తీర్థయాత్ర

అంతర్యామి

తీర్థయాత్ర

జ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారని మహర్షులు చెబుతారు. దేవతలను సంతోష పెట్టడంకోసం చక్రవర్తులు అనేక విధాలైన యాగాలు చేశారు. వారు ఇహలోకంలోను, పరలోకంలోను సుఖించినట్లు మన పురాణాలు వెల్లడిస్తున్నాయి. యజ్ఞం చేయడం శ్రమతో కూడిన పని. కొన్ని యజ్ఞాలు చేయడం ధనికులకే సాధ్యం. యజ్ఞఫలాన్ని పొందాలని అందరికీ కోరిక ఉండవచ్చు. పుణ్యఫలాన్ని పొందడానికి ఇంకా చాలా పద్ధతులున్నాయి. వాటిలో ముఖ్యమైనది తీర్థయాత్ర అని మహాభారతం చెబుతున్నది.
నిరుపేదలకు సైతం అందుబాటులో ఉండే సులభ మార్గం తీర్థయాత్ర. పుణ్యనదీ స్నానమే తీర్థయాత్ర లక్ష్యం. అయోధ్య, మధుర, కాశీ మొదలైన పవిత్ర ప్రదేశాలనే తీర్థయాత్రలకు ఎంచుకుంటారు. విష్ణువుకు తీర్థకరుడు అనే పేరు ఉంది. బుద్ధుడికి, జైన మతాచార్యులకూ తీర్థంకరులు అనే పేర్లున్నాయి. మన పవిత్ర క్షేత్రాలన్నీ పవిత్ర నదీతీరాల్లోనే ఉన్నాయి. నదీస్నానంతోపాటు పుణ్య క్షేత్రాల దర్శనం కూడా సిద్ధిస్తుంది కాబట్టి తీర్థయాత్ర మరచిపోలేని మధురానుభూతిగా యాత్రికుల మనసుల్లో మిగిలిపోతుంది. గుడుల్లో అర్చక స్వాములు భక్తులకు ఇచ్చే పవిత్ర ఉదకాన్ని తీర్థం అంటారు. ప్రయాగ తీర్థరాజంగా, కాశీ తీర్థరాజిగా ప్రఖ్యాతి చెందాయి. యతి సంప్రదాయంలో కొందరు తమ పేరు చివర తీర్థ అని పెట్టుకుంటారు.
మహా భారతంలో తీర్థ మాహాత్మ్యాన్ని నారదుడు ధర్మ రాజుకు చెబుతాడు. పులస్త్యుడు భీష్ముడికి తీర్థయాత్రల వల్ల కలిగే ఫలాన్ని గురించి చెబుతాడు. ఆ సందర్భంలో పులస్త్యుడు మూడు వందల యాభై పుణ్య క్షేత్రాలను పేర్కొన్నాడు. భీష్ముడి కోరికపై పులస్త్యుడు తీర్థయాత్రలకై భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలను చూడటం వల్ల కలిగే లాభాలను వివరిస్తాడు. చేతులను, పాదాలను, మనసును అదుపులో పెట్టుకొని తీర్థయాత్రలు చేయాలి. విద్యను, తపస్సును, కీర్తిని సంపాదించాలి. ఎవరి వద్దనుంచీ దానం స్వీకరించకూడదు. లభించినదానితో తృప్తిపడాలి. అహంకారం ఉండరాదు. అటువంటి వాడే తీర్థయాత్రా ఫలానికి అర్హుడు అని తీర్థయాత్రికుడి అర్హతలను, తీర్థయాత్ర ప్రయోజనాలను భీష్ముడికి చెబుతాడు.
ధౌమ్యుడు ‘పుణ్యతీర్థాల గురించి విన్నా పుణ్యమే’ అని నాలుగు దిక్కుల్లో ఉన్న పవిత్ర తీర్థాలను గురించి ధర్మరాజుకు తెలియ జేస్తాడు.
అర్జునుడి తీర్థయాత్రను భారతం ప్రముఖంగా వర్ణిస్తున్నది. ద్రౌపది కారణంగా పాండవుల మధ్య కలహం రాకుండా నారదుడు ఒక ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఓ పండితుడు వచ్చి, తన గోవులను దొంగలు ఎత్తుకు వెళ్లారని రాజద్వారం వద్ద గొడవ చేశాడు. అర్జునుడు అతడికి ధైర్యం చెప్పి దొంగలను వధించడానికి బయలుదేరాడు. ఆయుధాలకోసం అర్జునుడు ద్రౌపదీ ధర్మరాజులు ఉన్న చోటుకు వెళ్లాడు. నారదుడు చేసిన ఏర్పాటుకు ఇది భంగకరం కాబట్టి, ఒప్పందం ప్రకారం అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన తీర్థయాత్రల ప్రాముఖ్యాన్ని మహాభారతం సందర్భానుసారం తెలియజేస్తున్నది. బలరాముడు కురుక్షేత్ర యుద్ధసమయంలో తీర్థయాత్రలకు వెళతాడు. నైమిశారణ్యంలో మహర్షుల దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం కావ్యంలో ధూర్జటి మహాకవి నత్కీరుడి దక్షిణ భారతదేశ తీర్థయాత్రా విశేషాలను మనోహర రీతిలో వర్ణించాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న