బుద్ధిమంతులు
close

అంతర్యామి

బుద్ధిమంతులు

‘నీకు బుద్ధుందా?’ అని ఒక వ్యక్తి ఎవరినో గద్దిస్తుంటే అవతలి వ్యక్తి తెలివితక్కువ పని చేశాడనో, ఇంగితజ్ఞానం లేనివాడనో మనకు అర్థమవుతుంది. ‘అతడు చాలా బుద్ధిమంతుడు’ అని ఎవరి గురించైనా మరొకరు వ్యాఖ్యానిస్తే- ఆ వ్యక్తి సత్ప్రవర్తన గలవాడని భావిస్తాం. తెలివి, జ్ఞానం గలవారిని బుద్ధిమంతులుగా పరిగణించడం పరిపాటి. బుద్ధిని ‘ధీ’ అని కూడా అంటారు. బుద్ధికి ‘మతి’ అని నైఘంటికార్థం ఉంది. ‘ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు గాని ఏండ్లు మీరిన వాడా వృద్ధుడు’ అన్నాడు నీతిచంద్రిక కారుడు. ఇక్కడ బుద్ధి అంటే తెలివి, మతి అనే అర్థం.
‘మతియ కదా కృషి బీజము’ అన్నాడు మంచెన ‘కేయూర బాహుచరిత్ర’లో. ఏ విధమైన కృషి సాగించాలన్నా బుద్ధి మూలమని భావం. బుద్ధి మన పూర్వ కర్మలను అనుసరించి ప్రవర్తిస్తుందని ఆర్షవాక్కు. భూమికంటె జలం, జలంకన్నా అగ్ని, అంతకన్నా గాలి, దానికన్నా ఆకాశం గొప్పవని, వాటన్నింటికంటె మనసు, మనసుకన్నా బుద్ధి గొప్పవని తిక్కన మహాభారతం శాంతి పర్వంలో పేర్కొన్నాడు.
లోకవ్యవహారంలో ‘బుద్ధి’ అనే మాట ఈ విధంగా ప్రాచుర్యంలో ఉండగా ఆధ్యాత్మికం గాను, సాహిత్య శాస్త్రంలోను బుద్ధి విశేషార్థాలు కలిగి ఉంది. బుద్ధి అంతరింద్రియం. మనసు, చిత్తం, అహంకారాలు మిగిలినవి. బుద్ధి ఆరు విధాలని వైజయంతీ కోశం పేర్కొన్నది. అవి 1.పండ, 2.మేధ, 3.చార్వి, 4.గృహీతి, 5.శ్రౌషి, 6.చత్వరి. కవిత్వ రచనకు ఈ ఆరు విధాలైన బుద్ధి అవసరమని ప్రాచీనాలంకారికులు భావించారు.
పండ అనే బుద్ధి గలవాడు పండితుడు. పండితులందరూ కవులు కాకపోవచ్చు. కాని విద్వత్కవు లుంటారు. జ్ఞాపక శక్తికి సంబంధించిన బుద్ధిని మేధ అంటారు. కావ్యమీమాంస బుద్ధిని మూడు రకాలుగా వర్గీకరించింది. జరిగిపోయిన దాన్ని గుర్తుచేసేది స్మృతి. జరుగుతున్న దాన్ని ఆలోచింపజేసేది మతి. జరగబోయే దాన్ని తెలుసుకునేది ప్రజ్ఞ. అవధానం చేసేవారికి దృఢమైన జ్ఞాపక శక్తి అవసరం. దీనినే ధారణాబల మంటారు. చార్వి అంటే ఊహాపోహలు చేసే సామర్థ్యం. కవిత్వానికి ఇది ఒరపిడిరాయి. ఆలోచనలకు మూలమైనది. విషయాన్ని గ్రహించి వివేచనతో అయుక్తమైన విషయాలను వదలివేసే బుద్ధి ఇది. గ్రహణ సామర్థ్యం గల బుద్ధిని గృహీతి అంటారు. లోకవృత్తాన్ని గ్రహించడంలోను, వ్యక్తం చేయడంలోను ఈ బుద్ధి ఉపయోగపడుతుంది. శుశ్రూషవల్ల పెరిగే బుద్ధి శ్రౌషి. గురువులను సేవించడం వల్ల బుద్ధి పెరగడం గురుకుల విద్యలో సాధారణం. వినికిడి వల్ల పెరిగే బుద్ధిని చత్వరి అంటారు. ప్రవక్తలు, పండితులు, ఆచార్యుల ఉపదేశాలు, ప్రవచనాలు వినడం వల్ల బుద్ధి వికసిస్తుంది. అర్థజ్ఞానం తత్వజ్ఞానం అనే వాటినీ బుద్ధి గుణాలుగా కొందరు చెబుతారు.
సమాజంలో సుబుద్ధులు, దుర్బుద్ధులు అని మనుషుల్ని వేరుచేసి చూస్తాం. ఇక్కడ బుద్ధి అంటే మంచి ఆలోచన. మంచి ఆలోచనలు చేసేవాడు ఎప్పుడూ సమాజానికి హితకారి. దానికి భిన్నంగా దుర్బుద్ధుల మతి విపరీతంగా పనిచేస్తుంది. దుర్బుద్ధి నీలిమందుతో తయారుచేసిన వస్త్రం లాంటి వాడంటాడు రాజశేఖరుడనే ఆలంకారికుడు. బుద్ధిశాలి దేశకాలాలు తెలుసుకొని కార్యనిర్వహణ చేస్తాడు. విపత్కర పరిస్థితుల్లోనూ శోకించడు. ధైర్యం వహిస్తాడు. ఎవరి బుద్ధి బలమైనా వారికేగాక చుట్టూ ఉన్న వారికీ ఉపకరించాలి. ‘దేవుడిచ్చినట్టి బుద్ధి దేవునిపయిబెట్టక’ పోవడాన్ని తప్పుపట్టాడు అన్నమయ్య. ప్రాణికోటిలో మనిషికి బుద్ధి ఒక వరమైతే దాన్ని ప్రసాదించినవాడు భగవంతుడు. బుద్ధిని భగవన్మయం చేసినప్పుడు అది సమాజ కల్యాణానికి దోహదం చేస్తుంది.

- డి.భారతీదేవి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న