ఉద్యోగం పురుషార్థం

అంతర్యామి

ఉద్యోగం పురుషార్థం

ర్థవంతమైన భవిష్యత్తుకు వర్తమానంలోనే ప్రణాళికలు వేసుకుంటాం. నేడు ఎంతటి విలువలతో, నిజాయతీతో, నిబద్ధతతో జీవిస్తే రేపటి జీవితం అంతటి ఉత్తమంగా, ఉన్నతంగా ఉంటుందన్నది వాస్తవం.
ఉద్యోగం పురుష లక్షణం. పురుషార్థాల సాధనలో ఎంతో ముఖ్యమైనది. సమాజం అనేక వృత్తులమయం. వృత్తి ఏదైనా నియమానుసారం, కట్టు తప్పకుండా చేస్తే ఉద్యోగధర్మం అంటారు. ధర్మబద్ధంగా నెరవేర్చే బాధ్యత సంతృప్తిని ఇస్తుంది.
కొంతమంది జీవించడం కోసం, జానెడు పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఉద్యోగం అనుకొంటారు. సిఫార్సులకు విలువివ్వకుండా, లంచాలు తీసుకోకుండా తమ పదవికి వన్నె తెస్తూ, నిప్పులా ఉద్యోగధర్మం నిర్వర్తిస్తారు. మరికొంతమంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆడంబర జీవితానికై అర్రులు చాస్తూ, అక్రమ సంపాదన కోసం గోతి కింద నక్కలా ఎదురుచూస్తూ కుర్చీకి మచ్చ తీసుకొస్తారు. అవసరార్థం తమ వద్దకు వచ్చేవాళ్లను పీక్కు తింటారు. మితిమీరిన లాభార్జన కోసం చేసే తప్పుడు పని, నకిలీ, కల్తీలు- ఎంతమంది మీద ఏ ప్రభావం చూపుతాయో, ఎన్ని జీవితాలను బలి తీసుకుంటాయో అనూహ్యం. ఏమీ చేయలేని నిస్సహాయత బాధితులది.
వృత్తిని దైవంలా భావించి సేవాభావ దృక్పథంతో మెలిగే ఉపాధ్యాయులు వెలిగించిన జ్ఞాన జ్యోతులు ప్రపంచమంతా పరచు కుని వెలుగులు పంచుతాయి. వైద్యులు అపరబ్రహ్మలై కొడిగట్ట బోతున్న దీపాలకు ఔషధ చమురు పోసి జాజ్వల్యమానం చేయడం సృష్టికి ప్రతిసృష్టి. సాంకేతిక నిపుణులు కట్టిన ఆనకట్టలు, వారధులు ఎన్ని ఏళ్లయినా చెక్కుచెదరకుండా దేశ ఆర్థిక ఉన్నతిలో పాలుపంచుకుంటూ ఉంటాయి.
తమ కుటుంబాలను వదిలి ఎక్కడో దూరంగా సరిహద్దుల వద్ద, మనుషులు మసలలేని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, శత్రువులు చొరబడకుండా దేశాన్ని కాపాడే వీరజవానులు, అన్యాయం అధర్మం పెచ్చరిల్లకుండా కాపాడే రక్షకభటులు, న్యాయదేవతకు పర్యాయపదంగా ధర్మానికి కట్టుబడే న్యాయవాదులు, ఊరిలో మురికి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు... ఇలా ఎంతోమంది తమ పనికి న్యాయం చేకూరిస్తేనే, సమాజం ఆరోగ్యంతో మిసమిసలాడుతుంది.
ఆలయ సందర్శనలు, దేవుళ్లు, భక్తి, పూజలు కాదు... ఆధ్యాత్మికత అంటే. వృత్తిలో దైవాన్ని చూస్తూ, పనిలో నియమ నిష్ఠలు పాటించేవారు నిజమైన భక్తులు. వారిని దైవం సదా కాచుకుని ఉంటాడన్నది సత్యం. ఎంతో చిన్నది జీవితం. అందులో మరీ చిన్నది ఉద్యోగ జీవితం. దాన్ని సక్రమంగా, నీతి, నిజాయతీలతో నెరవేర్చాలి.
సేవ చేసే అవకాశం స్వామీజీలకు మాత్రమే కాదు- ఉద్యోగులకూ ఇచ్చాడు భగవంతుడు. మానవజన్మలోని ఉద్యోగధర్మాన్ని ఆకళించుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఉదరపోషణార్థం ఉద్యోగం అయినప్పటికీ, గంగలా స్వచ్ఛంగా ఉంటూ, పవిత్ర సేవాభావం కనబరచేవారు కారుణ్యమూర్తులు. వారు నరుల మధ్య కదలాడుతున్న నారాయణ స్వరూపులు... వారి రుణం తీర్చుకోలేం.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న