పరలోక సంపదలు

అంతర్యామి

పరలోక సంపదలు

శాస్త్రాలను అందరూ సంపూర్ణంగా నమ్మరు. హేతువులు, రుజువులు కోరతారు. ఇప్పటికిప్పుడు దేవుణ్ని చూపకపోతే నమ్మను అనేవాళ్లకు ఎవరూ నచ్చజెప్పలేరు. వివేకానందుడు కూడా ఇలా అడిగినవాడే... ప్రశ్నించింది రామకృష్ణ పరమహంసను కాబట్టి, ఆయన చూపగలిగాడు. అదే వివేకానందుల జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఇలా అందరికీ జరగదు... ఈ ప్రపంచంలో మరొక వివేకానందుడికి అవకాశం లేదు. ఎవరి ప్రజ్ఞ వారిది. సాధారణ వ్యక్తులు కూడా కృషి, పట్టుదలతో అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చు. దివ్యాంగులు కూడా ఎవరికీ ఏమీ తీసిపోరు.
సచ్ఛీలం, నియమబద్ధ జీవితం మనిషికి రక్షా కవచాలు. వీటిని వదలనంతకాలం మనిషి క్షేమంగా ఉంటాడు. రంతిదేవుడి అతిథి సేవా నియమాన్ని స్వయంగా దేవేంద్రుడే భిక్షుక రూపంలో పరీక్షించిన కథ ఉంది. ఆ పరీక్షలో నెగ్గిన రంతిదేవుడికి పరలోక సంపదల్ని ఇంద్రుడు అనుగ్రహించినట్లు చెబుతారు.
అవధూతలు ఎలాంటి సంపదలూ కోరరు. ప్రకృతి, వారూ వేరు కాదు. లోకాలన్నీ క్షేమంగా ఉండాలనే ఏకైక కాంక్షతో అవధూతలు తపస్సు చేస్తారు. ప్రకృతి లాగానే రాగద్వేషాలకు అతీతంగా, సమభావంతో ఉంటారు. రమణులు, రామకృష్ణులు ఈ కోవకు చెందినవారే. అనంతమైన సంపద భగవంతుడి సొత్తు. కోరినవారికి కోరినంత, కోరనివారికి అనంతమైన అనుగ్రహం లభిస్తుంది. సముద్రంలోంచి ఎన్ని నీళ్లు తీసుకున్నా, తరగవు. దైవకృప కూడా అంతే. ఎందర్ని అనుగ్రహించినా ఆ కృప తరగదు.
ఈ పరమసత్యం తెలుసుకోలేక తీరని కోరికల దాహంతో మనిషి అలమటిస్తుంటాడు. భగవంతుడు నావాడే అనుకోగలిగి, బలమైన విశ్వాసంతో ఉంటే, కోరాల్సినవేముంటాయి? చక్రవర్తి కుమారుడు సహజంగానే రాజ్య సంపదలకు అర్హుడు. ఇక ప్రత్యేకంగా కోరాల్సిన పనేముంది? భక్తుడికి భగవంతుడి అనుగ్రహ సంపదే అత్యంత ఘనమైనది కదా. కానీ, ఎవరూ దీని గురించి ఆలోచించరు.
ఎవరు ఎంత కూడబెట్టినా చివరి ప్రయాణంలో ఏదీ వెంట రాదు. అలెగ్జాండరు ఇదే సందేశాన్ని- శవపేటికలో నుంచి ఖాళీ చేతులు బయటపెట్టి ఇచ్చాడంటారు. మన కళ్లతో మనం చూస్తూనే ఉన్నాం. ఇహలోక సంపదలన్నీ ఇక్కడే వదిలేస్తారు. చివరకు శరీరం కూడా. భారతీయ సనాతన ధర్మంలోనే కాదు, అన్ని ప్రముఖ ధర్మాల్లో మనిషి తన జీవితంలో చేయవలసిన సత్కర్మల గురించి సుబోధకంగా చెప్పారు. కొన్ని సందర్భాల్లో మంచివాళ్లకు కష్టాలు, చెడ్డవాళ్లకు సుఖాలు కలుగుతుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు వీటిని పట్టించుకోరు.
విశ్వాసం వ్యక్తిగతం. మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తామన్నది మన ఇష్టం. దాన్ని తప్పుపట్టడం, అవహేళన చెయ్యడం కుసంస్కారం. వాళ్లతో పేచీలు పెట్టుకోనవసరంలేదు. మౌనం, మందహాసమే వారికి తగిన సమాధానం.
మనిషికి ధనసంపద కంటే గుణసంపదే గౌరవాన్ని ఇస్తుంది. ఆహారాన్ని పంచకుండా తినడం పాపం అంటాడు గురునానక్‌. పొరుగువాడు పస్తులుంటే వారికి ఆహారం ఇవ్వకుండా తినడం మహాదోషం అంటుంది ఇస్లాం.  కరుణకు మారుపేరు క్రీస్తు. అసలు ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అంటుంది సనాతన ధర్మం. చాలా ధర్మాలు ఆదాయంలో పదిశాతం దానధర్మాలు చేయాలని చెబుతాయి. సిక్కులు దీనిని ‘దశ్వంత్‌’ అంటారు. ఇస్లామ్‌ ధర్మంలో ‘జకాత్‌’గా వ్యవహరిస్తారు.
దానగుణం కూడా ఒక అమూల్య ఆభరణమే. అయితే, తన్ను మాలిన ధర్మంగా ఏ పనీ చెయ్యకూడదు. అలాగే, అపాత్ర దానం కూడా మంచిదికాదు. ధర్మకార్యాలకు దానాలు చెయ్యడం వల్ల ఆత్మ పరిశుద్ధమవుతుంది. మనసులోని కాలుష్యం తొలగిపోతుంది.

- కాటూరు రవీంద్ర తివిక్రమ్‌


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న