మనసును జయించగలమా?

అంతర్యామి

మనసును జయించగలమా?

నసులో రొదపెట్టే ఆలోచనల్ని ఆపాలి. ఆలోచనలు ఆపేస్తే పనులు ఎలా జరుగుతాయని చాలామంది భావిస్తారు. తీవ్రంగా ఆలోచిస్తేనే కదా... పెద్దపెద్ద ప్రణాళికలు వెయ్యగలం. ప్రణాళికలు వేస్తేనే గదా పనులు చెయ్యగలం.  నిజమే.
పనిచేస్తుంటే కొత్తకొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటిని కూడా జోడించి పనిని సులభంగా, త్వరితగతిన పూర్తి చేయవచ్చు. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ, ఆలోచనలోనే ఉండిపోతే, గాలిలో మేడలు మాత్రమే కట్టగలం. వాటికి ఆచరణలో రూపురేఖలు ఇవ్వడం కుదరకపోవచ్చు.
ఆలోచనలు ఒక సరళరేఖలో సాగవు. అటు ఇటు వెళుతుంటాయి. గజిబిజిగా ఉంటాయి. భయపెడతాయి. బాధపెడతాయి. ఆ క్షణమే నువ్వు చెయ్యగలవు అంటాయి. మరుక్షణమే నువ్వేం చెయ్యగలవు అంటాయి.
ఆలోచనలకు అవసరమైనప్పుడు అడ్డుకట్ట వెయ్యగలిగే శక్తిని సమీకరించుకోవాలి. అదంత సులువు కాదు. ప్రయత్నించాలి. ప్రయత్నించి మనసుకు శిక్షణనివ్వాలి. నిరోధించడమే యోగం అంటాడు పతంజలి.
మనసే బంధకారకం. మనసే మోక్షకారకం అంటాయి ఉపనిషత్తులు. మనసును జయించడం అసాధ్యం. అయితే నెమ్మదిగా అభ్యాసం ద్వారా అధీనంలోకి తెచ్చుకోవచ్చు అన్నది గీతాచార్యుడి మాట.
నిత్యం మనతోనే ఉండి, మనకు అర్థం కాకుండా ఉంటుంది మనసు. మనసును అర్ధం చేసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. ఓడిపోతుంటారు. ఈ మనసు మనలోని దివ్యశక్తికి, మనకు అడ్డుగా నిలిచి తెరలాగా ఉంది. మనసు పక్కకు తప్పుకొంటేనే లోపల ఉన్నదేదో మనకు కనపడుతుంది.
మనసును పక్కకు తప్పించాలి. ఏం చెయ్యాలి? మనసుతో ఒక భారీ యుద్ధం ప్రకటించకపోతే మానవజన్మకు అర్థం లేదు. అందుకు ప్రతి మనిషీ యుద్ధం చెయ్యాలి. మనసే ఒక కురుక్షేత్రం. శ్రీకృష్ణుడు హృదయం, బుద్ధి అర్జునుడు. ఇది ప్రతి రోజూ ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉన్నదే. యుద్ధం చేస్తూనే జీవితాన్ని జీవించాలి. తప్పదు.
అన్నం తింటూ ఆలోచిస్తుంటాం. తల దువ్వుకుంటూ ఆలోచిస్తుంటాం. నడుస్తూ ఆలోచిస్తుంటాం. కూర్చుని ఆలోచిస్తుంటాం. నిద్రపోయే ముందు ఆలోచిస్తాం. నిద్ర లేచిన తరవాత ఆలోచిస్తాం. ఆలోచనలే మన జీవితం. ఆలోచనలే మనకు ఆహారం.
కొందరికి ఏ ఆలోచనలూ ఉండవు. లోతుగా ఆలోచించడం వాళ్లకు తెలియదు. అసలు దేని గురించీ ఆలోచించరు. మరికొందరు ప్రతి చిన్నదానికీ బాగా ఆలోచించి ఏవేవో ఊహించుకుని, ఆలోచనల్లోనే గడుపుతుంటారు. అసలు ఈ ఆలోచనలు దేనికి? మనం ఆలోచిస్తేనే గానీ జరగాల్సినవి జరగకుండా ఆగిపోతాయా? ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రకృతి, ప్రపంచం వాటి మానాన అవి సాగిపోతుంటాయి.
మనసు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అది దాని పని. దానికి ఎదురు తిరిగేకంటే, దాని స్వభావం తెలుసుకుని నెమ్మదిగా మన దారిలోకి తెచ్చుకుని మనపనిలో మనం పడాలి. దీనికి ఓర్పు-నేర్పు కావాలి. ప్రయత్నపూర్వకంగా మనసుకు ధ్యానం, ప్రార్థన, పూజ, జపం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలవాటు చేసెయ్యాలి. నామస్మరణకు మనసుకు లంకె పెట్టాలి. మొదట మొరాయించినా నెమ్మదిగా మనసు అలవాటు పడిపోతుంది. ఓపిక పట్టాలి. అప్పుడు ఆ మనసుతో గొప్పగొప్ప పనులెన్నో చేయించుకోవచ్చు అంటారు జ్ఞానులు.

 - ఆనందసాయి స్వామి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న