ప్రత్యక్ష దైవం

అంతర్యామి

ప్రత్యక్ష దైవం

గవంతుడు తన ప్రతిరూపంగా ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతి ఒడిలో సమస్త జీవరాశులూ జీవించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాడు. ప్రాణికోటి అవసరాలకు, శరీర ధర్మానికి తగినట్లుగా పర్యావరణాన్ని ఏర్పరచాడు.      
అన్ని ప్రాణుల్లాగే మనిషి కూడా ప్రకృతిని సందర్శించడానికి వచ్చిపోయే బాటసారి మాత్రమే.  ప్రకృతి, పర్యావరణాలు తప్ప- ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు.    
సమస్త ప్రాణులూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించగలవేమో కానీ, ఆ అనుభూతుల్ని  మనసులో నిక్షిప్తం చేసుకోగల సామర్థ్యాన్ని ఒక్క మనిషికే భగవంతుడు అనుగ్రహించాడు.      
మార్పు ప్రకృతి సహజలక్షణం.  దానితో మమేకమైన వారే, ప్రకృతిలో ఐక్యమైన భగవంతుణ్ని చూడగలుగుతారు...    
‘పచ్చని చెట్లు, పంట పొలాలు, వెచ్చని సూరీడు, చల్లని చంద్రుడు, పౌర్ణమి జాబిల్లి, కొండ కోనలు, గలగల పారే సెలయేళ్లు, తెల్లని మంచు బిందువులు, ఉభయ సంధ్యల్లో మెరిసే పసిడి వర్ణాలు, తొలకరి చినుకులు, మట్టి వాసన, ఎండా వానల సంగమంలో విరిసే హరివిల్లు... ఇలా ఎన్నెన్నో ప్రకృతి అందాలను వీక్షించాలి. మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. అంతకు మించిన ఐశ్వర్యం మరొకటి లేదు’ అన్నారు విశ్వకవి.    
సామాన్యుడు మొదలు సర్వసంగ పరిత్యాగి వరకు అవ్యక్త పారవశ్యాన్ని అందించేది మనోజ్ఞ రమణీయ ప్రకృతే.  ఆధ్యాత్మిక సాధకులు తమ సాధనకు పవిత్రమైన ప్రకృతి ఒడినే తపో భూమిగా ఆశ్రయిస్తారు. ప్రకృతిలో ప్రతిదీ ద్వంద్వ వైరుధ్యాల కలయికే కనిపిస్తుంది. పగలు రాత్రి, సుఖం దుఃఖం, మంచీ చెడు, ఆడా మగా, ప్రకృతి వికృతి... ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. వీటిని అనుసరించే జీవించాలి.    
ప్రకృతి మనిషికి ఎప్పుడూ ఒక శేష ప్రశ్నే. ఆ అద్భుత రహస్యాల్ని ఎంత శోధించి, సాధించినా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి.    
బాహ్యంగా సమస్త జీవులకు జీవించడానికి పంచభూతాలను ఉచితంగా ప్రసాదించాడు దేవుడు. అన్ని జీవులలో సంతృప్తి అనే ‘ఫుల్‌ స్టాప్‌’ పెట్టి ,మనిషి దగ్గర మాత్రం మరిచిపోయి ‘కామా’ పెట్టాడు.    
అందుకే మనిషిలో స్వార్థం, అత్యాశలతో  తన ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు కారణమైన ప్రాణవాయువును అందించే ప్రకృతి, పర్యావరణాలను వికృతిగా మార్చేస్తున్నాడు. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, జల కాలుష్యం, నింగి కాలుష్యం, నేల కాలుష్యం, తినే తిండినీ కాలుష్యమయం చేస్తూ- వీటన్నింటికీ తన ఆలోచన కాలుష్యమే మూలమనే విషయం మరచిపోతున్నాడు.    
బాహ్య అవసరాల కోసం పర్యావరణాన్ని సృష్టించిన భగవంతుడికి, మనిషి మానసిక అవసరాలు తీర్చడం తెలియదా?తాపత్రయం అణిగితేనే ‘సంతృప్తి’ సదా జాగరూకతతో ఉంటుంది. నాది కానిది, నాతో రానిది, నాకు అవసరం లేదనే ఆలోచనే ఆధ్యాత్మికత.  పర్యావరణంలో, ప్రకృతిలో పరమాత్ముణ్ని చూడాలి. అప్పుడే వాటిని సృష్టించడం చేతకాని మనిషికి సంహరించడం అనే ఆలోచన సద్దుమణుగుతుంది.      
ఎవరూ చూడటం లేదని ప్రకృతిని వికృతి చేస్తే, ప్రకోపించే ప్రకృతి సృష్టించే విలయాన్ని మనిషి తట్టుకోగలడా?  సునామీలు, భూకంపాలు, కంటికి కనిపించని ప్రాణాంతక సూక్ష్మ క్రిముల రూపేణా సంక్షోభాల తీవ్రతను చవిచూస్తున్నాం.    
ప్రత్యక్ష దైవమైన ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అందుకు ఆలోచనా కాలుష్యాల్ని ప్రక్షాళన చేసేది ఆధ్యాత్మికతే.

- ఎం వెంకటేశ్వరరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న