భాగవత ఫలం
close

అంతర్యామి

భాగవత ఫలం

లోకంలో పుట్టిన ప్రతి మనిషీ తాను బతికి ఉన్నంత కాలం సుఖసంపదలు, అభ్యుదయాలు కలుగుతూ ఉండాలని, జీవితం ప్రశాంతంగా కొనసాగాలని, ఎలాంటి అవరోధాలూ ఉండరాదని కోరుకుంటాడు. తానుచేసే ప్రతిపనికీ ఫలితం లభించాలని ఆశిస్తాడు. మరణం కూడా ఏ యాతన లేకుండా సునాయాసంగా లభించాలని దేవతలను ప్రార్థిస్తాడు.
మనిషిని బాధపెట్టే తాపాలు (దుఃఖాలు) మూడు ఉన్నాయని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అవే ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక తాపాలు. వీటినే ‘తాప త్రయాలు’ అని పిలుస్తారు. ఆధ్యాత్మిక తాపాలంటే మానసిక, శారీరక రోగాలు. మనిషి పైకి ఎంత అందంగా ఉన్నా అతడి మనసు అంత అందంగా ఉంటుందని చెప్పలేం. మనసులో ఎన్నో ఆందోళనలు, అలజడులూ ఉండవచ్చు. ఇక శారీరక రోగాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ముసురుపడితే జలుబు, ఎండకాస్తే వేడి, చలి విజృంభిస్తే వణుకు ఇలాంటి చిన్న బాధలు మొదలుకొని ఎంతకూ నయంకాని రోగాలు మనిషిని చుట్టుముట్టి అతడికి సౌఖ్యాన్ని దూరంచేస్తాయి. ఆధిదైవిక తాపాలలో అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి బీభత్సాలు, భూకంపాలు, పిడుగుపాట్లు, రాళ్ళవానలు, కరవుకాటకాలు ఆవిర్భవిస్తాయి. మనిషిని కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఆధిభౌతిక తాపాలంటే పాముకాట్లు విషకీటకాల విజృంభణ, క్రూరమృగాలు, జంతువుల వల్ల కలిగే బాధలు, కష్టనష్టాలు. ఈ మూడు విధాల తాపాలను తట్టుకొని మనిషి నూరేళ్లు బతకడం అంటే గొప్ప విజయమే.
ఇలా మనిషి జన్మ పరమ దుఃఖభూయిష్ఠంగా సాగడం ఎవరికైనా బాధను కలిగిస్తుంది. మానవాళిలో ఉన్నతులు, ఉత్తములు, ఫలాపేక్షలేని వారైన మహర్షులకు మానవులపై అపారమైన కారుణ్యం ఉంది. అందుకే వారు ఏళ్ల తరబడి తపస్సుచేసి సాధించిన దివ్యజ్ఞానంతో మానవాళిని తరింపజేసే సాహిత్యాన్ని సృష్టించారు. తాపత్రయాలతో తల్లడిల్లుతున్న మానవులకు తరణోపాయాలను చూపించారు. అలాంటి ఉపాయాల్లో అత్యున్నతమైంది ‘భాగవతం’.
‘ఈ భాగవతం ఎలాంటి అసత్యాలు లేని ఉత్కృష్ట గ్రంథం. ఇందులో ఎలాంటి లంపటాలులేని శాశ్వతా నందదాయక మోక్ష విషయాలే ఉంటాయి. ముక్తిని (ఏ తాపాలూ లేని ప్రశాంత స్థితిని) కోరేవారికి ఈ పుస్తకం అమృతపాత్ర వంటిది.  ఇందులోని కథలన్నీ మనిషికి పరమసౌఖ్యాన్ని అందిస్తాయి. మనసును విక సింపజేస్తాయి. ఈ గ్రంథాన్ని చదివితే తాపత్రయాలు దూరమవుతాయి. ఇందుకు ఉదాహరణ పరీక్షిత్తు వృత్తాంతమే.
పూర్వం పరీక్షిత్తు అనే మహారాజు వేటకు వెళ్ళి దారి తప్పతాడు. ఒక ముని ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ తపోధ్యానంలో ఉన్న శమీకుడు కనిపిస్తాడు. బదులివ్వని ముని మెడలో అక్కడ చచ్చిపడి ఉన్న పామును వేసి రాజు వెళ్ళిపోతాడు. కొంత సేపటికి వచ్చిన ముని కుమారుడు శృంగి తండ్రికి అవమానం జరిగిందని రగిలిపోతాడు. అలా చేసినవాడు ఏడురోజుల్లో తక్షకుడి కాటుతో చనిపోతాడని శపిస్తాడు. ధ్యానం నుంచి మేల్కొన్న శమీకుడు ఇదంతా తెలుసుకుని చింతించి, పరీక్షిత్తుకు సమాచారం పంపిస్తాడు. పరీక్షిత్తు తాను చేసిన అపరాధానికి పశ్చాత్తాపం చెంది, పరమ దయాళువైన శుకమహర్షిని ఆశ్రయించి, తనకు మోక్షం లభించే మార్గాన్ని ఉపదేశించమన్నాడు. అప్పుడు శుకుడు ఈ ఏడుదినాలూ భాగవత కథలను వింటూ, కాలక్షేపం చేయమని చెప్పాడు.
భాగవతం చదివితే ఇతర శాస్త్రాల అవసరం ఉండదని హృదయం భగవంతుడిలో స్థిరంగా నిలుస్తుందని చెప్పాడు వ్యాసుడు. ఈ మాట అక్షరసత్యం.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న