ఆప్త కదంబం
close

అంతర్యామి

ఆప్త కదంబం

నిషి ఏకాకిగా మనలేడు. విజయం సాధించినప్పుడు ఆనందం పంచుకునేది, బాధ కలిగినప్పుడు సాంత్వన కలిగించేది- బంధుమిత్రుల ఆప్తకదంబమే.
ఆత్మీయులైన పెద్దల ఆశీస్సులే బాలలకు శ్రీరామరక్ష. బాల్యం వికసించడానికి తల్లిదండ్రుల అండదండలు కలిసివస్తాయి. బడిలో స్నేహితులు తోడుంటారు. గురువులు పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆటపాటలకు తోటిబాలలు కలిసివస్తారు. బంధువుల రాకపోకలు ఉత్తేజపరుస్తాయి. ఈ ఆప్తకదంబం సహకారంతోనే బాల్యం అర్థవంతమవుతుంది.
యౌవనంలో మిత్రబృందం సహకారం తోడవుతుంది. స్నేహసౌరభం యువతను ఉత్సాహపరుస్తుంది. మంచిమిత్రుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. వివాహానంతరం భార్యాభర్తల కుటుంబాల కలయికతో ఆప్తకదంబం మరింత విస్తరిస్తుంది. మూడుముళ్ల బంధంతో సంతానం వృద్ధిచెంది మూడు తరాల ఆప్తకదంబం ముచ్చట గొలుపుతుంది.
ఆప్తకదంబమే వృద్ధాప్యంలో ఆరోగ్య ప్రదాత. అది మలిసంధ్యలో మానసిక బలం. గతంలో దరి చేర్చుకున్న ఆత్మీయులు వృద్ధాప్యంలో ఆసరా అవుతారు. మనిషి మరణించాక జీవించేది ఆత్మకదంబం అంతరంగంలోనే.
అన్ని వయసుల వారితో అలరారే కుటుంబాలు బాంధవ్య తోరణాలతో కళకళలాడతాయి. చిన్నారుల కేరింతలు, యువతీ యువకుల ముచ్చట్లు, వృద్ధుల హితోక్తులు కలగలిసిన లోగిళ్లలో ఆనందపు హరివిల్లులు వెల్లివిరుస్తాయి.
శుభకార్యాల్లో బంధుమిత్రుల ఆత్మీయ పలకరింతలు పులకరింపజేస్తాయి. బంధుమిత్రులతో కలిసి గడిపిన రోజులు మధురస్మృతులుగా మిగులుతాయి. పండుగలు, తిరునాళ్లు, ఊరేగింపులు, ఉత్సవాలు... మనిషి ఉల్లాసానికి, ఉత్సాహానికి ఉత్ప్రేరకాలు. ఈ కార్యక్రమాలు నిస్సారంగా సాగుతున్న జీవనయాత్రను ఉత్సాహభరితం చేస్తాయి. స్నేహబంధాలు పెనవేసుకోవడానికి దోహదంచేస్తాయి.
అహంకారం ఆత్మీయులను దూరం చేస్తుంది. కోపం కుటుంబ కలహాలకు కారణభూతమవుతుంది. మాత్సర్యం మిత్రుల మధ్య చిచ్చు పెడుతుంది. లోభం ఎవరినీ దగ్గరికి రానీయదు. ఈ దుర్గుణాలను మనసున చేరనీయక మంచి భావనలతో మనగలవారికి ఊరంతా మిత్రులవుతారు. మంచి స్నేహితులున్నవారికి ఔషధం అవసరం రాదన్నాడు భర్తృహరి. జ్ఞాన విజ్ఞాన సంపన్నులు, గుణవంతులు, లోపరహితులు, మధుర స్వభావులైన ఉత్తములతో మైత్రి హితకరమైనదని భారతం బోధిస్తోంది.
సామాన్యుల ఆప్తకదంబం కొన్ని పరిమితులకు లోబడుతుంది. దేశం కోసం నిస్వార్థంగా శ్రమించే దేశభక్తులను దేశ ప్రజలందరూ ప్రేమిస్తారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికులకు ఆసేతు హిమాచలం ఆప్తకదంబమే. ప్రపంచ నాయకుల ఆప్తకదంబం ఎల్లలు లేనిది.
రెండు అడుగులతోనే జగత్తును ఆక్రమించిన ఆది మధ్యాంత రహితుడు సృష్టిలోని జీవులందరికీ పరమాప్తుడు. ఆప్తకదంబానికి అండాదండా ఆశ్రిత వత్సలుడు అనంతుడే. సత్యం తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం స్నేహితుడు, శాంతం సహధర్మచారిణి, క్షమాగుణం కుమారుడిగా భావించాలి. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతం, క్షమ అనే ఆరు మంచి లక్షణాలను ఆత్మ బంధువులుగా చేసుకుని జీవనం సాగించాలన్న హితోపదేశం సర్వులకూ అనుసరణీయం.

 - ఇంద్రగంటి నరసింహమూర్తి


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న