుగ్రీవ, అంగద, జాంబవంతాది వానర వీరులతో అనిర్వచనీయ మైత్రిని, లక్ష్మణుడి ప్రాణాల్ని కాపాడటంలో అసమాన ధీరత్వాన్ని, రాక్షస గణాన్ని సంహరించడంలో అద్భుత శక్తిని ప్రదర్శించిన కార్యసాధకుడు, కర్మయోగి మహావీర చైతన్య స్వరూపుడు- ఆంజనేయుడు. ఆదర్శనీయ మూర్తిమత్వం, ఆచరణీయ స్ఫూర్తితత్త్వం, ఆరాధనీయ దైవత్వాల కలబోత పవనసుత హనుమాన్‌. ‘సుందరే సుందరం కపిః’ శ్రీమద్రామాయణంలో సుందరకాండకు సౌందర్యత్వాన్ని హనుమ ఆపాదించాడు. మంత్రశాస్త్ర రీత్యాహనుమ నామధేయం- సుందరాత్మ.
శిష్ట రక్షకుడు, దుష్ట శిక్షకుడు- ఆంజనేయుడని నారదపురాణం వివరించింది. రామకార్య సాఫల్యానికి హనుమ కారణజన్ముడిగా అవతరించాడని, శౌనకసంహిత కపీశుడి గుణ సంకీర్తనం చేసింది. వైశాఖమాస కృష్ణపక్ష దశమినాడు రుద్రాంశతో హనుమ జన్మించాడని పరాశర సంహిత పేర్కొంది. త్రిపురాసుర సంహారంలో ఈశ్వరుడికి, విష్ణువు సహాయం చేసినందుకు కృతజ్ఞతగా రాముడి కోసం శివుడే హనుమగా ఆవిష్కారమయ్యాడని వానరగీత వెల్లడించింది. మాననీయమైన మానవీయ విలువలకు రామాయణం దిక్సూచి. మనిషి ఉదాత్తంగా, ఉత్తమంగా ఎలా జీవించాలో రామాయణం దిశానిర్దేశం చేసింది. జీవనవేదమైన రామాయణంలో హనుమ పాత్ర ఏ తరానికైనా స్ఫూర్తిమంత్రం. హనుమ ప్రవర్తన, కార్యక్రమ నిర్వహణా యుక్తి, దీక్షాదక్షతలను వాల్మీకి మహర్షి పలురీతుల్లో వర్ణించారు. మాట తీరులో మంచితనం, పనిలో ఉక్కు సంకల్పం, అవరోధాల్ని అధిగమించగల నేర్పు, విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోగల ఓర్పు, సమయోచితమైన ప్రవర్తన, దూరదృష్టి, ఇక్కట్లను ఎదుర్కోగల నైపుణ్యం, ప్రలోభాలకు లోను కాని దృఢచిత్తం... ఇలాంటి ఎన్నో సులక్షణాలతో మారుతి అందరికీ మార్గదర్శకుడిగా వర్ధిల్లుతున్నాడు.
వాక్కు అంటే కేవలం మాట్లాడే శక్తి కాదు. బుద్ధి, విశేష జ్ఞానం, జ్ఞాన గరిమను వెల్లడించగల నిపుణత్వం, సునిశిత పరిశీలన, లోతైన ఆలోచన, సందర్భోచిత ప్రసంగ వైఖరి... ఇలాంటి ఎన్నో అంశాల మేళవింపే- వాక్కు. అలాంటి వాగ్విశారదుడిగా, వాగ్వైభవ వల్లభుడిగా హనుమ తన వైశిష్ట్యాన్ని ప్రకటించాడు.
సార్వజనీనమైన, సార్వకాలీనమైన మంత్ర సంహిత శ్రీమద్రామాయణంలో కపివీరుడు ఉపాస్య దైవం! భక్తుడు, భగవత్‌ స్వరూపుడు తానే అయి శ్రీరామచరితంలో సుస్థిర స్థానాన్ని పొందాడు. ‘హనుమత్‌’ అంటే సుషుమ్న శక్తితో కూడిన యోగీశ్వరుడు. అజ్ఞానాన్ని రూపుమాపి, బుద్ధికారక శక్తుల్ని వికసింపజేసే చైతన్యానికి ‘హను’ అని పేరు. ఆ జ్ఞానమయుడైన తేజోరూపుడిగా, విశ్వమంతా ఆవరించిన విరాట్‌ మూర్తిగా హనుమాన్‌ భాసిల్లాడు. లంక అనే శ్రీపురంలో శ్రీచక్ర రాజనిలయ అయిన సీతా పరాభట్టారికను అఖండమైన, అతులితమైన, అమేయమైన దీక్షతో, సాధనా పటిమతో హనుమ దర్శించాడు. సీతా మహా సాధ్వి జీవాత్మకు సంకేతం. శ్రీరాముడు పరమాత్మకు ప్రతిబింబం. జీవాత్మను, పరమాత్మతో సమ్మిళితం చేయడానికి, అద్వైత సిద్ధిని సాధించడానికి మహేశుడే మంగళరూప మహితాత్మజుడైన హనుమగా తన లీలా విభూతిని ప్రదర్శించాడు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న